Intensive Household Survey- 2014
-
'సమగ్ర సర్వేకు 2,332 మంది నిరాకరణ'
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే ప్రీ విజిట్‌లో 13.40 లక్షల కుటుంబాలను పరిశీలించారని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. 21,636 గృహాలు తాళాలు వేసున్నాయని చెప్పారు. 2,332 మంది సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారని వెల్లడించారు. ఇప్పటికే ఇంటింటికీ చెక్ లిస్ట్ లు పంపిణీ చేశామని చెప్పారు. ఏయే డాక్యుమెంట్లు అవసరమవుతాయో చెక్ లిస్టు ద్వారా తెలుస్తుందన్నారు. ఇందులో ఉన్నవన్ని దగ్గర పెట్టుకుంటే సర్వే తొందరగా పూర్తవుతుందన్నారు. సర్వేలో పూర్తి, పక్కా సమాచారం ఇస్తే మేలని సోమేష్‌కుమార్ అన్నారు. సర్వేకు సహరించాలని ప్రజలను కోరారు. సర్వే కోసం ఇళ్లకు వచ్చే ఎన్యుమరేటర్లకు ఎలాంటి జిరాక్సు కాపీలు ఇవ్వక్కర్లేదని స్పష్టం చేశారు. -
ఆ రోజు పెట్రోల్ బంకులు కూడా బంద్
హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వేకు తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సర్వే నిర్వహించనున్న ఈనెల 19న తెలంగాణ అంతటా ప్రభుత్వం సెలవుదినం ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు అన్నింటికీ సెలవిచ్చింది. బ్యాంకులు, విద్యాసంస్థలు, దుకాణాలు, పెట్రోల్ బంకులు కూడా తెరుచుకోవు. రంగారెడ్డి జిల్లా, జంట నగరాల పరిధిలో ఉన్న 350 పెట్రోలు బంకులు ఉదయం 6 నుంచి మూసివుంచాలని పెట్రోలియం డీలర్స్ ఫెడరేషన్ నిర్ణంయించింది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరగవు. ఒక్క వాహనం కూడా రోడ్డెక్కదని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సర్వే రోజున అందరూ తమ ఇళ్లలోనే ఉండి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. -
సమగ్ర కుటుంబ సర్వేకు సిద్ధం కండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉంచుకోవాల్సిన వివరాల జాబితాను జీహెచ్ఎంసీ అధికారులు రూపొందించారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు ముద్రించి దినపత్రికలతో పాటు ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్టర్‌ను అంటిస్తారు. దానిపై స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చినట్లు నమోదు చేసే బాక్స్‌లున్నాయి. ఎన్యూమరేటర్ ఫోన్ నంబరు కూడా ఉంటుంది. సందేహాలుంటే ఆ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పలిరిశీలించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవారు కుటుంబ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లాకనెక్షన్లకు సంబంధిం చిన బిల్లు రసీదులు, కుల, వికలాంగ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలి.