పదిలో మూడో స్థానం | Chittoor Third Place in Tenth Pass Percentage | Sakshi
Sakshi News home page

పదిలో మూడో స్థానం

Published Wed, May 15 2019 10:49 AM | Last Updated on Wed, May 15 2019 10:49 AM

Chittoor Third Place in Tenth Pass Percentage - Sakshi

విజయం చిహ్నం చూపుతున్న శ్రీకాళహస్తి మండలం తొండమనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు

చిత్తూరు కలెక్టరేట్‌ : పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థానం రెండు స్థానాలు ముందుకు వెళ్లింది. ఫలితంగా ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా  3 వ స్థానంలో నిలిచింది. 10 జీపీఏల సాధనలో జిల్లా విద్యార్థులు 3,283 మంది సాధించారు. సర్కారు బడుల ఉత్తీర్ణత శాతం, 10 జీపీఏల్లో మెరుగైన ఫలితాలు లభించాయి. మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పబ్లిక్‌ పరీక్షల సమయంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు, పలు పాఠశాలల్లో టీచర్ల కొరత ఉన్నప్పటికీ మెరుగైన ఫలితాలు లభించాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 1.05 శాతం ఉత్తీర్ణత పెరిగింది. గత ఏడాది జిల్లాలో 96.36 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈ ఏడాది 97.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన డీఈఓ పాండురంగస్వామిని కలెక్టర్‌ ప్రద్యుమ్న, జేసీ గిరీషా అభినందించారు.

బాల, బాలికల పోటీ....
కొన్నేళ్లుగా పది ఫలితాల్లో బాలికల హావా కొనసాగుతూనే వస్తోంది. ఈ సారి విడుదలైన ఫలితాల్లోనూ జిల్లాలో బాలికలే ముందంజలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 51,205 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో బాలురు 27,217 మంది, బాలికలు 25,352 మంది ఉన్నారు. వారిలో బాలురు 26,442 మంది, బాలికలు 24,763 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 97.15 శాతం, బాలికలు 97.68 శాతం ఉత్తీర్ణతను సాధించి బాలుర కంటే బాలికలు ముందజలో నిలిచారు.

ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
జిల్లాలో పదో తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షల్లో 10 జీపీఏ సాధనలో సత్తా చాటారు. గత ఏడాది జిల్లాలో 2,452 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. ఆ సంఖ్య ఈ ఏడాది 3,283 కు చేరింది. గత ఏడాది కంటే ఈ సారి పది జీపీఏ సాధించిన విద్యార్థులు 831 మంది పెరిగారు.

కేజీబీవీలో 97 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని 20 కేజీబీవీ పాఠశాలల్లో 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు గతేడాది కంటే ఈసారి 12 కేజీవీవీలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలో ఉన్న 20 కేజీబీవీ పాఠశాలల నుంచి 719 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 693 మంది ఉత్తీర్ణత చెందగా, 27మంది ఫెయిల్‌ అయ్యారు. అలాగే జిల్లాలోని 19 మోడల్‌ స్కూళ్లల్లో 1,269 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 11 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. ఒక విద్యార్థి పరీక్షకు హాజరు కాలేదు.

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ఉత్తీర్ణత
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతానికి భిన్నంగా ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఈ ఏడాది 34,711 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అందులో 33,292 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల నుంచి 18,058 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, వారిలో 17,913 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలోని 8 మండలాల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా మార్చిలో జరిగిన పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు 52,569 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, వారిలో 51,205 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 1,364 మంది ఫెయిల్‌ అయ్యారు.

పది’లో సత్తాచాటిన ఉర్దూ పాఠశాలలు
మదనపల్లె సిటీ: జిల్లాలో 30 ఉర్దూ ఉన్నత పాఠశాలలుండగా అందులో 20 పాఠశాలల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించి, కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. జిల్లాలోని మారుమూల ప్రాంతమైన వి.కోట ఉర్దూ ఉన్నత పాఠశాలలోని ముగ్గురు విద్యార్థినులు ఏకంగా పదికి పది పాయింట్లు సాధించి తమ సత్తాను చాటారు. జిల్లాలోని పెనుమూరు మండలంలోని పూనేపల్లె, కుప్పంలోని కుప్పం మెయిన్, వి.కోట మండలంలోని నాలుగు ఉర్దూ ఉన్నత పాఠశాలలు, వి.కోట మెయిన్,  నడిపేపల్లె, కొంగాటం, ఖాజీపేట,  బైరెడ్డిపల్లె,  యాదమరి మండలంలోని 14 కండ్రిగ, కలికిరి మండలంలోని గడి, మహల్,  మదనపల్లె రూరల్‌ మండలం బాలాజీనగర్, అర్బన్‌లోని మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, బి.కొత్తకోట, పీటీఎం, పెద్దమండ్యం మండలంలోని కలిచెర్ల, నిమ్మనపల్లె, చౌడేపల్లె మండలంలోని దాదేపల్లె, గంగవరం మండలంలోని పెద్ద ఉగిలి, తిరుపతి కార్పొరేషన్‌ ఉర్దూ ఉన్నత పాఠశాల, వాల్మీకిపురం మైనార్టీ  గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. మిగిలిన 10 పాఠశాలలు సరాసరి 95 శాతం ఫలితాలను సాధించి తమ ఆ«ధిక్యతను చాటుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement