ankudu stick
-
చక్కని బొమ్మా.. నిను చెక్కిన చేతులకు సలాం
సాక్షి, అనకాపల్లి: ఏడు దశాబ్దాల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో నాలుగు విశ్వకర్మ కుటుంబాలు జీవనోపాధి కోసం లక్కబోమ్మల తయారీ ప్రారంభించాయి. నాడు అవసరం కోసం బీజం పడిన ఈ కళ ఇప్పుడు ఆ గ్రామానికి ప్రపంచపటంలో ఒక గుర్తింపు తీసుకువచ్చిం ది. అంకుడు కర్రలతో లక్కబోమ్మలు తయారు చేసే హస్తకళాకార కుటుంబాలు ఈ గ్రామంలో దాదాపు 150 వరకూ వున్నాయి. మారుతున్న కాలానికి, సాంకేతికతకు అనుగుణంగా ఇక్కడి కళాకారులు కూడా విశేష నైపుణ్యంతో అపురూప కళాఖండాలను తమ మునివేళ్లతో సృష్టించి అబ్బురపరుస్తున్నారు. జార్ఖండ్ నుంచి లక్క దిగుమతి రసాయన రంగులతో పోలిస్తే సహజ రంగులే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే లక్కకి సహజమైన రంగులను కలిపి ఇక్కడి కళాకారులు అనేక ప్రయోగాలు చేస్తుంటారు. చుట్టుపక్కల లభించే ఉసిరి, కరక్కాయ, వేప వంటి వాటితో సహజ రంగులను తయారు చేస్తారు. సహజమైన లక్కను ఎక్కువగా జార్ఖండ్‌లోని రాంచీ నుంచి దిగుమతిచేసుకుంటారు. అక్కడ ఒక రకమైన సూక్ష్మజీవి విసర్జితాల నుంచి ఇది లభిస్తుంది. స్థానిక గిరిజనులు దాన్ని సేకరించి అమ్ముతారు.ఆ లక్కకి తూర్పుకనుమల్లో దొరికే వివిధ రకాల మొక్కలు, వాటి విత్తనాలు, ఆకులు, వేళ్లు, కాండం నుంచి వచ్చే సహజ సిద్ధమైన రంగులను కలుపుతారు. 100 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద లక్కని వేడిచేసి, రంగుని కలిపి... దాన్ని బొమ్మలకు అద్దుతారు. గది ఉష్ణోగ్రతవద్ద వద్ద ఈ రంగులు ఎంత కాలమైనా పాడవకుండా ఉంటాయి. 1990 వరకు ఏటికొప్పాక బొమ్మలకు రసాయన రంగులే పూసేవారు. గ్రామానికి చెందిన సీవీ రాజు (చింతలపాటి వెంకటపతిరాజు) రసాయన రంగుల స్థానంలో సహజ సిద్ధమైన రంగులను వాడటం మొదలుపెట్టారు. క్రమంగా గ్రామంలోని కళాకారులందరూ సహజరంగులు వినియోగించడం ప్రారంభించారు. బొమ్మల తయారీలో మహిళలే ఎక్కువ..ఏటికొప్పాకలో దాదాపు ప్రతి ఇంటిలోనూ బొమ్మల తయారీ కళాకారులుంటారు. ఇందులో మహిళలే అధిక సంఖ్యలో ఉంటారు. ఇంటి పనులు చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా వీరు బొమ్మలు తయారు చేస్తుంటారు. మరికొందరు దీన్నే వృత్తిగా తీసుకుంటారు. కుంకుమ భరిణెలు, ఆభరణాలు దాచుకునే డబ్బాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మహిళలు ధరించే గాజులు, కీచైన్లు, ఫ్లవర్‌వాజ్‌లు, దేవతామూర్తుల బొమ్మలు మొదలుకుని గ్రామీణ వాతావరణం, శ్రీ వేంకటేశ్వరస్వామి, రామాంజనేయ యుద్ధ సన్నివేశాలు,పెళ్లి తంతు, పెళ్లి సారె ఇలా ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడి కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటాయి. పొట్టకూటి కోసం తయారుచేసిన లక్క బొమ్మ.. కాలాంతరంలో ఆ గ్రామానికి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిపెట్టింది. వంట చెరకుగా కూడా పనికిరాని అంకుడు కర్ర మూలవస్తువుగా, ఆకులూ అలములే సహజ రంగులుగా, కళాకారుడి సృజనాత్మకతే అతిపెద్ద పెట్టుబడిగా తయారవుతున్న ఏటికొప్పాక లక్కబొమ్మ ప్రపంచం నలుమూలలా గొప్ప ఆదరణ పొందుతోంది. వరాహనది ఒడ్డున ఉన్న ఈ ప్రశాంత గ్రామంలో నిరంతరం ఉలి శబ్ధం వినిపిస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన బొమ్మల తయారీ కోసం కళాకారులు తమ సృజనకు పదును పెడుతూనే ఉంటారు. చేయితిరిగిన ఇక్కడి కళాకారుడి ఉలి నుంచి జాలువారిన ఒక్కో బొమ్మా ఒక్కో కళాఖండమే.. వందలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న ఏటికొప్పాక బొమ్మ రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు సైతం అందుకుంది. ఏటికొప్పాక హస్తకళా నైపుణ్యంపై ‘సాగా ఆఫ్ ది విమెన్’ పేరిట ప్రొఫెసర్ బొగాది నీలిమ తీసిన డాక్యుమెంటరీ ప్రపంచ స్థాయిలో రెండో స్థానం దక్కించుకుంది. విదేశాలకు ఎగుమతి ఏటికొప్పాక లక్కబొమ్మలకు దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. సహజసిద్ధమైన రంగులతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించడం ఎన్నాళ్లయినా ఈ రంగులు సహజత్వాన్ని కోల్పోకుండా ఉండటంతో విదేశీయులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా తెప్పించుకునే వెసులుబాటు ఉండటం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిలో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా, ఆ్రస్టేలియా, పోలెండ్, హాలెండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, జర్మనీ, శ్రీలంక, నేపాల్ దేశాలకు ఏటికొప్పాక బొమ్మలు ఎగుమతవుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఏటికొప్పాక లక్కబోమ్మలను వినూత్న రీతిలో తయారు చేసిన పలువురు కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ప్రధాని మోదీ “మన్ కీ బాత్ఙ్ కార్యక్రమంలో లక్క బొమ్మల విశిష్టత గురించి ప్రస్తావించారు. భారత నౌకాదళం విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ–2016లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ని ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ తన ఫొటోతో తయారు చేసిన లక్క డబ్బాని చూసి ముచ్చటపడి దాని మీద సంతకం కూడా చేశారు.సహజసిద్ధమైన రంగులతో ప్రయోగాలు చేసి, ఏటికొప్పాక బొమ్మకి కొత్త కళను తెచ్చినందుకు సీవీ రాజుకి 2002లో రాష్ట్రపతి అవార్డు, 2012 లో నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. అదేవిధంగా ఏటికొప్పాకకు చెందిన మరో కళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి మైక్రో ఆర్ట్స్‌లో నిపుణుడు. 2003లో జాతీయ హస్త కళల పోటీలో ఇతను తయారు చేసిన బొమ్మకు ప్రథమ బహుమతి లభించింది. అలాగే బియ్యపు గింజమీద పట్టేంత వీణ, గుండుసూది మీద పట్టేంత తాజ్ మహల్, ఏనుగు, బుద్ధుడు, ఎడ్లబండి, శ్రీరామ పట్టాభిషేకం, తల వెంట్రుక మీద నిలబెట్టగలిగే పక్షులు... ఇలా అనేక మినీయేచర్ ఆర్టులను చిన్నయాచారి తయారుచేసి అవార్డులు పొందారు.కళ అంతరించిపోకూడదనే.. ఒకప్పుడు రూ.400కు దొరికే అంకుడు కర్రల మోపు.. ఇప్పుడు రూ.4వేలకు పెరిగింది. ఇది కళాకారులకు భారంగా మారింది. స్థానికంగా అంకుడు కర్ర డిపో ఏర్పాటు చేస్తే కళాకారులకు ఉపయుక్తంగా ఉంటుంది. అద్భుతమైన లక్కబోమ్మల తయారీ కళ అంతరించిపోకూడదు. ఇది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చిన అరుదైన కళ. బొమ్మల తయారీ గిట్టుబాటు కావడం లేదని గతంలో చాలా మంది కళాకారులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్లిపోయారు. దీనిని కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు గ్రామంలో సుమారు 100 మందికి పైగా మహిళలకు శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం వారికి ఇది ఉపాధినిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుంది. – శ్రీశైలపు చిన్నయాచారి, కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత -
ఏటి ‘గొప్పా’క
యలమంచిలి రూరల్, అచ్యుతాపురం: విశాఖ జిల్లా యలమంచిలి మండలం వరాహనది ఒడ్డున ఉన్న ఏటికొప్పాక గ్రామంలో అంకుడు కర్రతో రూపొందించిన బొమ్మలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాయి. ఇక్కడి కళాకారులు సహజసిద్ధంగా లభించే కర్ర,, మైనం, సహజ రంగులతో తమ సృజనకు పదునుపెట్టి అనేకరూపాల్లో బొమ్మలు తయారు చేస్తారు. ఏటా ఈ గ్రామం నుంచి రూ. 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. రిటైల్ అమ్మకం దారులు, సరుకురవాణాచేసేవారు.. ఇలా అనేక కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ఏటికొప్పాక కళ వందేళ్లక్రితం ఉప్పుచిప్ప, కుంకుమ భరిణి, పిల్లలు ఆడుకునే దొండకాయ తయారీతో ప్రారంభమయింది. ఒక తరం నుంచి మరో తరానికి.. ఏటికొప్పాక బొమ్మల తయారీకి ఎటువంటి శాస్త్రం లేదు. ఒక తరం నుంచి మరోతరం నేర్చుకోవడమే జరుగుతోంది. ఒక బొమ్మ తయారీకి 3 నుంచి 10 విడిభాగాలు తయారుచేస్తారు. పలు బొమ్మల సమాహారం ఒక చిత్రరూపంగా రూపొందుతుంది. అంకుడు కర్రను విడిభాగాలుగా చెక్కి వాటికి మైనం పూస్తారు. ఒక్కొక్క భాగానికి రంగులు అద్ది ఆరబెడతారు. విడిభాగాలన్నీ కలిపి బొమ్మ తయారుచేస్తారు. రాజు, రాణి, పల్లకీ, భటులు.. ఇలా బొమ్మలను కలిపి చిత్రరూపంగా తయారుచేసి అమ్మకానికి పెడతారు. చారిత్రక కథారూపాలు, గ్రామీణ ఉత్సవ సందడి, అన్నమయ్య, దశావతారాల ఆలయం, పెళ్లిసందడి, రథం, పల్లెటూరు, ఎడ్లబండి వంటి చిత్రరూపాలను కళాకృతులుగా తయారుచేసి ఏటికొప్పాక కళాకారులు తమ సత్తా చాటారు. వైఎస్సార్ ఆసరాతో ఉలి పట్టిన బాలికలు కొన్నాళ్ల క్రితం వరకు కళాఖండాల తయారీలో మహిళలు ఉలిపట్టుకునేవారు కాదు. మగవారు బొమ్మల్ని తయారుచేస్తే మహిళలు మైనం, రంగులు అద్దేవారు. వైఎస్సార్ హయాంలో రూ. 50 లక్షలతో గ్రామంలో కళాకారులకు కమ్యూనిటీహాల్ నిర్మించారు. ప్రత్యేక కాలనీ, విద్యుత్ మోటార్లు ఇచ్చారు. కళాకారుల సంక్షేమ సంఘం ద్వారా పాఠశాల స్థాయిలో బొమ్మల తయారీపై శిక్షణ ప్రారంభించారు. దీంతో ఎక్కువగా బాలికలు బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. విద్యుత్ మోటార్ల వినియోగం పెర గడంతో బొమ్మల తయారీలో శారీరక శ్రమ తగ్గింది. అవార్డుల పంట అంకుడుకర్రతో కళాకృతులు రూపొందించి ఈ గ్రామానికి చెందిన కళాకారులు అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. శ్రీశైలపు చిన్నయాచారి 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. శ్రీశైలపు రమణ, పెదపాటి ఆనందాచారి జాతీయ మెరిట్ పురస్కారం పొందారు. పీఆర్వీ సత్యనారాయణ, కొత్తలి శ్రీను, కె.సోమేశ్వరరావు, లక్కరాజు నాగేశ్వరరావు, పెదపాటి శివకృష్ణ రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ‘అమ్మ’కాల్లో అగ్రస్థానం... బిడ్డను ఎత్తుకొని లాలించే అమ్మ బొమ్మను ఏటికొప్పాక కళాకారులు దశాబ్దం క్రితం రూపొందించారు. ఈ బొమ్మ విశేష ఆదరణ పొందింది. ఈ ఆకృతిలో ఉండే బొమ్మల అమ్మకాలే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి. ఏటా వేల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఈ బొమ్మనే చాలా కార్యక్రమాల్లో అవార్డుగా ప్రదానం చేస్తున్నారంటే దీని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలోనూ ఏటి కొప్పాక బొమ్మల్నే మెమెంటోలుగా అందజేశారు. తరతరాలుగా కొనసాగుతున్న కళ.. బొమ్మల తయారీని తరతరాల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నాము. బ్రిటీషు వారి హయాంలోనే కుంకుమ భరణి, ఉప్పుచిప్ప, దొండకాయ, పెళ్లికొడుకు పెళ్లికూతురు బొమ్మల్ని చెక్కారు. ఉప్మాక తీర్థంలో అమ్మకానికి పెట్టేవారు. 1910 నాటికి మా తాత పెదపాటి సత్యం హయాంలో చిలుకలు ,పెళ్లికి వ్రతంకి నగిసీలుదిద్దిన పీటలు, డబ్బులపెట్టి తయారుచేసేవారు. మా నాన్న ఆనందాచారి హయాంకి నాజూకైన బొమ్మల తయారీపై దృష్టి పెట్టారు. మా నాన్నగారి హయాంలో రంగులను తగుమోతాదులను మార్చడంద్వారా కొత్తరంగులను కనుక్కున్నారు. ద్రాక్ష గుత్తులు, అరటి పళ్లు వంటివి తయారుచేసేవారు. మా తరంలో ఆలయ సముదాయం, గుర్రపు బండి పెండ్లిసందడి వంటి సన్నివేశాలను ప్రదర్శించేలా కళాకృతుల సమ్మేళనాలను తయారుచేస్తున్నాము. అప్పట్లో ఈ పరిశ్రమ లాభసాటిగా ఉండేది. ఈ మధ్య చైనా బొమ్మల పోటీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రోత్సాహం ఉంటే మరింత మంది కళాకారులు తయారయ్యే అవకాశం ఉంది. – పెదపాటి శరత్, జాతీయఅవార్డు గ్రహీత సిరామిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసే దేశ, విదేశీ బొమ్మలు కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఏటి కొప్పాక బొమ్మల్లో సహజసిద్ధమైన రంగుల్ని మాత్రమే వినియోగించడం వల్ల ఎన్నాళ్లు ఉన్నా గాలిలో రసాయన మార్పులు చెందవు. సహజరంగుల తయారీ ఇలా.. మైనంకి ఎటువంటి రంగు ఉండదు. మైనం కరిగించి దీనిలో స్వయంగా తయారు చేసుకున్న సహజ రంగుల్ని కలిపి కర్రకు పూస్తారు. ఎరుపు రంగు: బిక్షా ఒరిల్లా విత్తనాల నుంచి ఎరుపురంగు తయారుచేస్తారు. కేజీ విత్తనాలను లీటరు నీటిలో నానబెట్టి రంగునీళ్లు సేకరిస్తారు. దీన్ని మరిగించడంతో చిక్కటి ఎరుపురంగు ద్రావణం తయారవుతుంది. నీలంరంగు: ఇండిగో మొక్కల ఆకులనుంచి నీలంరంగు సేకరిస్తారు. ఇండిగో ఆకుల్ని డ్రమ్ములో కుళ్లబెట్టి పసరు తీస్తారు. ఈ పసరును ఘనీభవింపజేసి ఇండిగో రంగు ముక్కలుగా నిల్వచేసుకుంటారు. పసుపురంగు: పసుపు కొమ్ములనుంచి తీసుకుంటారు. మైనంలోకలిపి వినియోగిస్తారు. ఆకుపచ్చరంగు: ఇండిగో ముక్కల్లో పసుపు కలపడంతో తయారవుతుంది. నలుపురంగు: పాడైపోయిన నల్లబెల్లం, ఇనుపతుప్పుని వేడినీళ్లలో కలిపి నెలరోజులపాటు కుండలో నిల్వచేస్తారు. కరక్కాయ తొక్కల్ని నీటిలో మరిగించి కషాయం తయారుచేస్తారు. నల్లబెల్లం నీటి కషాయాన్ని కలిపి మరిగిస్తే నల్లరంగు వస్తుంది. ప్రధానరంగులను తగు మోతాదులో కలపడం ద్వారా కళాకారులు తమకు అవసరమైన పలు వర్ణాలు తయారు చేసుకుంటారు. కళ నిలబడాలంటే.. - అటవీశాఖ ఆధ్వర్యంలో అంకుడు కర్ర సాగు చేపట్టాలి. కర్ర సరఫరాలో అడ్డంకులు లేకుండా చూడాలి. కర్ర సాగు, అమ్మకాన్ని చట్టబద్ధం చేయాలి. - కళాకారులకు వడ్డీలేని రుణాలు అందించాలి. సొసైటీద్వారా షెడ్లు నిర్మాణానికి స్థలాలు కేటాయించాలి. - మున్సిపాలిటీ, కార్పొరేషన్ , బస్‌కాంప్లెక్స్ పరిధిలో దుకాణాలు ఏర్పాటుచేసుకోవడానికి స్థలాలు కేటాయించాలి. - కళలో కంప్యూటర్ డిజైనింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జొప్పించాలి. - చైనా బొమ్మలను తెచ్చి ఏటికొప్పాక బొమ్మలుగా నమ్మంచి అమ్ముతున్న వర్తకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. పింఛను సౌకర్యం కల్పించాలి.. కళ నేర్చుకోవడం మానసిక స్థైర్యాన్నిస్తుంది. ఈ నమ్మకంతోనే బాలికలు ఎక్కువ మంది బొమ్మల తయారీ నేర్చుకుంటున్నారు. మా పూర్వీకుల నుంచి పారంపర్యంగా దీన్ని నేర్చుకుంటున్నాము. సీనియర్ కళాకారులకు ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పించాలి. – పి.శ్రావణి, యువకళాకారిణి -
అందాల ఏరువాక...ఏటికొప్పాక
ఎల్లలు దాటిన లక్కబొమ్మల ఖ్యాతి అంకుడు కర్రతో అద్భుతాలు సూదిమొన సైజు నుంచి కళాఖండాలు ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది... ఆ బొమ్మ ముచ్చట్లాడుతుంది... సహజసిద్ధమైన రంగులతో అపురూపమైన ఆకృతుల్లో ఇంటికి శోభను చేకూరుస్తుంది... కళాభిమానుల మనసు దోచుకుంటుంది. అంకుడు కర్రతో అద్భుతాలను ఆవిష్కరించే ఏటికొప్పాక లక్క బొమ్మలకు అందుకే ఖండాంతర ఖ్యాతి. కళాకారుల సృజనాత్మకత, వారి కళాతృష్ణ మన కళ్లను కట్టిపడేస్తుంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇక్కడి హస్త కళాకారులకు లక్కతో పెట్టిన విద్య. ఉపాధి కోసం కొందరు బొమ్మలు చేస్తుంటే, ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరికొందరు కళాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రతిభావంతులు ఇక్కడున్నారు. సూదిమొన సైజులో కళాఖండాలను సృష్టించడంలో ఏటికొప్పాక హస్తకళాకారుల నైపుణ్యత ఎంతటి వారినైనా సరే ఔరా అన్పిస్తుంది. -యలమంచిలి అంకుడు కర్ర కొరత... పెరిగిన ధర లక్కబొమ్మల తయారీకి కావాల్సిన అంకుడు కర్ర దొరకడం ఇప్పుడు గగనమైపోతోంది. మునుపటి మాదిరిగా అంకుడు కర్ర లభించడం లేదని కళాకారులు ఆవేదన వెలిబుచ్చున్నారు. అనధికారికంగా దీనిపై కొందరు ఆంక్షలు పెడుతుండటం వల్ల అంకుడు కర్రను సరఫరా చేసే వారు ఒక్కసారిగా దానిపై ధరను పెంచేశారు. ఇది కళాకారులకు మరింత భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాల్సివుంది. వేలాది ప్రజానీకానికి ఇలవేల్పుగా ఉన్న బండిమాంబ అమ్మవారి ఆలయాన్ని స్పృశిస్తూ... పరవళ్లు తొక్కుతూ ప్రవహించే వరహానది చెంతనున్న ఏటికొప్పాక గ్రామం... లక్కబొమ్మల తయారీలో మేటికొప్పాకగా ఎంతో ఖ్యాతి, గుర్తింపు పొందుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే బొమ్మల తయారీతో యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో బీజం పడింది. అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో నక్కపల్లిలో లక్కబొమ్మలు తయారు చేసే నాలుగు కుటుం బాలు ఏటికొప్పాకకు అప్పట్లోనే వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చా యి. నాడు నాలుగు కుటుంబాలుంటే ఇప్పుడవి 250కు చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుం బాలు ఇప్పుడు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రకృతి రంగుల పరవశం కర్రతో తయారు చేసిన బొమ్మలకు రసాయనాలు మిశ్రమం చేసిన రంగులను అద్దితే పిల్లల ఆరోగ్యానికి ఇబ్బందికరమవుతుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచీ సహజసిద్ధమైన రంగులనే ఇక్కడి కళాకారులు ఉపయోగిస్తున్నారు. ఔషధ మొక్కలు, వనమూలికల ద్వారా ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీలో పద్మావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు 1992 నుంచి శిక్షణ తీసుకున్నారు. ఈ రంగుల తయారీకి ప్రధాన ముడిసరుకైన లక్కను రాంచీ నుంచి కొనుగోలు చేస్తుంటారు. చాలామంది కళాకారులు వారు తయారు చేసిన కళాఖండాలను స్థానికంగా ఉన్న పద్మావతి అసోసియేట్స్‌కు విక్రయిస్తుంటారు. కళాకారుల శ్రమ, పెట్టుబడులను గుర్తించి పద్మావతి అసోసియేట్స్ ధర నిర్ణయిస్తుంది. అద్భుతమైన బొమ్మలను ఇండెంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. మరికొందరు కళాకారులు వారి ఉత్పత్తులను స్థానికంగా ఉండే అనేక దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో లక్కబొమ్మల విక్రయం ద్వారా అనేక మంది వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు. దేశ విదేశాలకు పాకిన ఖ్యాతి దేశంలో ఏమూలకెళ్లినా మార్కెట్లో ఏటికొప్పాక బొమ్మలు కచ్చితంగా కన్పిస్తుంటాయి. ఈ సామర్ధ్యం మరెవ్వరికీ సాధ్యం కాకపోవడంతో దేశ, విదేశాల్లో ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఢిల్లీ, మద్రాస్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్, భువనేశ్వర్, రాజస్థాన్, హైదరాబాద్, పాట్నా, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాలతోపాటు స్విట్జర్లాండ్, హాలెండ్, అమెరికా, నేపాల్, లండన్, బ్రిటన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడి బొమ్మలు ఎగుమతి అవుతుంటాయి. చూసిన కళ్లు ధన్యం... పిల్లల నుంచి పెద్దల వరకు, కూలివారి నుంచి కోటీశ్వరుల వరకు ఎవరైనా ఏటికొప్పాక హస్తకళాకారులు తయారు చేసిన లక్కబొమ్మలను చూసి ముగ్ధులు కావాల్సిందే. వీటిని ఎలా చేశారంటూ కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే వీరి నైపుణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది తమ ఇళ్ల షో కేసుల్లో ఏటికొప్పాక బొమ్మలను అలంకరించుకోవాలనుకుంటారు. మరికొంద రు అధికారులు, అతిథు లు, బంధువులకు, శుభకార్యాల సమయంలో ఈ బొమ్మలను కానుకగా ఇవ్వడానికి అమితాసక్తి కనబరుస్తుంటారు. అవార్డులెన్నో... గతంలో నిరక్షరాస్యులైన కార్మికులే లక్కబొమ్మలను తయారు చేసేవారు. రానురాను చదువుకున్నవారు, మంచి అభిరుచి ఉన్నవారు కళాకారులుగా ఎదిగారు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్న కవి వాక్కును నిజం చేస్తూ అక్షరాస్యులైన ఎంతో మంది లక్కబొమ్మల తయారీలో ప్రత్యేక తర్ఫీదు పొందారు. దీనికి వారి సృజనాత్మకత తోడవ్వటంతో అపురూపమైన కళాఖండాలెన్నింటినో వీరు సృజిస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచే ఇదే వృత్తిపై ఆధారపడిన శ్రీశైలపు చిన్నయాచారికి పదేళ్ల కిందట తొలిసారిగా జాతీయ అవార్డు లభించింది. హస్తకళా నైపుణ్యంలో రాటుతేలిన చిన్నయాచారి చేతిలో ఆవిస్కృతమైన ఒక బొమ్మకు అప్పటి రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది. సాధారణ కోడిగుడ్డు సైజులో, ఒక కోడిగుడ్డులో 32 గుడ్లు ఇమిడి ఉండేలా చిన్నయాచారి తయారు చేసిన బొమ్మలకు తొలిసారిగా జాతీయ గుర్తింపు లభించింది. ఆయన తరువాత పెదపాటి శరత్ కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్‌లలో కూడా ఏటికొప్పాక హస్తకళాకారులు చోటు సంపాదించుకున్నారు.