స్వైన్‌ఫ్లూతో ఆందోళన
ఆస్పత్రులకు పోటెత్తుతున్న రోగులు
జలుబు,దగ్గుతో ఇబ్బందులు
సిద్దిపేటలో స్వైన్‌ఫ్లూతో ఆందోళన
కనిష్ట ఉష్ణోగ్రతలే కారణమంటున్న వైద్యులు
సంగారెడ్డి క్రైం: మెతుకుసీమను వైరల్ ఫీవర్ వణికిస్తోంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు, నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతల కారణంగానే ఈ వైరల్ ఫీవర్ విజృంభిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులతో పోల్చితే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 13 డిగ్రీలకు పడిపోయాయి. చలి తీవ్రత ఎక్కువ కావడంతో పాటు చలి గాలులు వీస్తుండటంతో ప్రజలు జలుబు, దగ్గు బారిన పడుతున్నారు. జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, పటాన్చెరు, జోగిపేట, గజ్వేల్, రామాయంపేట తదితర ప్రాంతాల్లో జనం వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సిద్దిపేటలోని ఖాదర్‌పురాకు చెందిన దొంత దేవరాజ్ అనే వ్యక్తి ఈ నెల 16న స్వైన్ ఫ్లూతో మరణి ంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా, చలి తీవ్రత బాగా పెరగడం వల్ల వ్యాధులు మరింతగా విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వారం రోజులుగా జ్వరాల తీవ్రత పెరిగిందని వారంటున్నారు.
సాధారణ వైరల్ ఫీవర్ అయితే మూడు లేదా నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని, అంతకంటే ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా, ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం ఉన్నా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు అనుమానించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రసుత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు దాదాపు వేయి మంది వరకు వస్తుండగా, ఇందులో 400 మంది రోగులు వైరల్ ఫీవర్‌తో బాధ పడుతూ వస్తున్న వారే ఉన్నారు. గత రెండు రోజుల నుంచి ఈ సంఖ్య మరింత పెరిగింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది.
నివారణ కు జాగ్రత్తలివే
కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్ బారిన పడకుండా ఉండవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి. ఫ్రిజ్‌లలోని ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో నేరుగా వాడకూడదు. ముఖ్యంగా పిల్లలకు చల్లని తినుబండారాలు, చల్లని ద్రవాలు ఇవ్వకూడదు. వేడిగా ఉన్న పదార్థాలనే తీసుకోవాలి. అలాగే ఉదయం పూట వాకింగ్ చేసే వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, చేతుల గ్లౌజ్‌లు ధరించాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.