జాతీయ బాక్సింగ్ పోటీలకు ఐఏబీఎఫ్ సన్నాహాలు
గుర్తింపు లేదని తేల్చిన ఐబా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) తమ సభ్యత్వాన్ని రద్దు చేసినా భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్) అధికారుల వైఖరిలో మార్పు రావడం లేదు. తమ ఆధ్వర్యంలో పురుషుల, మహిళల జాతీయ చాంపియన్‌షిప్‌లను జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
అయితే ఇలాంటి కార్యక్రమాలకు తమ ఆమోదం ఉండదని ఇదివరకే ఐబా తేల్చి చెప్పింది. మే 18 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో పురుషుల జాతీయ చాంపియన్‌షిప్, అదే నెల 8 నుంచి 11 వరకు ఐదో సీనియర్ మహిళా జాతీయ చాంపియన్‌షిప్‌ను జరుపుతామని మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా ఆయా రాష్ట్ర యూనిట్స్‌కు సమాచారమిచ్చారు.
అంతేకాకుండా మహిళల నేషనల్స్.. కామన్వెల్త్ గేమ్స్‌కు సెలక్షన్స్ ట్రయల్స్‌గా ఉపయోగపడతాయని కూడా ప్రకటించారు. కానీ భారత్ సభ్యత్వాన్ని రద్దు చేసిన కారణంగా ఈ ఈవెంట్స్‌కు అనుమతి లేదని ఐబా స్పష్టం చేసింది. ‘ప్రస్తుతానికి భారత్‌లో ఏ జాతీయ పోటీలను కూడా ఐబా గుర్తించడం లేదు. బాక్సింగ్ సమాఖ్యకు గుర్తింపు లేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐబా పీఆర్ అండ్ కమ్యూనికేషన్ డెరైక్టర్ సెబాస్టియన్ గిల్లట్ పేర్కొన్నారు.