International hockey
-
ఓటమి అంచుల నుంచి...
భువనేశ్వర్: చివరిదాకా ఆధిక్యంలో ఉండి... ఆ తర్వాత ఆఖరి క్షణాల్లో గోల్స్ సమరి్పంచుకొని భారత పురుషుల హాకీ జట్టు మ్యాచ్‌లను చేజార్చుకోవడం చాలాసార్లు జరిగింది. కానీ అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లోభాగంగా ప్రపంచ మాజీ చాంపియన్ నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతమే చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని గెలుపు బాట పట్టింది. శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో 5–2తో నెగ్గిన భారత్... ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ‘షూటౌట్’లో 3–1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. నిర్ణీత సమయం వరకు రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ అద్భుత ప్రతిభతో నెదర్లాండ్స్‌ను నిలువరించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు భారత్ ఒకదశలో 1–3తో వెనుకబడింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో మన్దీప్ (51వ ని.లో), రూపిందర్ (55వ ని.లో) ఒక్కో గోల్ చేసి స్కోరును 3–3తో సమం చేశారు. లలిత్ (25వ ని.లో) ఒక గోల్ చేశాడు. నెదర్లాండ్స్ తరఫున మింక్ (24వ ని.లో), జెరోన్ (26వ ని.లో), కెలెమన్ (27వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ప్రొ లీగ్ రెండో రౌండ్లో ఫిబ్రవరి 8,9వ తేదీల్లో బెల్జియంతో భారత్ ఆడుతుంది. -
పురుషుల జట్టు కివీస్‌తో...మహిళల జట్టు నెదర్లాండ్స్‌తో...
టోక్యో: అంతర్జాతీయ హాకీ సమాఖ్య టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించి ఈవెంట్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. జూలై 24న ప్రారంభోత్సవం తర్వాత ఈవెంట్స్ మొదలయ్యే తొలి రోజు 25న హాకీ మ్యాచ్‌లు మొదలవుతాయి. అదే రోజు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత పురుషుల జట్టు... నెదర్లాండ్స్‌తో భారత మహిళల జట్టు ఆడతాయి. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత పురుషుల జట్టు తర్వాతి మ్యాచ్‌ల్లో ఆ్రస్టేలియా (జూలై 26న), స్పెయిన్ (జూలై 28న), అర్జెంటీనా (జూలై 30న), జపాన్ (జూలై 31న) జట్లతో ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లోనే ఉన్న భారత మహిళల జట్టు తదుపరి మ్యాచ్‌ల్లో జర్మనీ (జూలై 27న), బ్రిటన్ (జూలై 29న), ఐర్లాండ్ (జూలై 31న), దక్షిణాఫ్రికా (ఆగస్టు 1న) జట్లతో తలపడుతుంది. -
ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ: భారత్‌కు సులువైన ‘డ్రా’
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత్‌కు సులువైన ‘డ్రా’ ఎదురైంది. 2020 ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయింగ్ టోర్నీ అయిన ఈ ‘ఎఫ్ఐహెచ్ ఫైనల్స్’ టోర్నీలో భారత్ తమ సొంతగడ్డపైనే గ్రూప్ మ్యాచ్‌లు ఆడనుండటం మరో సానుకూలాంశం. భువనేశ్వర్‌లో జూన్ 6 నుంచి 16 వరకు రెండో పూల్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇందులో భారత్, జపాన్, మెక్సికో, పోలాండ్, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, ఉజ్బెకిస్తాన్ పోటీపడతాయి. సోమవారం ఎఫ్ఐహెచ్ షెడ్యూల్, వేదికల్ని ఖరారు చేసింది. పురుషుల, మహిళల జట్లను ఎనిమిది జట్ల చొప్పున మూడు పూల్స్‌గా విభజించింది. ముందుగా మలేసియాలోని కౌలాలంపూర్‌లో పురుషుల తొలి పూల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 26 నుంచి మే 4 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్‌లోని హిరోషిమాలో జరిగే మహిళల పూల్‌లో భారత్, చిలీ, ఫిజీ, జపాన్, మెక్సికో, పోలాండ్, రష్యా, ఉరుగ్వే జట్లు తలపడతాయి. ఒక్కో పూల్ నుంచి రెండు జట్లు 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాయి. -
హాకీకి సర్దార్ వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత హాకీలో మరో స్టార్ ప్లేయర్ శకం ముగిసింది. 12 ఏళ్లుగా భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సర్దార్ సింగ్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. కొత్త కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏళ్ల ఈ హరియాణా ప్లేయర్ వివరించాడు. హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సర్దార్ 2006లో తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో 307 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున బరిలోకి దిగాడు. మిడ్ ఫీల్డ్‌లో పాదరసంలా కదులుతూ... ఆటను నియంత్రిస్తూ... ఫార్వర్డ్ ఆటగాళ్లకు గోల్స్ చేసే అవకాశాలు సృష్టిస్తూ... ప్రత్యర్థి ఆటగాళ్ల దాడులను మధ్యలోనే తుంచేస్తూ... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2008 నుంచి 2016 వరకు భారత్‌కు కెప్టెన్ వ్యవహరించాడు. ‘ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ హాకీ ఆడుతున్నా. ఇప్పుడు సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికి... కుర్రాళ్లకు అవకాశమివ్వాలని నిర్ణయించుకున్నా. కుటుంబ సభ్యులు, హాకీ ఇండియా, మిత్రులతో చర్చించాకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని తీసుకున్నా’ అని సర్దార్ వివరించాడు. ‘నా నిర్ణయానికి ఫిట్నెస్ సమస్య కాదు. మరో మూడేళ్లు ఆడే ఫిట్నెస్ నాలో ఉంది. ప్రతి దానికి సమయం అంటూ ఉంటుంది కదా. హాకీకి వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసిందని భావించా’ అని సర్దార్ వివరించాడు. 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడిన సర్దార్కు 2012లో ‘అర్జున’... 2015లో ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి. అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పినప్పటికీ దేశవాళీ టోర్నీల్లో ఆడతానని... 2010, 2018 ఏషియాడ్‌లో కాంస్యం, 2014 ఏషియాడ్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యుడైన సర్దార్ వివరించాడు. -
రీతూ..గుడ్ బై
న్యూఢిల్లీ: ఇటీవల రియోలో జరిగిన ఒలింపిక్స్ ముందు భారత మహిళ హాకీ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన మాజీ కెప్టెన్ రీతూ రాణి అంతర్జాతీయ హాకీకి గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని రీతూ మెయిల్ ద్వారా వెల్లడించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు నరేందర్ బత్రా తెలిపారు. 'రెండు రోజుల క్రితం జాతీయ హాకీ శిబిరంలో పాల్గొనడం లేదని రీతూ పేర్కొంది. దాంతో పాటు అంతర్జాతీయ హాకీ నుంచి వీడ్కోలు చెబుతున్న విషయాన్ని కూడా ఆ మెయిల్ స్పష్టం చేసింది. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. భారత హాకీ జట్టుకు సేవలందించిన రీతూ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం' అని బత్రా పేర్కొన్నారు. గత రెండు నెలల క్రితం రీతూను అటు కెప్టెన్‌గా, ఇటు క్రీడాకారిణిగా జట్టు నుంచి తొలగిస్తూ హాకీ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే రీతూ ఆవేదన వ్యక్తం చెందింది. తనపై వివక్ష చూపించి జట్టు నుంచి తొలగించారంటూ కన్నీటి పర్యంతమైంది. -
వరల్డ్ హాకీ లీగ్‌కు సౌందర్య, రజని
మార్చి 7 నుంచి టోర్నీ న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ఆధ్వర్యంలో జరిగే వరల్డ్ లీగ్ రౌండ్-2లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులుగల టీమిండియాకు మిడ్‌ఫీల్డర్ రీతూ రాణి నేతృత్వం వహిస్తుంది. దీపిక వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. ఈ బృందంలో తెలంగాణకు చెందిన యెండల సౌందర్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గోల్‌కీపర్ రజని ఎతిమరుపు స్థానాన్ని దక్కించుకున్నారు. మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో మార్చి 7 నుంచి 15 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పోలండ్, ఘనా, థాయ్‌లాండ్... గ్రూప్ ‘బి’లో మలేసియా, రష్యా, కజకిస్థాన్, సింగపూర్ జట్లు ఉన్నాయి.