జహీర్ ఖాన్ రాకతో లక్నో సూపర్ జెయింట్స్ రాత మారబోతుందని ఆ జట్టు టాలెంట్ సెర్చ్ డైరెక్టర్, టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ అన్నాడు. ఈ రివర్స్ స్వింగ్ కింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవం ఉన్న జహీర్ మార్గదర్శనంలో లక్నో అద్భుత విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.
లక్నో మెంటార్‌గా జహీర్ నియామకం
కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త మెంటార్‌గా భారత మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌ను నియమించిన విషయం తెలిసిందే. జహీర్ ఈ జట్టుతో చేరుతున్నట్లుగా గత కొంత కాలంగా వార్తలు వినిపించగా... టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా బుధవారం అధికారికంగా ప్రకటించారు. మెంటార్‌గా ప్రధాన జట్టుకే పరిమితం కాకుండా ప్రతిభాన్వేషణ, కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దే అదనపు బాధ్యతలను కూడా జహీర్‌కు లక్నో యాజమాన్యం అప్పగించింది.
క్యాష్ రిచ్ లీగ్‌లోకి 2022లో లీగ్‌లోకి ప్రవేశించిన లక్నో సూపర్ జెయింట్స్‌కు రెండేళ్లు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించగా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు రెండుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ తర్వాత మెంటార్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకోగా.. 2024 సీజన్‌లో లక్నో పేలవ ప్రదర్శన కనబర్చింది. ఈ క్రమంలో గంభీర్ స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేసింది యాజమాన్యం.
అత్యుత్తమ బౌలర్ రాక మాకు శుభ పరిణామం
ఈ నేపథ్యంలో ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘లక్నో జట్టుకు ఇదొక శుభవార్త. జహీర్ ఖాన్ వంటి మేటి క్రికెటర్ మెంటార్‌గా రావడం మంచి పరిణామం. జహీర్ నెమ్మదస్తుడు. కూల్‌గానే తనకు కావాల్సిన ఫలితాలను రాబట్టుకోగల సమర్థత ఉన్నవాడు. ఆట పట్ల అతడికి విశేష జ్ఞానం ఉంది.
ఐపీఎల్‌లో జహీర్ కెరీర్ ఇలా
టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో అత్యుత్తమంగా రాణించిన ఘనత అతడి సొంతం. ఐపీఎల్‌లోనూ తనకు గొప్ప అనుభవం ఉంది. లక్నో జట్టుకు అతడు గేమ్ ఛేంజర్ కాబోతున్నాడు’’ అని స్పోర్ట్స్‌కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా భారత అత్యుత్తమ పేస్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న జహీర్ 2017 వరకు ఐపీఎల్ ఆడాడు.
ముంబై, బెంగళూరు, ఢిల్లీ జట్ల తరఫున మొత్తం 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టిన అతను ఆ తర్వాత కూడా ఐపీఎల్‌తో కొనసాగాడు. 2018–2022 మధ్య ఐదేళ్ల పాటు జహీర్ ఖాన్ ముంబై ఇండియన్స్ టీమ్‌కు డైరెక్టర్, ఆ తర్వాత హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఇక ఐపీఎల్-2025లో లక్నో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment