కమ్ బ్యాక్ కింగ్
జహీర్ 15 ఏళ్ల ఉజ్వల కెరీర్‌లో కోట్లాది అభిమానుల ఆశలు, కోరికలు, అంచనాలు ఉన్నాయి. వాటన్నింటినీ అందుకుంటూ, దాటుకుంటూ జహీర్ ఖాన్... భారత్ అందించిన అత్యుత్తమ ఎడమ చేతివాటం పేసర్‌గా నిలిచాడు. కఠోర శ్రమ, పోరాటతత్వంతో గాయాలను వెనక్కి తోసి పడ్డ ప్రతీసారి పైకి లేచి తనేంటో నిరూపించుకున్నాడు. కొత్త మిలీనియంలో విదేశీ గడ్డపై టీమిండియా సాధించిన అత్యుత్తమ విజయాల్లో అతనిదే సింహభాగం.
జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన కొత్తలో ‘పాకిస్తాన్ వసీం అక్రమ్‌కు భారత్ సమాధానం’ అని బ్యానర్లు కనిపించాయి. ధోని అయితే ఒక సారి ‘బౌలింగ్ సచిన్’ అంటూ తన ప్రశంసలతో ముంచెత్తాడు. సరిగ్గా ఈ ఉపమానాలే అన్వయించకపోయినా...భారత క్రికెట్‌కు సంబంధించి జహీర్ కచ్చితంగా దిగ్గజ ఆటగాడు. నిస్సందేహంగా గత రెండు దశాబ్దాల్లో భారత బెస్ట్ పేస్ బౌలర్ అయిన ఖాన్... ఇప్పటి యువ పేసర్లందరికీ మార్గదర్శి, గురుతుల్యుడు. బౌలింగ్‌లో పాక్ పేసర్లను స్ఫూర్తిగా తీసుకున్నా... ప్రవర్తనలో ఎన్నడూ వివాదాలకు అవకాశం ఇవ్వని అతను జెంటిల్మెన్ క్రికెటర్.
సాధారణ నేపథ్యం
చెరకు పంటకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని శ్రీరాంపూర్ జహీర్ స్వస్థలం. ఫోటోగ్రాఫర్ అయిన తండ్రి, టీచర్ తల్లి అతడిని చదువు వైపు ప్రోత్సహించారు. ఇంటర్‌లో 85 శాతం మార్కులు తెచ్చుకున్న తర్వాత జహీర్ సైనికుడిగా జాతీయ డిఫెన్స్ అకాడమీలో చేరాలనే కోరికతో ఎంట్రన్స్‌కు హాజరయ్యాడు. అయితే దాని ఫలితం రాక ముందే జహీర్‌లోని బౌలింగ్ ప్రతిభను గుర్తించిన తండ్రి అడ్డు చెప్పలేదు. దాంతో 17 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ క్రికెట్‌పై దృష్టి పెట్టి సాధన చేసిన అతను కోటి ఆశలతో ముంబైకి చేరుకున్నాడు. అక్కడి నేషనల్ క్రికెట్ క్లబ్, క్రాస్ మైదాన్‌లో రెగ్యులర్‌గా ఆడటం మొదలు పెట్టాడు. స్థానిక పురుషోత్తం షీల్డ్ టోర్నీలో అద్భుత బౌలింగ్‌తో అతను గుర్తింపు తెచ్చుకున్నాడు. ముంబై అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్న అనంతరం ఎంఆర్‌ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో చేరడంతో జహీర్ బౌలింగ్ పదును తేలింది. ముంబై రంజీ జట్టులో చోటు దక్కకపోయినా... ఎంఆర్‌ఎఫ్ కోచ్ శేఖర్ సిఫారసుతో బరోడా టీమ్‌లో అవకాశం దక్కింది. కేవలం ఒక్క ఏడాది ఫస్ట్ క్లాస్ సీజన్‌కే అతను భారత జట్టులోకి ఎంపిక కావడం విశేషం.
స్టార్ బౌలర్‌గా...
‘2000 సంవత్సరంలో నాకంటే అతను ఎంతో అత్యుత్తమ బౌలర్‌గా కనిపించాడు. నేను చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సెలక్షన్ కమిటీ చైర్మన్ చందూబోర్డేకు చెప్పి జహీర్‌ను ఎంపిక చేయమన్నాను’... ఇదీ నాటి మన నంబర్‌వన్ పేసర్ శ్రీనాథ్ చెప్పిన మాట. కనీసం 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసే లెఫ్టార్మ్ పేసర్ లభించడం భారత్ అదృష్టమని అప్పట్లో చాలా చర్చ జరిగింది. జహీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మూడేళ్ల పాటు టెస్టు, వన్డే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2001లో కాండీ టెస్టులో లంకపై 7 వికెట్లు తీసి భారత్‌ను గెలిపించడం కీలక మలుపు. 2002లో ఇంగ్లండ్‌లో చారిత్రక నాట్‌వెస్ట్ సిరీస్ విజయంలో 14 వికెట్లతో టాపర్‌గా నిలిచాడు.
గాయాల బెడద
ఒకటి కాదు రెండు కాదు...ఎన్నో సార్లు జహీర్ గాయంతో జట్టుకు దూరం కావడం, మళ్లీ ఫిట్ అయి తిరిగి రావడం రొటీన్‌గా మారింది. మరో బౌలర్‌నైతే భారత్ భరించలేకపోయేదేమో గానీ జహీర్ స్థాయికి అతను ఎప్పుడు వచ్చినా జట్టులో చోటు సిద్ధంగా ఉండేది. ముఖ్యంగా 2006 వార్సెష్టర్‌షైర్ కౌంటీకి ఆడిన తర్వాత రనప్ తగ్గించిన అతను అత్యంత ఫిట్‌గా మారి మళ్లీ టీమిండియా ప్రధాన అస్త్రంగా మారాడు. అదే ఏడాది దక్షిణాఫ్రికా సిరీస్‌లో రాణించిన జహీర్ కెరీర్‌లో 2007 ఇంగ్లండ్ సిరీస్ మేలిమలుపు. ట్రెంట్‌బ్రిడ్జ్ టెస్టులో 9/134 సహా మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి భారత్‌కు 21 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం అందించాడు. గాయాలు ఇబ్బంది పెట్టినా మైదానంలో దిగినప్పుడు మాత్రం అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకారిగా మారాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్... వేదిక ఏదైనా భారత బౌలింగ్ ప్రధానాస్త్రంగా పలు చిరస్మరణీయ విజయాలు అందించిన జహీర్ రికార్డులు చరిత్రలో నిలిచి ఉంటాయి.
టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (311) తీసుకున్న నాలుగో బౌలర్ జహీర్. కుంబ్లే (619), కపిల్‌దేవ్ (434),
హర్భజన్ (417) మాత్రమే జహీర్ కంటే ముందున్నారు.
- సాక్షి క్రీడావిభాగం