లక్నోకు కొత్త మెంటార్‌.. కేఎల్‌ రాహుల్‌పై గోయెంకా కామెంట్‌ | IPL 2025: Zaheer Khan Replaces Gambhir As LSG Mentor Sanjeev Goenka Says | Sakshi
Sakshi News home page

గంభీర్‌ స్థానంలో జహీర్‌ ఖాన్‌.. కేఎల్‌ రాహుల్‌పై గోయెంకా కామెంట్‌

Published Wed, Aug 28 2024 6:00 PM | Last Updated on Wed, Aug 28 2024 6:20 PM

IPL 2025: Zaheer Khan Replaces Gambhir As LSG Mentor Sanjeev Goenka Says

సంజీవ్‌ గోయెంకాతో జహీర్‌ ఖాన్‌ (PC: LSG X)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ కొత్త మెంటార్‌ పేరును ప్రకటించింది. టీమిండియా రివర్స్‌ స్వింగ్‌ కింగ్‌ జహీర్‌ ఖాన్‌ తమ జట్టుకు మార్గ నిర్దేశనం చేయనున్నట్లు తెలిపింది. ఈ దిగ్గజ పేసర్‌తో జతకట్టడం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఐపీఎల్‌-2023లో లక్నో మెంటార్‌గా ఉన్న భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌.. ఈ ఏడాది ఆ జట్టును వీడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గౌతీ తిరిగి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గూటికి చేరుకోగా.. లక్నో అతడి స్థానాన్ని అలాగే ఖాళీగా ఉంచింది. ఈ నేపథ్యంలో తాజాగా జహీర్‌ ఖాన్‌ను తమ మెంటార్‌గా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా లక్నో ఫ్రాంఛైజీ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంకా జహీర్‌కు లక్నో జెర్సీ(నంబర్‌ 34)ని ప్రదానం చేశాడు.

రివర్స్‌ స్వింగ్‌ కింగ్‌కు 102 వికెట్లు
కాగా మహారాష్ట్రకు చెందిన 45 ఏళ్ల జహీర్‌ ఖాన్‌ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌... పది సీజన్లలో 100 మ్యాచ్‌లు ఆడి 7.58 ఎకానమీతో 102 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం కోచ్‌ అవతారమెత్తిన జహీర్‌ ఖాన్‌.. తొలుత ముంబై ఇండియన్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌గా పనిచేశాడు. 2018- 2022 మధ్య కాలంలో ఆ ఫ్రాంఛైజీతో ప్రయాణం చేసిన ఈ దిగ్గజ బౌలర్‌.. రెండేళ్ల విరామం అనంతరం మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. కాగా లక్నో బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా స్పీడ్‌స్టర్‌ మోర్నీ మోర్కెల్‌ ఇటీవలే టీమిండియా బౌలింగ్‌ శిక్షకుడిగా నియమితుడైన విషయం తెలిసిందే.

కేఎల్‌ రాహుల్‌పై గోయెంకా కామెంట్‌
ఈ నేపథ్యంలో లక్నో మెంటార్‌గా వ్యవహరించడంతో పాటు ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగాన్ని కూడా జహీర్‌ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. ఇక జస్టిన్‌ లాంగర్‌ ఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా ఉండగా.. లాన్స్‌ క్లూస్నర్‌, ఆడం వోగ్స్‌ అతడికి డిప్యూటీలుగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. లక్నో కెప్టెన్సీకి కేఎల్‌ రాహుల్‌ గుడ్‌బై చెప్తున్నాడనే వార్తల నడుమ.. సంజీవ్‌ గోయెంకా మాట్లాడుతూ.. అతడు తమ కుటుంబంలోని వ్యక్తి లాంటివాడని తెలిపాడు. 

అయితే, తమ కెప్టెన్‌ మార్పు గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. మరోవైపు.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఈ ఏడాది చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన గంభీర్‌ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

చదవండి: భారత స్టార్‌ క్రికెటర్‌ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement