‘సప్లిమెంటరీ’లో బాలికలదే పైచేయి
ఇంటర్ ప్రథమ సంవత్సర అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బుధవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు 6,47,468 మంది హాజరు కాగా, 4,49,955 మంది (69.49 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,26,352 మంది ‘ఏ’ గ్రేడ్ సాధించారు. బాలికల ఉత్తీర్ణత 72.51శాతం కాగా, బాలుర ఉత్తీర్ణత 66.87 శాతంగా నమోదైంది. రాష్ట్రాలవారీగా చూస్తే.. తెలంగాణలో 65.82 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 72.73 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలవగా, నిజామాబాద్ 57 శాతంతో చివరన ఉంది. ప్రభుత్వ కళాశాలల పరంగా ఆదిలాబాద్ 73 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ 46 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇక ఒకేషనల్ పరీక్షలకు 22,146 మంది హాజరు కాగా, 12,480 మంది (56.35 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 60.83 శాతం కాగా, బాలురు 54.24 శాతం మంది పాసయ్యారు.
రీకౌంటింగ్ దరఖాస్తుకు 8 వరకు గడువు..
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలపై రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్‌కు ఈ నెల 8లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఉత్తీర్ణులైన వారికి మార్కుల మెమోలు ఈ నెల 8లోగా ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందేలా ఏర్పాట్లు చేశారు.