నాగర్‌కర్నూల్: విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు వచ్చినా కార్పొరేట్ కళాశాలలకు కల్లెం మాత్రం వేయలేకపోతున్నాయి ప్రభుత్వాలు. విద్యార్థులను కళాశాలలో చేర్చుకునేందుకు మాత్రం తమకు ఇష్టం వచ్చినంత ఫీజులు చెల్లించాలని, కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలుకుతారు. ఒక్క సారి విద్యార్థి చేరితే ఇక జైలు జీవితాన్ని తలదన్నేలా విద్యార్థి బతకాల్సివస్తుంది, పైగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయడంలో వీళ్లను మించినవాళ్లు లేరు. సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ నగరంలోకందనూలుకు చెందిన విద్యార్థికి ఎదురైంది. అయితే అందరు విద్యార్థుల్లా యాజమన్యానికి తలొంచలేదు. సరికాదా యాజమాన్యమే తనకు తలొంచేలా చేశాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన నికేష్.
ఉన్నత చదువుకై..
నాగర్‌కర్నూల్‌లో పదో తరగతి వరకు చదివిన నికేష్ ఇంటర్ కోసం హైదరాబాద్‌లోని పైన్ గ్రూవ్ జూనియర్ కళాశాలలో చేరాడు. పాఠశాలలో చరే సమయంలో సంవత్సరానికి రూ.1.60 లక్షల చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.3.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇదే ఫీజులో హాస్టల్‌తో పాటు ఐఐటీ తరగతులు కూడా నిర్వహిస్తామని యాజమాన్యం చెప్పింది. అయితే ఇంటర్ ద్వితీయ సంవత్సరం కళాశాల యాజమాన్యంలో వచ్చిన మనస్పర్థల వల్ల ఐఐటీ తరగతులు బోధించలేదు. దీంతో విద్యార్థి నికేష్ ప్రత్యేకంగా ఐఐటీ కోచింగ్ కోసం రూ.40వేలతో మరో కోచింగ్ సెంటర్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
అయితే ఐఐటీ కోచింగ్ ఇస్తామని, ఇవ్వనందుకు ఫీజులో రాయితీ ఇవ్వాలని సదరు విద్యార్థి కళాశాల యాజమాన్యాన్ని అడగండం జరిగింది. అప్పటికే విద్యార్థి తల్లిదండ్రులు కళాశాలకు రూ.2.80లక్షల ఫీజు చెల్లించారు. అయితే రాయితీ ఇవ్వమని మిగిలిన రూ.40వేలు చెల్లించాలని, చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని తెగేసిచెప్పారు. ఇంతలో విద్యార్థికి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు రావడం, ఈ నెల11న కళాశాలలో చేరాల్సిరావడంతో ఖచ్చితంగా సర్టిఫికెట్లు కళాశాలలో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళాశాల దౌర్జన్యంపై విసిగిన విద్యార్థి నికేష్ ప్రైవేటు కళాశాలలు ఒరిజినల్ సెర్టిఫికెట్లు ఇవ్వకుండా దగ్గర ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ తన తండ్రి స్నేహితుడైన హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు ద్వారా కళాశాలకు గత మగళవారం నోటీసులను పంపించాడు.
అయినా కళాశాల యాజమన్యాం స్పందించకపోవడంతో గత శుక్రవారం నేరుగా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వ్రైవేటు ఇంటర్ కళాశాల ఫీజులు చెల్లించినప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్ దగ్గరుంచుకోవడాన్ని తప్పుపట్టింది. రెండు రోజుల్లో విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పును వెలువరించింది. విద్యార్థికి అనుకూలంగా వచ్చిన ఈ తీర్పు ముక్కు పిండి ఫీజులు వసూలు చేసే యాజమన్యాలకు ఒక చెంపపెట్టని అందరూ విద్యార్థిని ప్రశంసిస్తున్నారు.
యాజమాన్యాలకు బుద్ధి రావాలి
కళాశాలలో చేర్పించుకునేటప్పుడు ఐఐటీలో కోచింగ్ ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఫీజు మాత్రం ఖచ్చితంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి యాజమాన్యాలకు బుద్దిరావాలనే హైకోర్టును ఆశ్రయించాను. ఇకనైనా కార్పొరేట్ కళాశాలలకు బుద్ధి రావాలి. ఈ కేసు విజయం సాధించడంలో హైకోర్టు న్యాయవాది గుమ్మడవెల్లి వెంకటేశ్వర్లు కీలక పాత్ర పోషించారు. – సొన్నతి నికేష్, విద్యార్థి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment