మళ్లీ అదే అన్యాయం!
ఐఐటీ అభ్యర్థులకు టాప్-20 పర్సంటైల్ గండం
తెలుగు విద్యార్థులకు 92 శాతం కటాఫ్
ఇంటర్ రెండేళ్లకు 920 లేదా సెకండ్ ఇయర్లో 492 మార్కులు ఉంటేనే సీటు
ఇతర రాష్ట్రాల పోల్చితే మనోళ్లకే అత్యధిక కటాఫ్
అస్సాం విద్యార్థులకు 292మార్కులు వస్తే చాలు
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానంతో తీవ్ర అన్యాయం
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యా సంస్థల్లో అడ్మిషన్ల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం తలెత్తగా.. తాజాగా మరో విషయం తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మార్కులతో పాటు ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం టాప్-20 పర్సంటైల్‌లో ఉంటేనే ఐఐటీలో సీటు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేకపోతే సదరు విద్యార్థికి ఐఐటీ అడ్మిషన్ దక్కదన్నమాట! ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సీబీఎస్ఈ అధికారులు వివిధ రాష్ట్రాల టాప్-20 పర్సంటైల్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను ప్రకటించారు. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 1000 మార్కులకు గాను జనరల్ అభ్యర్థికి కనీసం 920 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్క ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే 530 మార్కులకు గాను 492 కంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాంటి విద్యార్థులే ఐఐటీలో చేరేందుకు అర్హులు. ఇంటర్లో ఈ మేరకు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు(92 శాతం) సాధించకుంటే.. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రయోజనం ఉండదు.
అయితే ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ కటాఫ్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి మెరిట్‌తో ప్రవేశాలు కల్పించాల్సిన ఐఐటీల్లో ఇలాంటి పొంతన లేని విధానాలతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకుంటే రాష్ట్ర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినా ఐఐటీలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇంటర్ లేదా 12వ తరగతి మార్కులను ఇప్పటికీ పంపించని వారి విషయంలో మాత్రం కటాఫ్ మార్కులు మరో రకంగా ఉన్నాయి. సీబీఎస్ఈ అర్హత పరీక్షలో ప్రకటించిన మేరకు జనరల్ అభ్యర్థికి 83.2% మార్కులు వస్తే చాలు!. సీబీఎస్ఈ విధానాన్నే అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా ఒక్కో రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని పోటీని బట్టి కటాఫ్ మార్కులను నిర్ణయించడం సమస్యకు కారణం అవుతోంది. దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా, మన ఇంటర్ బోర్డు విద్యార్థులకు సీబీఎస్ఈ రెండు రకాల అవకాశం కల్పించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులను మాత్రమే కటాఫ్ కోసం చూపించవచ్చు లేదా రెండేళ్ల మార్కులనూ పరిగణనలోకి తీసుకునేందుకు చూపించుకోవచ్చు. మార్కులు ఇవ్వకుంటే సీబీఎస్ఈ కటాఫ్ వర్తించనుంది. దీని ప్రకారం ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు 83.2%, ఓబీసీకి 82 %, ఎస్సీలకు 74%, ఎస్టీలకు 73.2 శాతం మార్కులు వస్తే చాలు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు షాక్
పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లకు సీబీఎస్ఈ షాక్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ వారు ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్‌లో చేరేందుకు అనర్హులని తాజాగా పేర్కొంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం వారికి 12వ తరగతి సర్టిఫికెట్ లేనందున పాలిటెక్నిక్ విద్యార్థులు అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు 12వ తరగతి/తత్సమాన పరీక్ష మార్కులను ధ్రువీకరించేందుకు చేసేందుకు గడువును జులై 3 వరకు పొడిగించింది. గత నెల 27 వరకు మొదట్లో చివరి తేదీగా ప్రకటించినా దానిని సోమవారం వరకు పొడగించింది. తాజాగా 3వ తేదీ వరకు మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఈ నెల 7న ప్రకటించనుంది. ఈ మేరకు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు సెంట్రల్ సీట్ అలాట్మెంట్ బోర్డు గతంలో ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ మారనుంది.