అందాల ఏరువాక...ఏటికొప్పాక | Beauty eruvaka ... etikoppaka | Sakshi
Sakshi News home page

అందాల ఏరువాక...ఏటికొప్పాక

Published Tue, Oct 28 2014 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

అందాల ఏరువాక...ఏటికొప్పాక - Sakshi

అందాల ఏరువాక...ఏటికొప్పాక

  • ఎల్లలు దాటిన లక్కబొమ్మల ఖ్యాతి
  •  అంకుడు కర్రతో అద్భుతాలు
  •  సూదిమొన సైజు నుంచి కళాఖండాలు
  • ఆ బొమ్మ ముచ్చట గొలుపుతుంది... ఆ బొమ్మ ముచ్చట్లాడుతుంది... సహజసిద్ధమైన రంగులతో అపురూపమైన ఆకృతుల్లో ఇంటికి శోభను చేకూరుస్తుంది... కళాభిమానుల మనసు దోచుకుంటుంది. అంకుడు కర్రతో అద్భుతాలను ఆవిష్కరించే ఏటికొప్పాక లక్క బొమ్మలకు అందుకే ఖండాంతర ఖ్యాతి. కళాకారుల సృజనాత్మకత, వారి కళాతృష్ణ మన కళ్లను కట్టిపడేస్తుంటాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఇక్కడి హస్త కళాకారులకు లక్కతో పెట్టిన విద్య. ఉపాధి కోసం కొందరు బొమ్మలు చేస్తుంటే, ప్రతిభకు సానపెట్టి తమకు, తమ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మరికొందరు కళాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. జాతీయ అవార్డులు సాధించిన ప్రతిభావంతులు ఇక్కడున్నారు. సూదిమొన సైజులో కళాఖండాలను సృష్టించడంలో ఏటికొప్పాక హస్తకళాకారుల నైపుణ్యత ఎంతటి వారినైనా సరే ఔరా అన్పిస్తుంది.        
     -యలమంచిలి

     
    అంకుడు కర్ర కొరత... పెరిగిన ధర

    లక్కబొమ్మల తయారీకి కావాల్సిన అంకుడు కర్ర దొరకడం ఇప్పుడు గగనమైపోతోంది. మునుపటి మాదిరిగా అంకుడు కర్ర లభించడం లేదని కళాకారులు ఆవేదన వెలిబుచ్చున్నారు. అనధికారికంగా దీనిపై కొందరు ఆంక్షలు పెడుతుండటం వల్ల అంకుడు కర్రను సరఫరా చేసే వారు ఒక్కసారిగా దానిపై ధరను పెంచేశారు. ఇది కళాకారులకు మరింత భారంగా మారింది. పరిస్థితిని చక్కదిద్దడానికి జిల్లా యంత్రాంగం మరింత కృషి చేయాల్సివుంది.
     
    వేలాది ప్రజానీకానికి ఇలవేల్పుగా ఉన్న బండిమాంబ అమ్మవారి ఆలయాన్ని స్పృశిస్తూ... పరవళ్లు తొక్కుతూ ప్రవహించే వరహానది చెంతనున్న ఏటికొప్పాక గ్రామం... లక్కబొమ్మల తయారీలో మేటికొప్పాకగా ఎంతో ఖ్యాతి, గుర్తింపు పొందుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే బొమ్మల తయారీతో యలమంచిలి మండలం ఏటికొప్పాక హస్తకళాకారులు కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకు 150 ఏళ్ల కిందట నక్కపల్లిలో బీజం పడింది. అంకుడు కర్ర దొరకకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండటంతో నక్కపల్లిలో లక్కబొమ్మలు తయారు చేసే నాలుగు కుటుం బాలు ఏటికొప్పాకకు అప్పట్లోనే వలస వెళ్లాయి. క్రమేపీ హస్తకళాకారులు, వారి కుటుంబాలు పెరుగుతూ వచ్చా యి. నాడు నాలుగు కుటుంబాలుంటే ఇప్పుడవి 250కు చేరుకున్నాయి. లక్కబొమ్మల తయారీ, అమ్మకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుం బాలు ఇప్పుడు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
     
    ప్రకృతి రంగుల పరవశం

    కర్రతో తయారు చేసిన బొమ్మలకు రసాయనాలు మిశ్రమం చేసిన రంగులను అద్దితే పిల్లల ఆరోగ్యానికి ఇబ్బందికరమవుతుందన్న ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచీ సహజసిద్ధమైన రంగులనే ఇక్కడి కళాకారులు ఉపయోగిస్తున్నారు. ఔషధ మొక్కలు, వనమూలికల ద్వారా ప్రకృతి సిద్ధమైన రంగుల తయారీలో పద్మావతి అసోసియేట్స్ ఆధ్వర్యంలో ఇక్కడి కళాకారులు 1992 నుంచి శిక్షణ తీసుకున్నారు. ఈ రంగుల తయారీకి ప్రధాన ముడిసరుకైన లక్కను రాంచీ నుంచి కొనుగోలు చేస్తుంటారు.

    చాలామంది కళాకారులు వారు తయారు చేసిన కళాఖండాలను స్థానికంగా ఉన్న పద్మావతి అసోసియేట్స్‌కు విక్రయిస్తుంటారు. కళాకారుల శ్రమ, పెట్టుబడులను గుర్తించి పద్మావతి అసోసియేట్స్ ధర నిర్ణయిస్తుంది. అద్భుతమైన బొమ్మలను ఇండెంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. మరికొందరు కళాకారులు వారి ఉత్పత్తులను స్థానికంగా ఉండే అనేక దుకాణాలకు వెళ్లి విక్రయిస్తుంటారు. దీంతో లక్కబొమ్మల విక్రయం ద్వారా అనేక మంది వ్యాపారాలు సాగిస్తూ జీవనం పొందుతున్నారు.
     
    దేశ విదేశాలకు పాకిన ఖ్యాతి

    దేశంలో ఏమూలకెళ్లినా మార్కెట్‌లో ఏటికొప్పాక బొమ్మలు కచ్చితంగా కన్పిస్తుంటాయి. ఈ సామర్ధ్యం మరెవ్వరికీ సాధ్యం కాకపోవడంతో దేశ, విదేశాల్లో ఈ లక్క బొమ్మలకు ప్రాచుర్యం ఏర్పడింది. ఢిల్లీ, మద్రాస్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్, భువనేశ్వర్, రాజస్థాన్, హైదరాబాద్, పాట్నా, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పట్టణాలతోపాటు స్విట్జర్లాండ్, హాలెండ్, అమెరికా, నేపాల్, లండన్, బ్రిటన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఇక్కడి బొమ్మలు ఎగుమతి అవుతుంటాయి.
     
    చూసిన కళ్లు ధన్యం...


    పిల్లల నుంచి పెద్దల వరకు, కూలివారి నుంచి కోటీశ్వరుల వరకు ఎవరైనా ఏటికొప్పాక హస్తకళాకారులు తయారు చేసిన లక్కబొమ్మలను చూసి ముగ్ధులు కావాల్సిందే. వీటిని ఎలా చేశారంటూ కళాభిమానులు ఆశ్చర్యపోతున్నారంటే వీరి నైపుణ్యత ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలామంది తమ ఇళ్ల షో కేసుల్లో ఏటికొప్పాక బొమ్మలను అలంకరించుకోవాలనుకుంటారు. మరికొంద రు అధికారులు, అతిథు లు, బంధువులకు, శుభకార్యాల సమయంలో ఈ బొమ్మలను కానుకగా ఇవ్వడానికి అమితాసక్తి కనబరుస్తుంటారు.
     
    అవార్డులెన్నో...
     
    గతంలో నిరక్షరాస్యులైన కార్మికులే లక్కబొమ్మలను తయారు చేసేవారు. రానురాను చదువుకున్నవారు, మంచి అభిరుచి ఉన్నవారు కళాకారులుగా ఎదిగారు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్న కవి వాక్కును నిజం చేస్తూ అక్షరాస్యులైన ఎంతో మంది లక్కబొమ్మల తయారీలో ప్రత్యేక తర్ఫీదు పొందారు. దీనికి వారి సృజనాత్మకత తోడవ్వటంతో అపురూపమైన కళాఖండాలెన్నింటినో వీరు సృజిస్తున్నారు. ఇలా చిన్నప్పటి నుంచే ఇదే వృత్తిపై ఆధారపడిన శ్రీశైలపు చిన్నయాచారికి పదేళ్ల కిందట తొలిసారిగా జాతీయ అవార్డు లభించింది. హస్తకళా నైపుణ్యంలో రాటుతేలిన చిన్నయాచారి చేతిలో ఆవిస్కృతమైన ఒక బొమ్మకు అప్పటి రాష్ట్రపతి కలాం చేతుల మీదుగా అవార్డు లభించింది. సాధారణ కోడిగుడ్డు సైజులో, ఒక కోడిగుడ్డులో 32 గుడ్లు ఇమిడి ఉండేలా చిన్నయాచారి తయారు చేసిన బొమ్మలకు తొలిసారిగా జాతీయ గుర్తింపు లభించింది. ఆయన తరువాత పెదపాటి శరత్ కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్, లిమ్కా బుక్‌లలో కూడా ఏటికొప్పాక హస్తకళాకారులు చోటు సంపాదించుకున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement