ఇంజన్ పేలడంతో ఎగసిపడ్డ మంటలు ∙9 మందికి గాయాలు..
కాపాడిన ఐసీజీఎస్ వీరా నౌక
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/కాకినాడ రూరల్: విశాఖ సముద్ర తీరంలో శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్ పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా గత నెల 26వ తేదీన శ్రీదుర్గాభవాని ఐఎన్‌డీ ఏపీ 47 బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది.
20 నాటికన్ మైళ్ల దూరంలో..
విశాఖకు 20 నాటికన్ మైళ్ల దూరంలో మత్స్యకారుల బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్నవారు వారికి సాయం అందించి కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం చేరవేశారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నేవల్ డాక్‌యార్డ్‌కు తీసుకొచ్చి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు.
మత్స్యకారులు ఆర్.సత్తిబాబు, ఎన్.వజ్రం, ఎస్.సత్తిబాబు, కె.ధర్మారావు, వై.సత్తిబాబులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాకినాడ మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఫిషింగ్ హార్బర్ పీవో అనురాధ మత్స్యకారుల వివరాలు సేకరించారు. కాకినాడ మత్స్యకారులకు ప్రమాదం తప్పిందని, కోస్టుగార్డు సిబ్బంది వారిని సురక్షితంగా విశాఖకు తరలించారని, చికిత్స అనంతరం తిరిగి కాకినాడ చేరుకుంటారని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment