మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. విద్యార్థులు మే 1లోగా దరఖాస్తు చేసుకుని, పరీక్ష ఫీజు చెల్లించాలని, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేసింది. వొకేషనల్ కోర్సుల కు సంబంధించిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సిన పాత విద్యార్థులు ఈ ఒక్కసారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది.
అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పరీక్షలు రాయవచ్చు. జనరల్ కోర్సులకు సాధారణ ఫీజు రూ. 300, వొకేషనల్ కోర్సులైతే రూ. 400తోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ. 100 చొప్పున చెల్లించాలని బోర్డు పేర్కొంది. కాగా, విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1లోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్ కమ్ జవాబుపత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున చెల్లించాలి. మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్ష ఫీజులను చెల్లించవచ్చు. ఎథిక్స్, మానవీయ విలువలపై పరీక్షను జూన్ 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 9న నిర్వస్తారు. వొకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.