inter college
-
‘ఇంటర్’ క్లాసులు చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్ : విద్యాసంవత్సరం మొదలైనా.. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో బోధన సాగడం లేదు. అన్నిచోట్ల అధ్యాపకుల కొరత వేధిస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏటా గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకునేవారు. ఫలితంగా బోధన అనుకున్న మేర జరిగేది.ఈ సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అసలు తీసుకుంటారా? లేదా? అనేది కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు త్వరగా సిలబస్ పూర్తి చేయాలి. అప్పుడే వారు జేఈఈ, రాష్ట్ర ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వెసులుబాటు ఉంటుంది. త్వరలో 1372 మంది కొత్త లెక్చరర్లు వస్తారని...పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించారు. త్వరలో ఫలితాలు వెల్లడించే అవకాశముంది. ఇంటర్వ్యూ లేకపోవడంతో మెరిట్ ప్రకారమే నియామకాలుంటాయి. దీంతో గెస్ట్ లెక్చరర్ల అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే గెస్ట్ లెక్చరర్ల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదంటున్నారు.అయితే వీరి అవసరాన్ని తెలియజేస్తూ ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రాలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలు చేపట్టి, ఆర్డర్లు ఇచ్చే వరకూ ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి.కొత్తగా వచ్చినవారు కాలేజీల్లో బోధన చేపట్టే వరకూ కొంత సమయం పడుతుందని అధ్యాపక సంఘాలు అంటున్నాయి. అప్పటి వరకూ కాలం వృథా అవుతుందని, ప్రభుత్వ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటున్నారు. బోధన సాగేదెలా..?నియామకాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటారా? లేదా? స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లో బోధన కుంటుపడుతోంది. ఈ పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందని అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రంలో 418 ప్రభుత్వ జూనియర్ కాలేజీఉన్నాయి. గత ఏడాది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులర్ చేశారు. వీరితో కలుపుకుంటే 3900 మంది శాశ్వత అధ్యాపకులున్నారు. మరో 72 మంది మినిమమ్ టైం స్కేల్‌తో పనిచేసే అధ్యాపకులున్నారు. ఇంకా 413 మందిని రెగ్యులర్ చేయాల్సి ఉంది. కొంతమంది రిటైర్ అయ్యారు. సర్వీస్ కమిషన్ ద్వారా 1372 పోస్టుల నియామకం జరిగినా కనీసం 2 వేల మంది అధ్యాపకుల కొరత ఉంటుంది. ఏటా రాష్ట్రంలో 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటున్నారు. వీరి సర్వీస్‌ను ప్రతీ ఏటా సంవత్సరం పాటు పొడిగిస్తూ వస్తున్నారు. వీరికి నెలకు రూ. 27 వేలు ఇస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల కన్నా ఎక్కువ క్లాసులే చెబుతున్నామనేది వారి వాదన. నిజానికి గడచిన ఐదేళ్లుగా ఒక్క సైన్స్ అధ్యాపకుడిని కూడా నియమించలేదు. మేథ్స్ లెక్చరర్ల కొరత ప్రతీ కాలేజీలోనూ ఉంది. రాష్ట్రంలో 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కనీస వసతులు కూడా లేవు. గదులు, బల్లాలు సమకూర్చలేదు. ఫ్యాకల్టీ అరకొరగా ఉంది. బదిలీలు చేపట్టకపోవడంతో కొత్తవారు వచ్చే అవకాశమే లేదు. ఇన్ని సమస్యల మధ్య గెస్ట్ లెక్చరర్లను తీసుకోకపోతే విద్యార్థులు నష్టపోతారని పలువురు అంటున్నారు. అవసరం ఉంటే తీసుకుంటాం అవసరం ఉంటే గెస్ట్ లెక్చరర్లను తీసుకుంటాం. ఎంతమేర అవసరం అనేది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. వీలైనంత త్వరగా ఇంటర్ కాలేజీల్లో పూర్తిస్థాయిలో బోధన చేపట్టేందుకు ప్రయత్నిస్తాం. –శ్రుతిఓజా, ఇంటర్ బోర్డ్ కార్యదర్శిగెస్ట్ లెక్చరర్లు లేకుంటే కష్టమే ప్రభుత్వ కాలేజీల్లో పేద విద్యార్థులు చదువుతారు. అవసరమైన బోధకులు ఉంటే తప్ప వారికి నాణ్యమైన విద్య అందించలేం. కొత్త కాలేజీల్లో వసతులు లేవు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల కొరత ఉంది. తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి, సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా చూడాలి. –మాచర్ల రామకృష్ణగౌడ్ ప్రభుత్వ ఇంటర్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి -
చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండి
మార్కులు రాలేదని తల్లి పెద్ద ర్యాంకు రాలేదని తండ్రి ఫలానా కోర్సు చదవాలని తల్లి ఆ కాలేజీలోనే చేర్పిస్తానని తండ్రి టీనేజ్ పిల్లలకు ఇది కీలక సమయం. వారు ఇంటర్లో, డిగ్రీలో చేరాలి. కాని పిల్లల మాట వింటున్నారా? మీరే గెలవాలని పట్టుబడుతున్నారా? అప్పుడు పిల్లలు లోలోపల నలిగి పోవడం కన్నా ఏం చేయలేరు. పత్రికల్లో వస్తున్న ఘటనలు హెచ్చరిస్తున్నాయి. ఆచితూచి అడుగు వేయండి.‘నువ్వు ఆ కోర్సు చేయాలనేది మా కల’ అనే మాట తల్లిదండ్రుల నుంచి వెలువడితే అది పిల్లల నెత్తిమీద ఎంత బరువుగా మారుతుందో పిల్లలకే తెలుసు. టీనేజ్ మొదలయ్యి టెన్త్ క్లాస్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ‘కలలు వ్యక్తపరచడం’ తల్లిదండ్రులు మొదలెడతారు. టెన్త్‌లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలో, ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లోకి వెళ్లాలో, అందుకు ఏ కాలేజీలో చేరాలో, ఆ కాలేజీ ఏ ఊళ్లో ఉంటే బాగుంటుందో ఇన్ని డిసైడ్ చేసి పిల్లలకు చెబుతుంటారు. పిల్లలు వినాలి. వారికి ఏ అభిప్రాయం లేకుండా ఆ కోర్సు పట్ల ఆసక్తి ఉంటే మంచిదే. వారికి మరేదో ఇంటరెస్ట్ ఉండి, ఇంకేదో చదవాలని ఉంటే... ఆ సంగతి చెప్పలేకపోతే ఇబ్బంది. అది భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టగలదు.ఏంటి... ఆ కోర్సా?ఆ ఇంట్లో తండ్రి అడ్వకేట్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి. కుమార్తెకు మేథ్స్గాని, బయాలజీగాని చదవాలని లేదు. హాయిగా టీచర్‌గా సెటిల్ అవ్వాలని ఉంది. తన స్కూల్లో చక్కగా తయారై వచ్చే టీచర్ పిల్లల పేపర్లు దిద్దే సన్నివేశం ఆ అమ్మాయికి ఇష్టం. తాను కూడా టీచరయ్యి పేపర్లు దిద్దాలని అనుకుంటుంది. టెన్త్ అవుతున్న సమయంలో ‘టీచర్ అవుతాను’ అని కూతురు అంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ‘మన హోదాకు టీచర్ కావడం ఏం బాగుంటుంది... మన ఇళ్లల్లో టీచర్లు ఎవరూ లేరే’ లాంటి మాటలు చెప్పి ఎంపీసీలో చేర్పించారు. ఆ అమ్మాయి ఆ లెక్కలు చేయలేక తల్లిదండ్రులకు చెప్పలేక కుమిలిపోయింది. డిప్రెషన్ తెచ్చుకుంది. అదే ‘టీచర్ కావాలనుకుంటున్నావా? వెరీగుడ్. అక్కడితో ఆగకు. నువ్వు హార్వర్డ్‌లో ప్రోఫెసర్ అవ్వాలి. అంత ఎదగాలి’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే హార్వర్డ్‌కు వెళ్లకపోయినా ఒక మంచి యూనివర్సిటీలో లెక్చరర్ అయినా అయ్యేది కదా.అన్నీ మాకు తెలుసుతల్లిదండ్రులకు అన్నీ మాకు తెలుసు అనే ధోరణి ఉంటుంది. నిజమే. కాని వాళ్లు ఇప్పుడున్న స్థితి రకరకాల ప్రయోగాలు చేసి రకరకాల దారుల్లో ప్రయత్నించి ఒక మార్గంలో సెటిల్ అయి ఉంటారు. తమ లాగే తమ పిల్లలు కూడా కొన్ని దారుల్లో నడవాలని అనుకోవచ్చు అని భావించరు. అన్నీ తమ ఇష్టప్రకారం జరగాలనుకుంటారు, ఓవర్ కన్సర్న్ చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఉదాహరణకు ఒకబ్బాయికి ‘నీట్’లో మెడిసిన్ సీటు వచ్చే ర్యాంకు రాలేదు. కాని డెంటిస్ట్రీ సీటు వచ్చే ర్యాంకైతే వచ్చింది. అబ్బాయికి ఆ కోర్సు ఇష్టమే. కాని తల్లిదండ్రులకు తమ కొడుకు ఎలాగైనా ఎంబిబిఎస్ మాత్రమే చదవాలనేది ‘కల’. ‘లాంగ్ టర్మ్ తీసుకో’ అని సూచించారు. లాంగ్ టర్మ్ అంటే ఒక సంవత్సరం వృథా అవుతుంది... పైగా ఈసారి ఎంట్రన్స్‌లో కూడా మంచి ర్యాంక్ వస్తుందో రాదో అనే భయం ఆ అబ్బాయికి ఉన్నా బలవంతం చేస్తే ఎంత చెప్పినా వినకపోతే ఆ అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అవ్వడా?ప్రతిదీ నిర్ణయించడమేతల్లిదండ్రుల స్తోమత పిల్లలకు తెలుసు. వారు చదివించ దగ్గ చదువులోనే తమకు ఇష్టం, ఆసక్తి, ప్రవేశం ఉన్న సబ్జక్టును చదవాలని కోరుకుంటారు. పైగా తమ స్నేహితుల ద్వారా వారూ కొంత సమాచారం సేకరించి ఫలానా కాలేజీలో ఫలానా కోర్సు చదవాలని నిశ్చయించుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆసక్తికి ఏ మాత్రం విలువ లేకుండా ఎలాగైనా చేసి రికమండేషన్లు పట్టి తాము ఎంపిక చేసిన కాలేజీలోనే చదవాలని శాసిస్తారు. ఇది అన్నివేళలా సమంజసం కాదు. ఒత్తిడి వద్దుటీనేజ్ సమయంలో పిల్లల భావోద్వేగాలు పరిపక్వంగా ఉండవు. కొంత తెలిసీ కొంత తెలియనితనం ఉంటుంది. ఆసక్తులు కూడా పూర్తిగా షేప్ కావు. ఇంటర్, గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి వారికి ఎన్నో సందేహాలుంటాయి. ఎంపికలు ఉంటాయి. ఇవాళ రేపు తల్లిదండ్రులు ‘తాము చదివించాలనుకున్న కోర్సు’ కోసం ఏకంగా పంజాబ్, హర్యాణ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇంట్లో ఉండి చదివే వీలున్నా రెసిడెన్షియల్ కాలేజీల్లో పడేస్తున్నారు. అంతంత మాత్రం చదువు చెప్పినా పర్లేదని మెడిసన్ పట్టా ఉంటే చాలని ఆసియా దేశాలకు సాగనంపుతున్నారు. పిల్లలతో ఎంతో మాట్లాడి, కౌన్సెలింగ్ చేసి, మంచి చెడ్డలన్నీ చర్చించి, వారికి సంపూర్ణ అవగాహన కలిగించి రెండు ఆప్షన్లు ఇచ్చి వారి ఆప్షన్లు కూడా పరిగణించి సానుకూలంగా ఒక ఎంపిక చేయడం ఎప్పుడూ మంచిది. లేదంటే ‘కోటా’ లాంటి కోచింగ్ ఊర్లలో జరుగుతున్న విషాదాలు, హైదరాబాద్‌లాంటి చోట్ల ఇల్లు విడిచి పోతున్న సంఘటనలు ఎదుర్కొనాల్సి వస్తుంది. -
కరోనా ఎఫెక్ట్: అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతంపై మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సాగుతోంది. 1930 ప్రభుత్వాస్పత్రులు, 634 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. అత్యవసర వైద్యం కోసం 108, 104 వాహనాలు అందుబాటులో ఉంచాం. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి’’ అని తెలిపారు. రాజమండ్రిలో కోవిడ్ కలకలంపై స్పందించిన ఆళ్ల నాని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా కరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ‘‘ఇంటర్ చదువుతున్న 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన 163 మంది విద్యార్థులను రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి వైద్య సదుపాయం కల్పించాము. కరోనా నివారణకు తీసుకోవలసిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎమ్‌హోచ్‌ఓ డాక్టర్ గౌరిశ్వరావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాము. కరోనా నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా డీఎమ్హెచ్ఓ డాక్టర్ గౌరిశ్వరరావును ఆదేశించాము. అంతేకాక తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించాం. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్‌కి తరలించి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని ఆళ్ల నాని తెలిపారు ‘‘కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులను 24 గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35 కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశాము. తిరుమల జూనియర్ కాలేజీ లో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి’’ అని మంత్రి ఆళ్ల నాని కోరారు. -
