సాక్షి, కడప : పులివెందులలోని భాకరాపురంలోనున్న దినేష్ మెడికల్ సెంటర్‌లో ఎముకల, కీళ్ల శస్త్ర చికిత్స నిపుణులుగా పని చేస్తున్న డాక్టర్ రణధీర్‌రెడ్డికి అంతర్జాతీయ పురస్కారం లభించింది. రణధీర్‌రెడ్డి పరిశోధించి ఆపరేషన్ నిర్వహించిన ఒక రిపోర్టుకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ కేస్ రిపోర్టుకు ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో ప్రచురించారు. వివరాల్లోకి వెళితే...హైదరాబాదుకు చెందిన అమర్‌నాథ్ అనే వ్యక్తికి మోచేయి కీలు దగ్గర గాయమై.. రేడియల్ హెడ్ అనే ఎముక పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు అదే ఎముక మణికట్టు వద్ద విరిగినట్లు గుర్తించారు.
దీనివల్ల ఎముక రెండు వైపుల విరుగుట వల్ల ఎముకకు రెండు వైపుల ఉన్న జాయింట్ దెబ్బతింది. ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. పులివెందులలోని దినేష్ మెడికల్ సెంటర్‌కు అమర్‌నాథ్ వచ్చి ఎముకల కీళ్ల శస్త్ర చికిత్స నిపుణుడు, డాక్టర్ రణధీర్‌రెడ్డిని సంప్రదించారు. వెంటనే అందుకు అవసరమైన పరిశీలన చేసి టైటానియంతో తయారు చేసిన కృత్రిమ రేడియల్ హెడ్‌ను అమర్చడంలో సఫలీకృతులయ్యారు.
ఇలాంటి ఆపరేషన్లు దేశంలోనే అరుదుగా జరుగుతాయని డాక్టర్ రణధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆపరేషన్ తర్వాత ఎముకకు ఇరువైపుల ఉన్న జాయింట్ కూడా సక్రమంగా పని చేస్తుండడంతో ఒక గొప్ప విజయంగా వారు అభివర్ణించారు. గతంలో కూడా పులివెందుల దినేష్ మెడికల్ సెంటర్‌లో డాక్టర్ రణధీర్‌రెడ్డి జాయింట్ మార్పిడి ఆపరేషన్లు, వెన్నపూస ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాకుండా అతి తక్కువ ఖర్చుతో దినేష్ మెడికల్ సెంటర్‌లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అరుదైన ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రణధీర్‌రెడ్డిని ఆస్పత్రి ఎండీ, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అభినందించారు.
పులివెందుల డాక్టర్‌కు అంతర్జాతీయ పురస్కారం
Published Sun, Jun 14 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement