పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు (ఫైల్)
ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలలంటే ఉత్తీర్ణతపై నమ్మకంతోపాటు భరోసా ఉండేది. అక్కడ చదివిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం తల్లిదండ్రుల్లో ఉండేది. రానురాను ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఇందుకు ఈ నెల 12న విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలే నిదర్శనం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్, ఒకేషనల్, ఎయిడెడ్, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో ఫలితాలు అట్టడుగు స్థానంలో నమోదయ్యాయి. ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ కళాశాలల పనితీరును పర్యవేక్షించా ల్సిన రెగ్యులర్ ఆర్‌ఐవో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తద్వారా ఎక్కువ మంది ప్రైవేట్ బాట పడుతున్నారని చెబుతున్నారు.
♦ జిల్లా కేంద్రమైన చిత్తూరులో పేరొందిన కళాశాల పీసీఆర్. ఇక్కడి నుంచి ఇంటర్ పరీక్షలకు 240 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 26 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 10.83 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
♦ పుత్తూరులో ఉన్న బాలుర జూనియర్ కళాశాలలలో 97 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. అందులో 36 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 మంది ఫెయిల్ అయ్యారు. ఈ రెండే కాదు జిల్లాలోని దాదాపు 50 శాతానికిపైగా కళాశాలల్లో ఫలితాలు ఇలాగే ఉన్నాయి.
చిత్తూరు కలెక్టరేట్/తిరుపతి ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలలు, 28 ఒకేషనల్ కళాశాలలు, 6 ఎయిడెడ్, 2 ఏపీఆర్‌జేసీ, 11 ఏపీఎస్‌డబ్ల్యూఆర్, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, 18 మోడల్ స్కూళ్లు, 02 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో 2018–19లో మొదటి సంవత్సరానికి సంబంధించి 14,167 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 6,164 మంది ఉత్తీర్ణత సాధించారు. అదే విధంగా ద్వితీయ సంవత్సరం ప్రభుత్వ పరిధిలోని కళాశాలల నుంచి 11,431 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,423 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఉత్తీర్ణత చెందిన వారికంటే ఫెయిలైన వారే ఎక్కువ మంది ఉండడం ప్రభుత్వ కళాశాలల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మొదటి సంవత్సరం ఫలితాలు
జిల్లాలోని 58 ప్రభుత్వ జూనియర్ జనరల్ కళాశాలల్లో 7,415 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,449 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ కళాశాలల్లో నమోదైన ఫలితాల్లో తంబళ్లపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.28 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో, నెరబైలు జూనియర్ కళాశాలలో 0 % సాధించి చివరి స్థానంలో నిలిచింది. అదే విధంగా జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 54.19 శాతం, 2 ఏపీఆర్‌జేసీ కళాశాలల్లో 91.04 శాతం, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 72.49 శాతం, 2 ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 80.26 శాతం, 18 మోడల్ స్కూళ్లల్లో 58.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మోడల్ స్కూళ్లలో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానంలోనూ, నడిమూరు 22.45 శాతంతో చివరి స్థానంలోనూ నిలిచాయి. 28 ఒకేషనల్ కళాశాలల్లో 58.58 శాతం సాధించారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు
జిల్లాలోని 58 జూనియర్ కళాశాలల్లో 67.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అందులో కలికిరి 97.92 శాతంతో మొదటి స్థానం, పుత్తూరు 37.11 శాతం ఫలితాలు నమోదై చివరిస్థానంలో నిలిచాయి. జిల్లాలోని 6 ఎయిడెడ్ కళాశాలల్లో 72.88, రెండు ఏపీఆర్‌జేసీ కళాశాలల్లో 98.57, ఒక ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలలో 87.42, రెండు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 84.40, 16 మోడల్ స్కూళ్లల్లో 81.35 శాతం ఫలితాలు నమోదయ్యాయి. మోడల్ స్కూళ్లల్లో కేవీబీపురం 100 శాతంతో మొదటి స్థానం, పెద్దతిప్పసముద్రం 45 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి.
పర్యవేక్షణ లేకపోవడం వల్లే
ప్రభుత్వ కళాశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఫలితాలు తగ్గాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రెగ్యులర్ ఆర్‌ఐవో లేకపోవడం, ఇన్‌చార్జీలు మారుతుండడంతో పర్యవేక్షణ లోపం తలెత్తింది. క్షేత్రస్థాయి తనిఖీలు చేయకపోవడం వల్ల ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లలో బాధ్యత లేకుండా పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితాల ప్రభావం రాబోయే విద్యాసంవత్సరంలో అడ్మిషన్లపై పడనుందని విద్యావేత్తలు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment