International Career
-
14 ఏళ్ల కెరీర్ పూర్తి.. కోహ్లి ఎమోషనల్
టీమిండియా స్టార్ క్రికెటర్.. రన్‌మెషిన్ విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసి నేటితో(ఆగస్టు 18న) 14 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా కోహ్లి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా..''14 ఏళ్ల క్రితం ఇదే రోజున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టా.. నాకు దక్కిన గొప్ప గౌరవం'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక ఆగస్టు 18, 2008న డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా కోహ్లి టీమిండియా తరపున ఎంట్రీ ఇచ్చాడు. అయితే తొలి మ్యాచ్‌లో కోహ్లి అనుకున్నంతగా రాణించలేకపోయాడు. 22 బంతులాడి కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే తాను రాణించకున్నా ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలా కోహ్లి తన డెబ్యూ మ్యాచ్‌లోనే తొలి విజయాన్ని నమోదు చేశాడు. ''ఇంతింతై వటుడింతై'' అన్న తరహాలో అనతి కాలంలోనే టీమిండియాలో కీలక బ్యాటర్‌గా ఎదిగాడు. తన 14 ఏళ్ల కెరీర్లో ఎక్కడ వెనుదిరిగి చూసుకునే అవకాశం కూడా రాలేదు. కొన్నేళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్ కూడా మిస్సవ్వకుండా ఆడాడంటే కోహ్లి ఫిట్నెస్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. చేజింగ్‌లో కోహ్లి కింగ్‌గా మారిపోయాడు. భారత్ లక్ష్య ఛేధనకు దిగిందంటే కచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది అన్న అభిప్రాయానికి తీసుకొచ్చాడు. ఏ జట్టు ఆటగాడైనా ఒక మ్యాచ్‌లో ఆడాడంటే తొలి ఇన్నింగ్స్ నుంచే ఎక్కువ స్కోర్లు.. సెంచరీలు గాని చూస్తుంటాం. కానీ కోహ్లి విషయంలో అది రివర్స్ అయిపోయింది. కోహ్లి కెరీర్లో 43 వన్డే సెంచరీలు ఉంటే.. అందులో చేజింగ్‌లోనే 22 సెంచరీలు సాధించాడంటే అతని దూకుడేంటో అర్థమవుతుంది. ఒక దశలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీలు(49సెంచరీలు) మార్క్‌ను క్రాస్ చేసి అగ్రస్థానంలోకి దూసుకొస్తాడని అంతా భావించారు. కానీ క్రమక్రమంగా కోహ్లి ఆటతీరు మసకబారుతూ వచ్చింది. 14 ఏళ్ల కెరీర్లో టెస్టులు, వన్డేలు కలిపి 70 సెంచరీలు అందుకున్న కోహ్లి.. 71వ సెంచరీ మార్క్‌ను అందుకోవడం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఎంత మంచిగా ఆడే క్రికెటర్‌కైనా గడ్డు సమయం ఉండడం సహజం. కానీ కోహ్లి విషయంలో అది ఎక్కువకాలం కొనసాగుతూ వస్తుంది. ఇటీవలే విండీస్ టూర్‌కు దూరంగా ఉన్న కోహ్లి.. ఆసియా కప్ 2022 ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్న కోహ్లి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనైనా(ఆగస్టు 28న) తన 71వ సెంచరీ సాధించాలని కోరుకుందాం. ఇక 14 ఏళ్ల కెరీర్లో కోహ్లి 102 టెస్టుల్లో 8074 పరుగులు, 262 వన్డేల్లో 12,344 పరుగులు, 99 టి20ల్లో 3308 పరుగులు సాధించాడు. వన్డేల్లో 43 సెంచరీలు, టెస్టుల్లో 27 సెంచరీలు సాధించిన కోహ్లి.. టి20ల్లో మాత్రం 30 అర్థసెంచరీలు చేశాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) 14 years ago, it all started and it's been an honour 🇮🇳https://t.co/qJSxhWtTV3 — Virat Kohli (@imVkohli) August 18, 2022 చదవండి: జిమ్‌లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్! కింగ్.. ఒక్క సెంచరీ ప్లీజ్! Virat Kohli: చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా! -
గుడ్ బై 'జాక్'
► అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు ► వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటకు గుడ్‌బై ► శరీరం సహకరించకపోవడమే కారణం బంతి కొత్తగా ఉంది... వికెట్ ఫ్లాట్‌గా ఉంది... ఏం ఫర్వాలేదు.. జహీర్ ఖాన్ స్వింగ్ చేస్తాడు. పిచ్ పచ్చికతో కళకళ్లాడుతోంది. బౌన్స్ ఎక్కువగా ఉంది... దిగుల్లేదు... జహీర్ ఖాన్ బౌన్సర్లు సంధిస్తాడు. బంతి పాతబడింది. వికెట్ నెమ్మదించింది... ఆలోచన అవసరం లేదు... జహీర్ ఖాన్ రివర్స్ స్వింగ్ చేస్తాడు. జహీర్... జహీర్... జహీర్... దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్ పలువరించిన పేరిది. పేసర్లకు ప్రాధాన్యం లేని భారత వికెట్లపై కూడా తన సంచలన బౌలింగ్‌తో జట్టుకు విజయాలు అందించిన భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సహచరులు, అభిమానులు ముద్దుగా జాక్ అని పిలుచుకునే ఈ దిగ్గజ బౌలర్ ఆటను చివరిసారి వచ్చే సీజన్ ఐపీఎల్లో చూడొచ్చు. ముంబై: భారత క్రికెట్ బౌలింగ్ బాధ్యతలను దశాబ్దానికిపైగా భుజాన మోసిన యోధుడు ఆట నుంచి నిష్ర్కమించాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలు, సంచలన విజయాలు దేశానికి అందించిన వీరుడు అస్త్రసన్యాసం చేశాడు. భారత క్రికెట్లో ఎడమచేతి వాటం పేసర్‌గా చిరకాలం గుర్తుండిపోయే బంతులు వేసిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటను వదిలేస్తానని ప్రకటించాడు. గాయాల కారణంగా తరచూ ఇబ్బంది పడుతున్న జహీర్... ఇక మీదట తన శరీరం అంతర్జాతీయ క్రికెట్‌ను తట్టుకోలేదని గ్రహించాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఇంతకాలం కష్టపడుతూ వచ్చిన ‘జాక్’... ఆకస్మికంగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. తన శరీరం ఇక పూర్తి స్థాయిలో బౌలింగ్‌కు సహకరించదని... ప్రతిరోజూ తీసుకునే శిక్షణలో భాగంగా ఈ 37 ఏళ్ల బౌలర్ స్వయంగా గ్రహించాడు. దీంతో రిటైర్మెంట్కు సంబంధించిన ప్రకటనను విడుదల చేశాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడుతున్న జహీర్ వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే సీజన్ తర్వాత పూర్తిగా ఆటను వదిలేస్తాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం చివరిసారి భారత్ తరఫున వన్డే ఆడిన జహీర్... గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రతి క్షణం పోరాడాను ఇక నేను క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది. ఆట నుంచి తప్పుకోవడం ఏ క్రీడాకారుడికైనా కఠినమైన నిర్ణయం. దాదాపుగా రెండు దశాబ్దాలుగా బౌలింగ్ చేయడంతో నా శరీరం బాగా అలసిపోయింది. 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో అత్యంత గొప్ప క్షణం. ‘జాక్ ఈజ్ బ్యాక్’ అనే హెడ్లైన్ మరోసారి వస్తుంది. ఆట నుంచి తప్పుకుంటున్నా... ఏదో ఒక రూపంలో ఇందులో కొనసాగుతాను. శ్రీరామ్పూర్లాంటి గ్రామంలో జన్మించిన నాకు ఈ దేశం గొప్ప అవకాశం ఇచ్చింది. బీసీసీఐ, బరోడా, ముంబై క్రికెట్ సంఘాలతో పాటు ఎంతోమంది కోచ్‌లు, సహచరులు, ఫిజియోలు, అధికారులు నా ప్రయాణంలో సహకరించారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎంతోమందితో కలిసి గడిపాను. వారిలో చాలామంది నాకు ఆప్తమిత్రులుగా మారారు. ఇక నా కుటుంబసభ్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్ మేలు కోరుకునే లక్షలాది మంది అభిమానులు నన్ను ప్రోత్సహించారు. నేనెప్పుడూ ఓటమిని అంగీకరించలేను. అందుకే ప్రతిక్షణం గాయాలతో, ప్రత్యర్థులతో పోరాడాను. జీవితంలో నాకు క్రికెట్ తప్ప ఏమీ తెలియదు. జహీర్ ఖాన్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆటకు ఏదోలా రుణం తీర్చుకుంటాను. ఎన్నో జ్ఞాపకాలతో కెరీర్‌ను ముగిస్తున్నాను. -జహీర్‌ఖాన్ భారత క్రికెట్‌కు జహీర్ ఖాన్ అందించిన అద్భుత సేవలను బీసీసీఐ కొనియాడుతోంది. ఉపఖండంలో ఫాస్ట్‌బౌలర్ పాత్ర చాలా కఠినమే అయినా ఆ సవాల్‌ను స్వీకరించి జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి విజయాలు అందించాడు. జహీర్ భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా - బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ భారత్ నుంచి అత్యంత ఉత్తమ పేసర్లలో జహీర్ కూడా ఉంటాడు. గత 15 ఏళ్ల కాలంలో జట్టు సాధించిన విజయాల్లో తన పాత్ర కీలకం. దశాబ్దకాలం నుంచి పేస్ దళానికి వెన్నెముకగా ఉన్నాడు. దేశంలో రివర్స్ స్వింగ్‌కు అతడే మార్గదర్శకుడు - బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నాకు తెలిసినంత వరకు జహీర్ అత్యంత ప్రశాంతంగా ఉండే పేస్ బౌలర్. సవాళ్లకు ఎప్పుడూ ముందుంటాడు. బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని ఎల్లవేళలా ఆలోచించేవాడు. తన రెండో ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు - సచిన్ టెండూల్కర్ జహీర్కున్న అపార అనుభవం, తెలివితేటలు, భావాన్ని వ్యక్తపరిచే విధానం కారణంగా కచ్చితంగా తను అద్భుత బౌలింగ్ కోచ్ అనిపించుకుంటాడు. ఇదే జరిగితే భారత్‌లో యువ పేసర్లు మరింత మంది తయారవుతారు. ఎలాంటి సౌకర్యాలు పొందకుండానే కెరీర్ ఆరంభించి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అతడు నాకు అత్యంత సన్నిహితుడు - వీవీఎస్ లక్ష్మణ్ వెల్డన్ జహీర్. నీవు లేకుండా భారత క్రికెట్ ఇన్ని విజయాలు సాధించగలిగేది కాదు. అత్యంత తెలివైన బౌలర్‌వి. క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించగల సామర్థ్యం నీకుంది - ధోని జహీర్ భాయ్.. నాతో పాటు మరెంతో మంది ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచావు - కోహ్లి -
కమ్ బ్యాక్ కింగ్
జహీర్ 15 ఏళ్ల ఉజ్వల కెరీర్లో కోట్లాది అభిమానుల ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకుంటూ, దాటుకుంటూ జహీర్ ఖాన్... భారత్ అందించిన అత్యుత్తమ ఎడమ చేతివాటం పేసర్‌గా నిలిచాడు. కఠోర శ్రమ, పోరాటతత్వంతో గాయాలను వెనక్కి తోసి పడ్డ ప్రతీసారి పైకి లేచి తనేంటో నిరూపించుకున్నాడు. కొత్త మిలీనియంలో విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన అత్యుత్తమ విజయాల్లో అతనిదే సింహభాగం. జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన కొత్తలో ‘పాకిస్తాన్ వసీం అక్రమ్‌కు భారత్ సమాధానం’ అని బ్యానర్లు కనిపించాయి. ధోని అయితే ఒక సారి ‘బౌలింగ్ సచిన్’ అంటూ తన ప్రశంసలతో ముంచెత్తాడు. సరిగ్గా ఈ ఉపమానాలే అన్వయించకపోయినా...భారత క్రికెట్‌కు సంబంధించి జహీర్ కచ్చితంగా దిగ్గజ ఆటగాడు. నిస్సందేహంగా గత రెండు దశాబ్దాల్లో భారత బెస్ట్ పేస్ బౌలర్ అయిన ఖాన్... ఇప్పటి యువ పేసర్లందరికీ మార్గదర్శి, గురుతుల్యుడు. బౌలింగ్‌లో పాక్ పేసర్లను స్ఫూర్తిగా తీసుకున్నా... ప్రవర్తనలో ఎన్నడూ వివాదాలకు అవకాశం ఇవ్వని అతను జెంటిల్మెన్ క్రికెటర్. సాధారణ నేపథ్యం చెరకు పంటకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ జహీర్ స్వస్థలం. ఫోటోగ్రాఫర్ అయిన తండ్రి, టీచర్ తల్లి అతడిని చదువు వైపు ప్రోత్సహించారు. ఇంటర్లో 85 శాతం మార్కులు తెచ్చుకున్న తర్వాత జహీర్ సైనికుడిగా జాతీయ డిఫెన్స్ అకాడమీలో చేరాలనే కోరికతో ఎంట్రన్స్‌కు హాజరయ్యాడు. అయితే దాని ఫలితం రాక ముందే జహీర్లోని బౌలింగ్ ప్రతిభను గుర్తించిన తండ్రి అడ్డు చెప్పలేదు. దాంతో 17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి పెట్టి సాధన చేసిన అతను కోటి ఆశలతో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నేషనల్ క్రికెట్ క్లబ్, క్రాస్ మైదాన్‌లో రెగ్యులర్‌గా ఆడటం మొదలు పెట్టాడు. స్థానిక పురుషోత్తం షీల్డ్ టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేరడంతో జహీర్ బౌలింగ్ పదును తేలింది. ముంబై రంజీ జట్టులో చోటు దక్కకపోయినా... ఎంఆర్ఎఫ్ కోచ్ శేఖర్ సిఫారసుతో బరోడా టీమ్‌లో అవకాశం దక్కింది. కేవలం ఒక్క ఏడాది ఫస్ట్ క్లాస్ సీజన్‌కే అతను భారత జట్టులోకి ఎంపిక కావడం విశేషం. స్టార్ బౌలర్‌గా... ‘2000 సంవత్సరంలో నాకంటే అతను ఎంతో అత్యుత్తమ బౌలర్‌గా కనిపించాడు. నేను చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ చందూబోర్డేకు చెప్పి జహీర్‌ను ఎంపిక చేయమన్నాను’... ఇదీ నాటి మన నంబర్‌వన్ పేసర్ శ్రీనాథ్ చెప్పిన మాట. కనీసం 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే లెఫ్టార్మ్ పేసర్ లభించడం భారత్ అదృష్టమని అప్పట్లో చాలా చర్చ జరిగింది. జహీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడేళ్ల పాటు టెస్టు, వన్డే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2001లో కాండీ టెస్టులో లంకపై 7 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించడం కీలక మలుపు. 2002లో ఇంగ్లండ్‌లో చారిత్రక నాట్‌వెస్ట్ సిరీస్ విజయంలో 14 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు. గాయాల బెడద ఒకటి కాదు రెండు కాదు...ఎన్నో సార్లు జహీర్ గాయంతో జట్టుకు దూరం కావడం, మళ్లీ ఫిట్ అయి తిరిగి రావడం రొటీన్‌గా మారింది. మరో బౌలర్‌నైతే భారత్ భరించలేకపోయేదేమో గానీ జహీర్ స్థాయికి అతను ఎప్పుడు వచ్చినా జట్టులో చోటు సిద్ధంగా ఉండేది. ముఖ్యంగా 2006 వార్సెష్టర్‌షైర్ కౌంటీకి ఆడిన తర్వాత రనప్ తగ్గించిన అతను అత్యంత ఫిట్‌గా మారి మళ్లీ టీమిండియా ప్రధాన అస్త్రంగా మారాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించిన జహీర్ కెరీర్లో 2007 ఇంగ్లండ్ సిరీస్ మేలిమలుపు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో 9/134 సహా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి భారత్‌కు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం అందించాడు. గాయాలు ఇబ్బంది పెట్టినా మైదానంలో దిగినప్పుడు మాత్రం అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకారిగా మారాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... వేదిక ఏదైనా భారత బౌలింగ్ ప్రధానాస్త్రంగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన జహీర్ రికార్డులు చరిత్రలో నిలిచి ఉంటాయి. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ జహీర్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434), హర్భజన్ (417) మాత్రమే జహీర్ కంటే ముందున్నారు. - సాక్షి క్రీడావిభాగం