నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్‌లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే.
జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్‌తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది.
ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment