గుడ్ బై 'జాక్'
► అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్ ఖాన్ వీడ్కోలు
► వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటకు గుడ్‌బై
► శరీరం సహకరించకపోవడమే కారణం
బంతి కొత్తగా ఉంది... వికెట్ ఫ్లాట్‌గా ఉంది... ఏం ఫర్వాలేదు.. జహీర్ ఖాన్ స్వింగ్ చేస్తాడు. పిచ్ పచ్చికతో కళకళ్లాడుతోంది. బౌన్స్ ఎక్కువగా ఉంది... దిగుల్లేదు... జహీర్ ఖాన్ బౌన్సర్లు సంధిస్తాడు. బంతి పాతబడింది. వికెట్ నెమ్మదించింది... ఆలోచన అవసరం లేదు... జహీర్ ఖాన్ రివర్స్ స్వింగ్ చేస్తాడు. జహీర్... జహీర్... జహీర్... దాదాపు దశాబ్దం పాటు భారత క్రికెట్ పలువరించిన పేరిది. పేసర్లకు ప్రాధాన్యం లేని భారత వికెట్లపై కూడా తన సంచలన బౌలింగ్‌తో జట్టుకు విజయాలు అందించిన భారత స్టార్ పేసర్ జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సహచరులు, అభిమానులు ముద్దుగా జాక్ అని పిలుచుకునే ఈ దిగ్గజ బౌలర్ ఆటను చివరిసారి వచ్చే సీజన్ ఐపీఎల్‌లో చూడొచ్చు.
ముంబై: భారత క్రికెట్ బౌలింగ్ బాధ్యతలను దశాబ్దానికిపైగా భుజాన మోసిన యోధుడు ఆట నుంచి నిష్ర్కమించాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలు, సంచలన విజయాలు దేశానికి అందించిన వీరుడు అస్త్రసన్యాసం చేశాడు. భారత క్రికెట్‌లో ఎడమచేతి వాటం పేసర్‌గా చిరకాలం గుర్తుండిపోయే బంతులు వేసిన జహీర్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే సీజన్ ఐపీఎల్‌తో పూర్తిగా ఆటను వదిలేస్తానని ప్రకటించాడు. గాయాల కారణంగా తరచూ ఇబ్బంది పడుతున్న జహీర్... ఇక మీదట తన శరీరం అంతర్జాతీయ క్రికెట్‌ను తట్టుకోలేదని గ్రహించాడు. జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ఇంతకాలం కష్టపడుతూ వచ్చిన ‘జాక్’... ఆకస్మికంగా రిటైర్‌మెంట్ నిర్ణయం ప్రకటించాడు.
తన శరీరం ఇక పూర్తి స్థాయిలో బౌలింగ్‌కు సహకరించదని... ప్రతిరోజూ తీసుకునే శిక్షణలో భాగంగా ఈ 37 ఏళ్ల బౌలర్ స్వయంగా గ్రహించాడు. దీంతో రిటైర్‌మెంట్‌కు సంబంధించిన ప్రకటనను విడుదల చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడుతున్న జహీర్ వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరిగే సీజన్ తర్వాత పూర్తిగా ఆటను వదిలేస్తాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో 21 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జాక్... అన్ని ఫార్మాట్లలో కలిపి 610 వికెట్లు తీసుకున్నాడు. మూడేళ్ల క్రితం చివరిసారి భారత్ తరఫున వన్డే ఆడిన జహీర్... గత ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చివరిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ప్రతి క్షణం పోరాడాను
ఇక నేను క్రికెట్ నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది. ఆట నుంచి తప్పుకోవడం ఏ క్రీడాకారుడికైనా కఠినమైన నిర్ణయం. దాదాపుగా రెండు దశాబ్దాలుగా బౌలింగ్ చేయడంతో నా శరీరం బాగా అలసిపోయింది. 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడం నా జీవితంలో అత్యంత గొప్ప క్షణం. ‘జాక్ ఈజ్ బ్యాక్’ అనే హెడ్‌లైన్ మరోసారి వస్తుంది. ఆట నుంచి తప్పుకుంటున్నా... ఏదో ఒక రూపంలో ఇందులో కొనసాగుతాను. శ్రీరామ్‌పూర్‌లాంటి గ్రామంలో జన్మించిన నాకు ఈ దేశం గొప్ప అవకాశం ఇచ్చింది. బీసీసీఐ, బరోడా, ముంబై క్రికెట్ సంఘాలతో పాటు ఎంతోమంది కోచ్‌లు, సహచరులు, ఫిజియోలు, అధికారులు నా ప్రయాణంలో సహకరించారు. డ్రెస్సింగ్‌రూమ్‌లో ఎంతోమందితో కలిసి గడిపాను. వారిలో చాలామంది నాకు ఆప్తమిత్రులుగా మారారు. ఇక నా కుటుంబసభ్యుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్ మేలు కోరుకునే లక్షలాది మంది అభిమానులు నన్ను ప్రోత్సహించారు. నేనెప్పుడూ ఓటమిని అంగీకరించలేను. అందుకే ప్రతిక్షణం గాయాలతో, ప్రత్యర్థులతో పోరాడాను. జీవితంలో నాకు క్రికెట్ తప్ప ఏమీ తెలియదు. జహీర్ ఖాన్ అనే వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన ఆటకు ఏదోలా రుణం తీర్చుకుంటాను. ఎన్నో జ్ఞాపకాలతో కెరీర్‌ను ముగిస్తున్నాను. -జహీర్‌ఖాన్
భారత క్రికెట్‌కు జహీర్ ఖాన్ అందించిన అద్భుత సేవలను బీసీసీఐ కొనియాడుతోంది. ఉపఖండంలో ఫాస్ట్‌బౌలర్ పాత్ర చాలా కఠినమే అయినా ఆ సవాల్‌ను స్వీకరించి జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి విజయాలు అందించాడు. జహీర్ భవిష్యత్ ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా
- బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్
భారత్ నుంచి అత్యంత ఉత్తమ పేసర్లలో జహీర్ కూడా ఉంటాడు. గత 15 ఏళ్ల కాలంలో జట్టు సాధించిన విజయాల్లో తన పాత్ర కీలకం. దశాబ్దకాలం నుంచి పేస్ దళానికి వెన్నెముకగా ఉన్నాడు. దేశంలో రివర్స్ స్వింగ్‌కు అతడే మార్గదర్శకుడు
- బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్
నాకు తెలిసినంత వరకు జహీర్ అత్యంత ప్రశాంతంగా ఉండే పేస్ బౌలర్. సవాళ్లకు ఎప్పుడూ ముందుంటాడు. బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలని ఎల్లవేళలా ఆలోచించేవాడు. తన రెండో ఇన్నింగ్స్‌కు శుభాకాంక్షలు
- సచిన్ టెండూల్కర్
జహీర్‌కున్న అపార అనుభవం, తెలివితేటలు, భావాన్ని వ్యక్తపరిచే విధానం కారణంగా కచ్చితంగా తను అద్భుత బౌలింగ్ కోచ్ అనిపించుకుంటాడు. ఇదే జరిగితే భారత్‌లో యువ పేసర్లు మరింత మంది తయారవుతారు. ఎలాంటి సౌకర్యాలు పొందకుండానే కెరీర్ ఆరంభించి అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అతడు నాకు అత్యంత సన్నిహితుడు
- వీవీఎస్ లక్ష్మణ్
వెల్‌డన్ జహీర్. నీవు లేకుండా భారత క్రికెట్ ఇన్ని విజయాలు సాధించగలిగేది కాదు. అత్యంత తెలివైన బౌలర్‌వి. క్రికెట్‌కు మరిన్ని సేవలు అందించగల సామర్థ్యం నీకుంది
- ధోని
జహీర్ భాయ్.. నాతో పాటు మరెంతో మంది ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచావు
- కోహ్లి