International Center
-
సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు కేంద్రంగా భారత్
న్యూఢిల్లీ: ప్రస్తుత విధానాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటూ భారత్‌ను సాఫ్ట్వేర్ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ఐటీ సంస్థలు దృష్టి పెట్టాలని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సూచించారు. వినూత్నమైన మేడిన్ ఇండియా ఉత్పత్తులను అందించాలని పేర్కొన్నారు. దేశీ వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్లు, యాప్స్ రూపకల్పన ద్వారా కరోనా వైరస్‌పరమైన భారీ సవాళ్లను పరిశ్రమ అసాధారణ రీతిలో ఎదుర్కొందని ప్రశంసించారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఐటీ, కమ్యూనికేషన్స్ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చాయని.. ప్రపంచమంతా భారత్‌ని విశ్వసించడమే ఇందుకు కారణమని ప్రసాద్ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపకల్పన పోటీల విజేతలను ప్రకటించిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వీకన్సోల్ అనే వీడియో కాన్ఫరెన్స్ సొల్యూషన్ రూపొందించిన కేరళకు చెందిన టెక్జెన్సియా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఈ పోటీలో విజేతగా నిల్చింది. విజేతకు రూ. 1 కోటి ఆర్థిక సహాయం, అదనంగా మూడేళ్ల పాటు నిర్వహణ వ్యయాల కోసం రూ. 10 లక్షలు అందించడం జరుగుతుందని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. సర్వ్ వెబ్స్, పీపుల్‌లింక్ యూనిఫైడ్ కమ్యూనికేషన్స్, ఇన్‌స్ట్రైవ్ సాఫ్ట్‌ల్యాబ్స్ సంస్థలు రూపొందించిన ఉత్పత్తులను కూడా అభివృద్ధి చేయడానికి ఆస్కారమున్న సొల్యూషన్స్‌గా జ్యూరీ ఎంపిక చేసింది. వీటికి తలో రూ. 25 లక్షల మద్దతు లభించనుంది. -
అంబేడ్కర్ సిద్ధాంతాల ప్రచారానికి..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జన్‌పథ్ ప్రాంతంలో ‘బీఆర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ సామాజిక, ఆర్థికాంశాలను పరిశోధించేందుకు కీలకమైన కేంద్రంగా మారనుందని వ్యాఖ్యానించారు. ‘అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఇదో స్ఫూర్తి కేంద్రంగా మారనుంది. కేంద్రం ద్వారా అంబేడ్కర్ స్వప్నాన్ని యువత అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. బుద్ధిజం, ఆధునిక వాస్తుశాస్త్రం ఆధారంగా ఈ భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉన్న ఢిల్లీ, ముంబై, నాగ్‌పూర్, మౌ, లండన్ ప్రాంతాలను యాత్రాస్థలాలుగా మార్చామని పేర్కొన్నారు. కేంద్రంలో రెండు అంబేడ్కర్ విగ్రహాలను మోదీ ఆవిష్కరించారు. -
నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ రూపకల్పనకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తాజాగా సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ)తో చేతులు కలిపింది. భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోతగిన చర్యలు, ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేసి 12 వారాల్లోగా నివేదికనిస్తుంది. ఎన్ఐఐటీ చైర్మన్ రాజేంద్ర పవార్ సారథ్యంలో ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌లో ఐటీ, బ్యాంకింగ్, టెలికం రంగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు.