
సాక్షి, ఆదిలాబాద్ : మావోయిస్టులు, అనుబంధ సంఘలతో సంబంధాలు నేరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రాంత ప్రజలను డీజీపీ హెచ‍్చరించారు. ఆదివాసీలు-లంబాడాల గొడవల నేపధ‍్యంలో మావోలు అదనుగా తీసుకునే అవకాశం ఉందని ఆయన పోలీసులను హెచ‍్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం ఉట్నూరులో పర‍్యటించిన డీజీపీ మహేందర్‌రెడ్డి శాంతిభద్రతలు, లంబాడీ - ఆదివాసీల వివాదంపై పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఐజీలు, కమిషనర్లు, ఎస్పీలు, డీఐజీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జనజీవనం, విద్యార్థుల చదువుకు విఘాతం కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ, ఐటీడీఏ అధికారులతో కలిసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు మహేందర్‌రెడ్డి సూచించారు.
పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో లంబాడాలు-ఆదివాసీల మధ్య ఘర్షణలు తెలుత్తుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెద్దఎత్తున ఘర్షణలు చోటుచేసుకుని పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా అక్కడి పరిస్థితి ఉంది. కాగా... ఘర్షణలను ముందే పసిగట్టలేకపోవడం, వాటిని అదుపు చేయలేకపోయారన్న కారణంతో మూడు జిల్లాల కలెక్టర్లు, ఓ డీఐజీని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఘర్షణలను అరికట్టలేకపోయారన్న అపవాదును పోలీస్ శాఖ మూటకట్టుకున్న నేపధ్యంలో డీజీపీయే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.