International Rice Research Institute
-
స్వాతి నాయక్‌కు నార్మన్ బోర్లాగ్ అవార్డు
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక నార్మన్ బోర్లాగ్– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది. ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ పేరిట రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్ గ్రహీత నార్మన్ బోర్లాగ్. కాగా, డాక్టర్ స్వాతి నాయక్ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదివారు. -
క్లైమేట్ స్మార్ట్ రైస్ : ఆరోగ్యంగా జీవించొచ్చు
లాస్ బనోస్, మనీలా(ఫిలిప్పీన్స్) : ఏడు రకాల అటవీ వరి వంగడాల జన్యువుల ద్వారా కొత్త రకపు వరి విత్తనాల అభివృద్ధి పూర్తయినట్లు అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ(ఐఆర్ఆర్ఐ) ప్రకటించింది. ఈ విత్తునాల ద్వారా ఉత్పత్తి చేసిన పంటను ఆహారంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని సాగించొచ్చని పేర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వంగడాలను ‘క్లైమేట్ స్మార్ట్ రైస్’ గా పేర్కొనచ్చని తెలిపింది. భూ మండలంపై సంభవించే వాతావరణ మార్పులను తట్టుకుని అధిక ఉత్పత్తిని ఈ వంగడాలు అందజేస్తాయని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తాయని వెల్లడించింది. చాలా రకాల జీవ, నిర్జీవ సంబంధిత వ్యాధులను ఈ వంగడాలు నిరోధిస్తాయని వెల్లడించింది. ’నేచుర్ జెనెటిక్స్’ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రచురితమయ్యాయని తెలిపింది. -
కరువులోనూ అధిక దిగుబడినిచ్చే వరి!
ఫలించిన జపాన్ శాస్త్రవేత్తల కృషి డీఆర్ఓ1 జన్యువుతో కూడిన సరికొత్త వంగడానికి రూపకల్పన తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సాధారణ వరి కన్నా మూడున్నర రెట్ల దిగుబడి.. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ ధాన్యం దిగుబడి దారుణంగా తగ్గిపోతుందన్న భయం ఇక అక్కర్లేదు. కరువు పరిస్థితులతో నీటి కొరత నెలకొన్న సందర్భాల్లోనూ మూడున్నర రెట్ల వరకు దిగుబడిని అందించే అత్యాధునిక వరి వంగడం అందుబాటులోకి రానుంది. జపాన్ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. జన్యుమార్పిడి సాంకేతికత జోలికి పోకుండానే వీరు ఈ ఘనతను సాధించడం విశేషం. సాధారణంగా వరి మొక్కల వేళ్లు భూమిలోకి మరీ ఎక్కువ లోతుకు వెళ్లవు. తక్కువ లోతులోనే పక్కలకు పాకుతాయి. అందువల్లే ఏమాత్రం పూర్తిస్థాయిలో నీటి తడులు అందకపోయినా తట్టుకోలేవు. ఫలితంగా ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడంపై జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రోబయోలాజికల్ సెన్సైస్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేశారు. డీపర్ రూటింగ్ 1(డీఆర్ఓ1) అనే జన్యువును గుర్తించి ఈ సమస్యను అధిగమించారు. మామూలు వరి వంగడం వేళ్ల కన్నా.. ఈ జన్యువు కలిగి ఉన్న వరి వంగడాల వేళ్లు భూమిలోకి రెట్టింపు లోతు వరకూ చొచ్చుకెళతాయని ముఖ్య పరిశోధకుడు యుసకు యుగ తెలిపారు. లోతుకు వెళ్లిన ఈ వేళ్లు భూమి లోపలి పొరల్లో నుంచి నీటిని, పోషకాలను మొక్కకు అందిస్తాయని వివరించారు. ఒక మోస్తరు నీటికొరత ఉన్న పరిస్థితుల్లో సాధారణ వరితో పోల్చితే ఈ వరి వంగడం రెట్టింపు దిగుబడి ఇస్తోందని తెలిపారు. అదే తీవ్రమైన కరువు పరిస్థితుల్లో సాధారణ వరి దిగుబడి బాగా తగ్గిపోగా.. ఈ వంగడం దిగుబడి మాత్రం దానికంటే 3.6 రెట్లు ఎక్కువగా వచ్చిందని వెల్లడించారు. ‘‘డీఆర్ఓ1 జన్యువు 60కిపైగా వరి వంగడాల్లో ఉంది. అయితే ఇవన్నీ వేళ్లను లోతుగా చొప్పించగలిగే వంగడాలు కాదు. వేళ్లను లోతుగా చొప్పించలేని మేలు రకం వరితో డీఆర్ఓ1 జన్యువు ఉన్న వరి వంగడాన్ని సంకరం చేసి సరికొత్త వంగడాన్ని రూపొందించాం’’ అని ఆయన వివరించారు. భారత్‌కు ఉపయోగకరం.. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) అంచనాల ప్రకారం విశ్వవిపణిలో బియ్యం ధరలను అదుపులో ఉంచాలంటే ఏటా 80 లక్షల నుంచి కోటి టన్నులను అదనంగా పండించాల్సి ఉంటుంది. దీనిని బట్టి.. కరువును సమర్థంగా ఎదుర్కొనేలా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఆవశ్యకత ఎంత ఉందనేది వేరే చెప్పనక్కర్లేదు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరువువస్తే వరి దిగుబడి 40 శాతం వరకు పడిపోతూ ఉంటుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పలేని స్థితి నెలకొంది. అందువల్ల భారత్‌కు ఇటువంటి వంగడాలు ఎంతో ఉపయోగకరమని ‘ఇరి’ ప్రతినిధి సోఫీ క్లేటన్ పేర్కొన్నారు. -సాక్షి స్పెషల్ డెస్క్