ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థుల అడుగులో అడుగై.. నీడలా వెంటాడే యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. ఓటర్లను ఆకర్షించేందుకు గతంలో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసేవారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోరింగ్‌లు, గోడరాతలతో ప్రచారాన్ని హోరెత్తించేవారు. ఫలితంగా ప్రచార వ్యయం పరిమితి దాటిపోయేది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క చెప్పేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థి రూ.లక్ష, జెడ్పీటీసీ అభ్యర్థి రూ.2లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. అభ్యర్థి గుండుపిన్ను కొనుగోలు చేసినా ఆ విషయం అధికారులకు తెలిసేలా చర్యలు చేపట్టారు.
ప్రచారంలో ఎంతమంది పాల్గొంటున్నారు, వారికి రోజు ఎంత ఖర్చు చేస్తున్నారు, తదితర క్షేత్ర స్థాయి సమాచారాన్ని నిఘా సిబ్బంది అధికారులకు చేరవేస్తున్నారు. ఎన్నికల సంఘం అభ్యర్థులకు అందించిన ఒకటి, రెండు ప్రొఫార్మాలో వివరాలు నమోదు చేసి సమర్పించాలి. వీటిని అభ్యర్థి లేదా అతని తరఫు ఏజెంట్లు(లెక్కల నిర్వహణ కోసం నియమించిన వారు) అందించవచ్చు. వీటిని స్వీకరించిన అధికారులు ఎన్నికల ఖర్చు పరిశీలనకు పంపిస్తారు. ఖర్చు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా అభ్యర్థులపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
నాలుగు రకాలుగా నిఘా
బరిలో ఉన్న అభ్యర్థులపై అధికార యంత్రాంగం నాలుగు రకాలుగా నిఘా పెట్టింది. వీరు అభ్యర్థులు పాటిస్తున్న ఎన్నికల నిబంధనలు, చేస్తున్న ఖర్చు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మొదటిది.. ఎంసీసీ(మాడల్ కోడ్ కండక్ట్) ఈ విభాగంలో ఎంపీడీవో, వీడియో గ్రాఫర్, ఇద్దరు పోలీసులు ఉంటారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది పరిశీలిస్తారు. రెండోది.. ఫ్లయింగ్‌స్క్వాడ్ ఈ విభాగంలో డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి, వీడియోగ్రాఫర్, ఒక పోలీసు ఉంటారు. వీరు అభ్యర్థుల ఖర్చు వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. మూడోది.. ఎస్‌ఎస్‌టీ(సర్వేలైన్ స్టాటిస్టికల్ టీం) ఇందులో డెప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి, పోలీసు, వీడియో గ్రాఫర్ ఉంటారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర అంశాలు పరిశీలిస్తుంటారు. నాలుగోది.. వీడియో వింగ్ టీం పత్రికల్లో, టీవీల్లో అభ్యర్థుల ప్రచారంపై వస్తున్న ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్, పత్రిక ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం తదితర అంశాలను పరిశీలించి నివేదిస్తారు.
ఖర్చు వివరాలు తెలుపకుంటే చర్యలు
అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఖర్చు వివరాలు తెలుపకుంటే కఠిన చర్యలు ఉంటాయి. మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అనుమతి లేకుండా అతని విజయం కోసం ఎవరైన ఖర్చు చేస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ప్రచార ఖర్చు లెక్క చెప్పాల్సిందే..
Published Thu, Apr 3 2014 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement