ప్రపంచాన్ని చుట్టేసిన ఏటికొప్పాక లక్కబోమ్మ
అంకుడు కర్రతో అద్భుత కళారూపాలు
సహజరంగుల వినియోగంతో ఇనుమడించిన ఖ్యాతి
రాంచీ నుంచి లక్క.. తూర్పు కనుమల నుంచి రంగులు
మన్‌కీ బాత్‌లో లక్క బొమ్మల విశిష్టతను ప్రస్తావించిన ప్రధాని
సహజసిద్ధమైన ఈ బొమ్మల తయారీ డాక్యుమెంట్‌కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు.
జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి
రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.
ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు.
బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..
ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి.
పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు.
చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది.
విదేశాలకు ఎగుమతి
ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి.
జాతీయ, అంతర్జాతీయ అవార్డులు
ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.
సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.
కళ అంతరించిపోకూడదనే..
ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది.
– శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment