సాగర గర్భం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నిలయం. ఎన్నో అంతుచిక్కని జీవరాశులకు ఆలవాలం. సముద్రం లోతుపాతుల్ని అన్వేషిస్తున్న క్రమంలో అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు, మెరైన్ బయాలజిస్టులకు అరుదైన సముద్ర జీవరాశుల ఉనికి లభ్యమవుతోంది. తాజాగా అలాంటి అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ భారతదేశ తూర్పు తీరంలో విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. ఇది అచ్చం రాలిన ఆకును పోలి ఉండి చదునైన శరీరాన్ని కలిగి ఉంది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా సముద్ర తీరంలో ఆటుపోట్లు సంభవించే (ఇంటర్ టైడల్) ప్రాంతంలో వివిధ రకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి. వీటిలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేసేవారు వీటిని రికార్డు చేస్తున్నారు. విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు.
ఇలా ఈసీసీటీ, గ్రీన్ పా సంస్థలకు చెందిన మెరైన్ బయాలజిస్టులు ఇంటర్ టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో గతేడాది జూలైలో వాక్ చేస్తున్నప్పుడు మూడు సెంటీమీటర్ల పొడవున్న మెరైన్ ఫ్లాట్‌వార్మ్ (సాంకేతిక నామం సూడోసెరోస్ గలాథీన్సిస్ –Pseudoceros galatheensis) కనిపించింది. ఏదైనా అరుదైన జీవి కనిపించినప్పుడు దాని గురించి సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లాట్‌వార్మ్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్‌కు పంపగా ఈ జూలై మొదటి వారంలో ప్రచురించింది.
తూర్పు తీరంలో మరెక్కడా లభించని ఉనికి..
ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఫ్లాట్‌వార్మ్ జాతులు ఉన్నా ఐదేళ్ల క్రితం వరకు వీటి జాడ భారతదేశంలో ఎక్కడా లభ్యం కాలేదు. 2017లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) నిపుణులు అండమాన్‌లో పాలిక్లాడ్ వర్గానికి చెందిన ఈ ఫ్లాట్‌వార్మ్ ఉనికిని మొదటిసారి కనుగొన్నారు. తూర్పు తీరంలో మరెక్కడా ఇప్పటిదాకా ఈ జీవి ఉనికి కనిపించలేదు. దీంతో తొలిసారిగా దేశంలోని తూర్పు తీరంలోని విశాఖలో ఫ్లాట్‌వార్మ్ జాడ లభించినట్టైంది. విశాఖలో మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు.
విష పూరితాలు కూడా..
ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను, రాళ్లపై ఉండే స్పంజికలు, అసిడియన్‌లు వంటి జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పగడపు దిబ్బలు, లోతు లేని సముద్రంలోని రాతి ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు రెండు మడతలను కలిగి ఉండి ప్రతి మడతపై 12 కళ్ల మచ్చలుంటాయి. అవి కాంతిని గ్రహించడానికి ఉపయోగపడతాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. కాగా వీటి జీవిత కాలం ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని..
ప్రజల భాగస్వామ్యంతో కొత్త సముద్ర జీవరాశుల ఉనికి మరింతగా తెలుస్తుంది. అందుకే మేం ఆసక్తి ఉన్న ప్రజలతో కలిసి మెరైన్ వాక్ చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. ప్రజలు ముందుకొస్తే ఇంకా చాలా జాతులను కనుగొనవచ్చు. విశాఖ రుషికొండ తీరంలో కనుగొన్న ఫ్లాట్‌వార్మ్ తూర్పు తీరంలోనే మొట్టమొదటిదిగా రికార్డయింది. దీంతో పాటు మరో రెండు జాతులను చూశాం. అవి ఏంటనేది త్వరలో తెలుస్తుంది. మా ప్రాజెక్టు ద్వారా విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటిదాకా 130కి పైగా సముద్ర జాతులను కనుగొన్నాం.
– శ్రీచక్ర ప్రణవ్, మెరైన్ బయాలజిస్టు, ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment