Inter-Services Intelligence (ISI)
-
ఉగ్ర నెట్‌వర్క్‌లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్‌వర్క్‌ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్‌దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్‌ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్‌లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
‘భారత్‌తో సంబంధాలను బాగుచేయండి’
లాహోర్ : భారతదేశంతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలను సాధారణ స్థితికి ప్రభుత్వ తీసుకు రావాలని.. ఆయన పార్లమెంట్ సెనెట్ కమిటీ ముందు తెలిపారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు తీసుకునే ఈ చొరవను సైన్యం అభినందించడంతో పాటు, అనుసరిస్తుందని ఆయన చెప్పారు. భారత్ సహా ఇతర పొరుగు దేశాలతోనూ పాకిస్తాన్ తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని సెనెట్ కమిటీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను అభద్రతలోకి నెట్టివేయడంతో పాటు, అస్థిరపరిచేందుకు భారత సైన్యం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాజా రబ్బానీ నేతృత్వంలోని సెనెట్ కమిటీ సమావేశంలో జావేద్ బజ్వాతో పాటు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స చీఫ్ నవీద్ ముఖ్తార్, మేజర్ జనరల్ సాహిర్ సంషాద్ మీర్జాచ మరో మేజర్ జనరల్ ఆషిమ్ మునీర్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పొరుగు దేశం భారత్‌తో సాధారణ సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అదే సమయంలో భారత్ దుందుడుకు చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని అన్నారు. -
ఆఖరి శ్వాస వరకూ దావూద్‌తోనే!
ముంబై : డీ గ్యాంగ్‌లో విభేధాలు వచ్చాయన్న వార్తలపై ఛోటాషకీల్ తాజాగా స్పందించారు. దావూద్ ఇబ్రహీంతో తనకు ఎటువంటి విభేధాలు లేవని.. ఆఖరి శ్వాస వరకూ అతనితో ఉంటానని ఛోటా షకీల్ స్పష్టం చేశారు. అండర్ వరల్డ్‌లో డీ కంపెనీ కోసమే పనిచేస్తానని ఛోటా షకీల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. దావూద్ ఇబ్రహీంతో వచ్చిన విభేధాల వల్ల ఛోటా షకీల్ వేరు కుంపటి పెట్టుకున్నట్లు వచ్చిన నిఘా సంస్థలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దావూద్ గొడవలు వచ్చాయనడం కేవలం పుకార్లు మాత్రమేనని ఛోటా షకీల్ అన్నారు. తన చివరి శ్వాస వరకూ డీ కంపెనీకే పనిచేస్తానని ఛోటా షకీల్ తాజాగా పేర్కొన్నారు. ఒక గుర్తుతెలియన ప్రాంతం నుంచి ఛోటా షకీల్ జీ న్యూస్‌కు ఈ విషయాన్ని తెలిపారు. అదే సమయంలో ‘నేను భాయ్‌తో ఎప్పటిలాగే ఉన్నా. ఇకముందు ఉంటాను’ అని తెలిపారు. డీ గ్యాంగ్‌లో దావూద్‌కు ఛోటా షకీల్‌ను కుడి భుజంగా వ్యవహరిస్తారు. డీ గ్యాంగ్‌లో దావూద్ సోదరుడు అనీస్ పాత్ర పెరగడంతో.. షోటా షకీల్ దావూద్‌కు దూరమయినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో దావూద్‌ను, ఛోటా షకీల్‌ను కలిపేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని తెలిస్తోంది. -
'ఐ యామ్ ఖాన్.. టెర్రిరిస్ట్ ను కాను'
'మై నేమ్ ఈజ్ షాహీద్ ఆలీ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ మైనారిటీ వెల్ఫేర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి షాహీద్ ఆలీ ఖాన్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టులతో సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి రాజీనామా చేయాలంటూ అసెంబ్లీలో బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో టెర్రిరిస్ట్ ను కాదు అంటూ వివరణ ఇచ్చారు. పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చినా.. ఓట్ల కోసం బీజేపీ తన రాజీనామాకు డిమాండ్ చేయడం అత్యంత దురదృష్టకరం అని ఆయన అన్నారు. అయితే ఆలీ ఖాన్ కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాసటగా నిలవడం కొంత ఊరట లభించింది. మోతిహరి, సితామర్హి జిల్లాల ఎస్పీలు విచారణ జరిపారని, టెర్రిరిస్టులతో ఆలీ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని విచారణలో వెల్లడైందని నితీష్ అన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్, పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలున్నట్టు గతవారం టెలివిజన్ చానెల్స్ లో వార్తా కథనాలు వెలువడ్డాయి. దాంతో మంత్రి ఆలీ ఖాన్ రాజీనామాకు బీజేపీలు అసెంబ్లీలో పట్టుపట్టాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలు మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలో 'మై నేమ్ ఈజ్ ఖాన్.. ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్' అంటూ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కొట్టిన డైలాగ్స్ మరోసారి గుర్తుకు వచ్చాయి.