International Journals
-
మొబైల్ ఫోన్‌తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందున్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్లుగా ఉంది. అయితే, ఇది అపోహ మాత్రమేనని, ఎంతమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫోన్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు మధ్య ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటున్నాయి. ఈ అంశంపై జరిగిన 5 వేలకుపైగా అధ్యయనాలను ఆ్రస్టేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్, న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ(అర్పాన్సా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. కానీ, బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచనతో జరిగిన ఈ విశ్లేషణ వివరాలను ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు, మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్లు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌ను పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టంచేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీనిపై ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పాయి. 2011లో డబ్ల్యూహెచ్ఓ అనుబంధ విభాగమైన ఇంటర్నేషన్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(ఐఏఆర్సీ) సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే, ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారంపై ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమై అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేలి్చచెప్పారు. ఫోన్లతో క్యాన్సర్లు వస్తాయన్న ఆపోహ వీడాలని సూచించారు. -
విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత
సాగర గర్భం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నిలయం. ఎన్నో అంతుచిక్కని జీవరాశులకు ఆలవాలం. సముద్రం లోతుపాతుల్ని అన్వేషిస్తున్న క్రమంలో అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు, మెరైన్ బయాలజిస్టులకు అరుదైన సముద్ర జీవరాశుల ఉనికి లభ్యమవుతోంది. తాజాగా అలాంటి అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ భారతదేశ తూర్పు తీరంలో విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. ఇది అచ్చం రాలిన ఆకును పోలి ఉండి చదునైన శరీరాన్ని కలిగి ఉంది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా సముద్ర తీరంలో ఆటుపోట్లు సంభవించే (ఇంటర్ టైడల్) ప్రాంతంలో వివిధ రకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి. వీటిలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేసేవారు వీటిని రికార్డు చేస్తున్నారు. విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఈసీసీటీ, గ్రీన్ పా సంస్థలకు చెందిన మెరైన్ బయాలజిస్టులు ఇంటర్ టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో గతేడాది జూలైలో వాక్ చేస్తున్నప్పుడు మూడు సెంటీమీటర్ల పొడవున్న మెరైన్ ఫ్లాట్‌వార్మ్ (సాంకేతిక నామం సూడోసెరోస్ గలాథీన్సిస్ –Pseudoceros galatheensis) కనిపించింది. ఏదైనా అరుదైన జీవి కనిపించినప్పుడు దాని గురించి సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లాట్‌వార్మ్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్‌కు పంపగా ఈ జూలై మొదటి వారంలో ప్రచురించింది. తూర్పు తీరంలో మరెక్కడా లభించని ఉనికి.. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఫ్లాట్‌వార్మ్ జాతులు ఉన్నా ఐదేళ్ల క్రితం వరకు వీటి జాడ భారతదేశంలో ఎక్కడా లభ్యం కాలేదు. 2017లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) నిపుణులు అండమాన్‌లో పాలిక్లాడ్ వర్గానికి చెందిన ఈ ఫ్లాట్‌వార్మ్ ఉనికిని మొదటిసారి కనుగొన్నారు. తూర్పు తీరంలో మరెక్కడా ఇప్పటిదాకా ఈ జీవి ఉనికి కనిపించలేదు. దీంతో తొలిసారిగా దేశంలోని తూర్పు తీరంలోని విశాఖలో ఫ్లాట్‌వార్మ్ జాడ లభించినట్టైంది. విశాఖలో మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. విష పూరితాలు కూడా.. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను, రాళ్లపై ఉండే స్పంజికలు, అసిడియన్లు వంటి జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పగడపు దిబ్బలు, లోతు లేని సముద్రంలోని రాతి ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు రెండు మడతలను కలిగి ఉండి ప్రతి మడతపై 12 కళ్ల మచ్చలుంటాయి. అవి కాంతిని గ్రహించడానికి ఉపయోగపడతాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. కాగా వీటి జీవిత కాలం ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని.. ప్రజల భాగస్వామ్యంతో కొత్త సముద్ర జీవరాశుల ఉనికి మరింతగా తెలుస్తుంది. అందుకే మేం ఆసక్తి ఉన్న ప్రజలతో కలిసి మెరైన్ వాక్ చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. ప్రజలు ముందుకొస్తే ఇంకా చాలా జాతులను కనుగొనవచ్చు. విశాఖ రుషికొండ తీరంలో కనుగొన్న ఫ్లాట్‌వార్మ్ తూర్పు తీరంలోనే మొట్టమొదటిదిగా రికార్డయింది. దీంతో పాటు మరో రెండు జాతులను చూశాం. అవి ఏంటనేది త్వరలో తెలుస్తుంది. మా ప్రాజెక్టు ద్వారా విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటిదాకా 130కి పైగా సముద్ర జాతులను కనుగొన్నాం. – శ్రీచక్ర ప్రణవ్, మెరైన్ బయాలజిస్టు, ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, విశాఖపట్నం -
పులివెందుల డాక్టర్‌కు అంతర్జాతీయ పురస్కారం
సాక్షి, కడప : పులివెందులలోని భాకరాపురంలోనున్న దినేష్ మెడికల్ సెంటర్లో ఎముకల, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ రణధీర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. రణధీర్‌రెడ్డి పరిశోధించి ఆపరేషన్ నిర్వహించిన ఒక రిపోర్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ కేస్ రిపోర్టుకు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో ప్రచురించారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాదుకు చెందిన అమర్నాథ్ అనే వ్యక్తికి మోచేయి కీలు దగ్గర గాయమై.. రేడియల్ హెడ్ అనే ఎముక పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు అదే ఎముక మణికట్టు వద్ద విరిగినట్లు గుర్తించారు. దీనివల్ల ఎముక రెండు వైపుల విరుగుట వల్ల ఎముకకు రెండు వైపుల ఉన్న జాయింట్ దెబ్బతింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌కు అమర్నాథ్ వచ్చి ఎముకల కీళ్ల శస్త్ర చికిత్స నిపుణుడు, డాక్టర్ రణధీర్‌రెడ్డిని సంప్రదించారు. వెంటనే అందుకు అవసరమైన పరిశీలన చేసి టైటానియంతో తయారు చేసిన కృత్రిమ రేడియల్ హెడ్‌ను అమర్చడంలో సఫలీకృతులయ్యారు. ఇలాంటి ఆపరేషన్లు దేశంలోనే అరుదుగా జరుగుతాయని డాక్టర్ రణధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత ఎముకకు ఇరువైపుల ఉన్న జాయింట్ కూడా సక్రమంగా పని చేస్తుండడంతో ఒక గొప్ప విజయంగా వారు అభివర్ణించారు. గతంలో కూడా పులివెందుల దినేష్ మెడికల్ సెంటర్లో డాక్టర్ రణధీర్‌రెడ్డి జాయింట్ మార్పిడి ఆపరేషన్లు, వెన్నపూస ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో దినేష్ మెడికల్ సెంటర్లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అరుదైన ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రణధీర్‌రెడ్డిని ఆస్పత్రి ఎండీ, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అభినందించారు.