కోర్టు ద్వారా సర్టిఫికెట్లు తెచ్చుకున్న విద్యార్థి
నాగర్‌కర్నూల్: విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినా కార్పొరేట్ కళాశాలలకు కల్లెం మాత్రం వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. విద్యార్థులను కళాశాలలో చేర్చుకునేందుకు మాత్రం తమకు ఇష్టం వచ్చినంత ఫీజులు చెల్లించాలని, కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలుకుతారు. ఒక్క సారి విద్యార్థి చేరితే ఇక జైలు జీవితాన్ని తలదన్నేలా విద్యార్థి బతకాల్సివస్తుంది, పైగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడంలో వీళ్లను మించినవాళ్లు లేరు. సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోకందనూలుకు చెందిన విద్యార్థికి ఎదురైంది. అయితే అందరు విద్యార్థుల్లా యాజమన్యానికి తలొంచలేదు. సరికాదా యాజమాన్యమే తనకు తలొంచేలా చేశాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన నికేష్. ఉన్నత చదువుకై.. నాగర్‌కర్నూల్‌లో పదో తరగతి వరకు చదివిన నికేష్ ఇంటర్ కోసం హైదరాబాద్‌లోని పైన్ గ్రూవ్ జూనియర్ కళాశాలలో చేరాడు. పాఠశాలలో చరే సమయంలో సంవత్సరానికి రూ.1.60 లక్షల చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.3.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇదే ఫీజులో హాస్టల్‌తో పాటు ఐఐటీ తరగతులు కూడా నిర్వహిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కళాశాల యాజమాన్యంలో వచ్చిన మనస్పర్థల వల్ల ఐఐటీ తరగతులు బోధించలేదు. దీంతో విద్యార్థి నికేష్ ప్రత్యేకంగా ఐఐటీ కోచింగ్ కోసం రూ.40వేలతో మరో కోచింగ్ సెంటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. అయితే ఐఐటీ కోచింగ్ ఇస్తామని, ఇవ్వనందుకు ఫీజులో రాయితీ ఇవ్వాలని సదరు విద్యార్థి కళాశాల యాజమాన్యాన్ని అడగండం జరిగింది. అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు రూ.2.80లక్షల ఫీజు చెల్లించారు. అయితే రాయితీ ఇవ్వమని మిగిలిన రూ.40వేలు చెల్లించాలని, చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసిచెప్పారు. ఇంతలో విద్యార్థికి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు రావడం, ఈ నెల11న కళాశాలలో చేరాల్సిరావడంతో ఖచ్చితంగా సర్టిఫికెట్లు కళాశాలలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాశాల దౌర్జన్యంపై విసిగిన విద్యార్థి నికేష్ ప్రైవేటు కళాశాలలు ఒరిజినల్ సెర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ తన తండ్రి స్నేహితుడైన హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు ద్వారా కళాశాలకు గత మగళవారం నోటీసులను పంపించాడు. అయినా కళాశాల యాజమన్యాం స్పందించకపోవడంతో గత శుక్రవారం నేరుగా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వ్రైవేటు ఇంటర్ కళాశాల ఫీజులు చెల్లించినప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్ దగ్గరుంచుకోవడాన్ని తప్పుపట్టింది. రెండు రోజుల్లో విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పును వెలువరించింది. విద్యార్థికి అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు ముక్కు పిండి ఫీజులు వసూలు చేసే యాజమన్యాలకు ఒక చెంపపెట్టని అందరూ విద్యార్థిని ప్రశంసిస్తున్నారు. యాజమాన్యాలకు బుద్ధి రావాలి కళాశాలలో చేర్పించుకునేటప్పుడు ఐఐటీలో కోచింగ్ ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫీజు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి యాజమాన్యాలకు బుద్దిరావాలనే హైకోర్టును ఆశ్రయించాను. ఇకనైనా కార్పొరేట్ కళాశాలలకు బుద్ధి రావాలి. ఈ కేసు విజయం సాధించడంలో హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. – సొన్నతి నికేష్, విద్యార్థి, నాగర్‌కర్నూల్ -
ఉత్తీర్ణతలో వెనకడుగు
ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలంటే ఉత్తీర్ణతపై నమ్మకంతోపాటు భరోసా ఉండేది. అక్కడ చదివిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం తల్లిదండ్రుల్లో ఉండేది. రానురాను ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇందుకు ఈ నెల 12న విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలే నిదర్శనం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఫలితాలు అట్టడుగు స్థానంలో నమోదయ్యాయి. ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల పనితీరును పర్యవేక్షించా ల్సిన రెగ్యులర్ ఆర్ఐవో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తద్వారా ఎక్కువ మంది ప్రైవేట్ బాట పడుతున్నారని చెబుతున్నారు. ♦ జిల్లా కేంద్రమైన చిత్తూరులో పేరొందిన కళాశాల పీసీఆర్. ఇక్కడి నుంచి ఇంటర్ పరీక్షలకు 240 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 26 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 10.83 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ♦ పుత్తూరులో ఉన్న బాలుర జూనియర్ కళాశాలలలో 97 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. అందులో 36 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 మంది ఫెయిల్ అయ్యారు. ఈ రెండే కాదు జిల్లాలోని దాదాపు 50 శాతానికిపైగా కళాశాలల్లో ఫలితాలు ఇలాగే ఉన్నాయి. చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలలు, 28 ఒకేషనల్ కళాశాలలు, 6 ఎయిడెడ్, 2 ఏపీఆర్జేసీ, 11 ఏపీఎస్‌డబ్ల్యూఆర్, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, 18 మోడల్ స్కూళ్లు, 02 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2018–19లో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,167 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,164 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పరిధిలోని కళాశాలల నుంచి 11,431 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,423 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఉత్తీర్ణత చెందిన వారికంటే ఫెయిలైన వారే ఎక్కువ మంది ఉండడం ప్రభుత్వ కళాశాలల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మొదటి సంవత్సరం ఫలితాలు జిల్లాలోని 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలల్లో 7,415 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,449 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ కళాశాలల్లో నమోదైన ఫలితాల్లో తంబళ్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.28 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, నెరబైలు జూనియర్ కళాశాలలో 0 % సాధించి చివరి స్థానంలో నిలిచింది. అదే విధంగా జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 54.19 శాతం, 2 ఏపీఆర్జేసీ కళాశాలల్లో 91.04 శాతం, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 72.49 శాతం, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 80.26 శాతం, 18 మోడల్ స్కూళ్లల్లో 58.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మోడల్ స్కూళ్లలో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానంలోనూ, నడిమూరు 22.45 శాతంతో చివరి స్థానంలోనూ నిలిచాయి. 28 ఒకేషనల్ కళాశాలల్లో 58.58 శాతం సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు జిల్లాలోని 58 జూనియర్ కళాశాలల్లో 67.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అందులో కలికిరి 97.92 శాతంతో మొదటి స్థానం, పుత్తూరు 37.11 శాతం ఫలితాలు నమోదై చివరిస్థానంలో నిలిచాయి. జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 72.88, రెండు ఏపీఆర్జేసీ కళాశాలల్లో 98.57, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 87.42, రెండు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 84.40, 16 మోడల్ స్కూళ్లల్లో 81.35 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మోడల్ స్కూళ్లల్లో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానం, పెద్దతిప్పసముద్రం 45 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఫలితాలు తగ్గాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెగ్యులర్ ఆర్ఐవో లేకపోవడం, ఇన్చార్జీలు మారుతుండడంతో పర్యవేక్షణ లోపం తలెత్తింది. క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడం వల్ల ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లలో బాధ్యత లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితాల ప్రభావం రాబోయే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లపై పడనుందని విద్యావేత్తలు అంటున్నారు. -
క్రీడల్లో రాణిస్తే గుర్తింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : క్రీడల్లో రాణించడం ద్వారా గుర్తింపు లభిస్తుందని నగరంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాల అధ్యక్షుడు, పీడీ చంద్రమోహన్ తెలిపారు. శనివారం ఎస్ఎస్బీఎన్ కళాశాల క్రికెట్ జట్టు ఎస్కేయూ పరిధిలో జరిగిన ఇంటర్ కళాశాలల యూనివర్సిటీ క్రికెట్ చాంపియన్‌గా ఏడుసార్లు విజేతగా నిలిచి ఘనత సాధించిందన్నారు. క్రీడల్లో రాణింపు ద్వారా సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. తమ కళాశాల క్రీడాకారులు వరుస విజయాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పీఎల్ఎన్ రెడ్డి, సెక్రెటరీ విజయ్‌కుమార్, ప్రిన్సిపల్ నాగత్రిశూలపాణి, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు రామాంజనేయులు, శివరామకృష్ణ, దాదాపీర్, పుణ్యవతి, పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నేడే కిక్ బాక్సింగ్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజ్ కిక్ బాక్సింగ్ టోర్నీ నేడు (మంగళవారం) జరుగనుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (హెచ్‌డీఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో విజయ్‌నగర్ జూనియర్ కాలేజ్‌లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. అనంతరం బుధవారం కేశవ్ మెమోరియల్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స వేదికగా ఖో-ఖో, త్రోబాల్ టోర్నమెంట్లు జరుగనున్నారుు. హెచ్‌డీఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలోనే శుక్రవారం కస్తూర్బా జూనియర్ కాలేజ్ (వెస్ట్ మారేడ్‌పల్లి)లో తైక్వాండోతో పాటు , సుల్తాన్ బజార్‌లోని హెచ్‌వీఎస్ అకాడమీలో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లను నిర్వహిస్తారు.