ఉట్నూర్, (జన్నారం)/సిర్పూర్(టి)/లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ : జన్నారం మండల కేంద్రంలో కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం మంగేళ గ్రామానికి చెందిన ప్రేమ జంట శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలో ఉన్న వీరిని మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందారు. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం మంగేళకు చెందిన రోండి రంజిత్ (21), పడిగెల వనజ (16) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
రంజిత్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతుండగా వనజ పదో తరగతితో చదువు మానేసి ఇంట్లోనే ఉంటూ బీడీలు చుడుతోంది. కులాలు వేరు కావడంతో వీరి ప్రేమ, పెళ్లికి పెద్దలు అంగీకరించబోరని భయపడ్డారు. ఈ క్రమంలో వారిద్దరూ శనివారం జన్నారం మండల కేంద్రానికి చేరుకున్నారు. క్రిమిసంహారక మందు తాగి బస్టాండ్ ప్రాంతం నుంచి కాలినడకన వస్తూ పాతబస్టాండ్ మార్కెట్ ప్రధాన రహదారి వద్దకు చేరుకోగానే హఠాత్తుగా కింద పడిపోయూరు. అక్కడే ఉన్న వారు 108 సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం లక్సెట్టిపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయూరు. సంఘటన స్థలాన్ని ఇన్‌చార్జి ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. అబ్బారుు వద్ద లభించిన ఆధార్ కార్డు, సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్ల ఆధారంగా ప్రేమజంటది మంగేళ గ్రామంగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. వీరి మృతికి పూర్తి వివరాలు తెలియరాలేదని, బంధువులకు సమాచారం అందించామని చెప్పారు. ఎవరి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో స్థానికులు చలించిపోయూరు.
తాతామనవడు మృతి
సిర్పూర్(టి)కి చెందిన ఎంఏ అజీజ్ (75), కోడలు జాకీరా (40), మరికొంత మంది బంధువులతో కలిసి మంచిర్యాలలోని పెద్ద కొడుకు అజీజ్ వద్దకు గురువారం వెళ్లాడు. శుక్రవారం అర్ధరాత్రి రైలు ద్వారా సిర్పూర్(టి)కి వచ్చారు. వారిని తీసుకురావడానికి జాకీరా కొడుకు, అజీజ్ మనవడు ఎంఏ అల్లూష్ (18) ఆటో తీసుకుని స్టేషన్‌కు వెళ్లాడు. వారిని తీసుకుని వస్తున్న క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అజీజ్, అల్లూష్ అక్కడికక్కడే చనిపోయారు. మిగతా వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. అజీజ్ వికలాంగ ధ్రువీకరణ పత్రం పొందేందుకు మంచిర్యాలకు వెళ్లాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడంతో వారి ఇంట్లో విషాదం నెలకొంది. కిలోమీటరు దూరంలో ఉన్న ఇంటికి వస్తున్న క్రమంలో ప్రమాదం జరగడం అందరినీ కలిచివేసింది.
కుటుంబ కలహాలతో..
లక్సెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పేరం గురువయ్య (40), ఉమ (35) దంపతులు. వీరికి ఇరవై ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి సౌజన్య, మేఘన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొద్ది రోజులుగా గురువయ్య అతిగా మద్యం తాగి వచ్చి నిత్యం భార్యతో గొడవపడుతుండే వాడు. రోజూ ఎందుకు తాగుతున్నావు.. ఎందుకు గొడవ పెడుతున్నావని ఉమ మందలిస్తుండేది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం కూరగాయలు తీసుకురావడానికి తోట వద్దకు వెళ్లారు. కూరగాయలు తెంపాలని గురువయ్యను ఉమ కోరగా వినిపించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ అక్కడే ఉన్న పురుగుల మందు తాగారు. ఇరువురిని స్థానికులు ఆస్పత్రికి తీసుకురాగా ఉమ చనిపోయింది. గురువయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మృతురాలి తమ్ముడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌కే లతీఫ్ తెలిపారు.
వేర్వేరుగా ఐదుగురి మృత్యువాత
Published Sun, Dec 22 2013 3:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement