సొరిసిడే కుటుంబానికి చెందిన చిట్టెలుక తరహాలో ఉండే జీవిని గుర్తించిన వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్
ఏనుగు తొండం మాదిరిగా కదలికలు గల మూతి భాగం, వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం
అనంతపురం: కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జువాలజీ విభాగానికి చెందిన టీచింగ్ అసిస్టెంట్ డాక్టర్ బాలసుబ్రమణ్యం గుర్తించారు. అరుదైన జాతికి చెందిన క్షీరదంగా నిర్ధారించారు. పొడుచుకు వచ్చినట్టు ఏనుగు తొండంలా, కదలికలు గల మూతి భాగం(రోష్ట్రం) నిర్మాణ శైలిని కలిగి వెడల్పాటి చెవులు, ఒంటె మూపురం వంటి దేహ నిర్మాణం కలిగి ఉంది.
సొరిసిడే కుటుంబానికి చెందిన ఈ క్షీరదం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. దీని సహజ నివాసం ఉష్ణ లేదా ఉష్ణమండల పొడి అడవులు మాత్రమే. డీఎన్‌ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డెహ్రాడూన్)కు పంపించారు.
ఇప్పటి దాకా పేరు లేని జీవి
» ప్రస్తుతం గుర్తించిన ఈ అరుదైన జీవికి ఇప్పటి దాకా ఎలాంటి పేరు లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ 465 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో జీవ వైవిధ్యం పెంపొందించేలా మియావాకీ అడవులను పెంచుతున్నారు. ఇందులోనే దీనిని గుర్తించారు.
» ఈ జాతి అటవీ ప్రాంతాలు, వ్యవసాయ భూములు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ప్రాంతాలలో అరుదుగా కనిపిస్తుంది. రక్షిత ఆవాసాలలో గూడు కట్టుకుని నివసిస్తుంది. ఆకులు, అందుబాటులో ఉన్న ఏదైనా ఇతర గూడు పదార్థాలను సేకరించి, ఆపై గూడును నిర్మించడానికి ఒక రహస్య ప్రాంతాన్ని కనుగొంటాయి.
» చిట్టెలుకలు ప్రధానంగా కీటకాహారులు. ఇవి 82 శాతం కీటకాలను తింటాయి. కొన్ని సార్లు మొక్కలను, విత్తనాలను తింటాయి. అలాగే అనేక రకాల అకశేరుకాలు, మానవ ఆహార పదార్థాలను కూడా తింటాయి.
» ఇవి రాత్రి పూట ఎక్కువగా అడవులు, సాగు చేసిన పొలాలు, మానవ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆహారం తీసుకుంటాయి. కీటకాలు, తెగుళ్లు రాకుండా అరికడతాయి. రైతులకు కీటకాలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.
పొడి అడవుల్లో మాత్రమేజీవించే అరుదైన జీవి
కొత్త చిట్టెలుక జాతికి చెందిన క్షీరదాన్ని ఎస్కేయూలో గుర్తించాం. పొడి అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన జీవి ఇది. డీఎన్‌ఏ అనాలిసిస్ కోసం వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డెహ్రాడూన్)కు పంపాము.– డాక్టర్ బాలసుబ్రమణ్యం, జువాలజీ విభాగం టీచింగ్ అసిస్టెంట్, ఎస్కేయూ
Comments
Please login to add a commentAdd a comment