కరువులోనూ అధిక దిగుబడినిచ్చే వరి!
ఫలించిన జపాన్ శాస్త్రవేత్తల కృషి
డీఆర్‌ఓ1 జన్యువుతో కూడిన సరికొత్త వంగడానికి రూపకల్పన
తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సాధారణ వరి కన్నా మూడున్నర రెట్ల దిగుబడి..
తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ ధాన్యం దిగుబడి దారుణంగా తగ్గిపోతుందన్న భయం ఇక అక్కర్లేదు. కరువు పరిస్థితులతో నీటి కొరత నెలకొన్న సందర్భాల్లోనూ మూడున్నర రెట్ల వరకు దిగుబడిని అందించే అత్యాధునిక వరి వంగడం అందుబాటులోకి రానుంది. జపాన్ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. జన్యుమార్పిడి సాంకేతికత జోలికి పోకుండానే వీరు ఈ ఘనతను సాధించడం విశేషం. సాధారణంగా వరి మొక్కల వేళ్లు భూమిలోకి మరీ ఎక్కువ లోతుకు వెళ్లవు. తక్కువ లోతులోనే పక్కలకు పాకుతాయి. అందువల్లే ఏమాత్రం పూర్తిస్థాయిలో నీటి తడులు అందకపోయినా తట్టుకోలేవు. ఫలితంగా ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
ఈ సమస్యను అధిగమించడంపై జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రోబయోలాజికల్ సెన్సైస్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేశారు. డీపర్ రూటింగ్ 1(డీఆర్‌ఓ1) అనే జన్యువును గుర్తించి ఈ సమస్యను అధిగమించారు. మామూలు వరి వంగడం వేళ్ల కన్నా.. ఈ జన్యువు కలిగి ఉన్న వరి వంగడాల వేళ్లు భూమిలోకి రెట్టింపు లోతు వరకూ చొచ్చుకెళతాయని ముఖ్య పరిశోధకుడు యుసకు యుగ తెలిపారు. లోతుకు వెళ్లిన ఈ వేళ్లు భూమి లోపలి పొరల్లో నుంచి నీటిని, పోషకాలను మొక్కకు అందిస్తాయని వివరించారు. ఒక మోస్తరు నీటికొరత ఉన్న పరిస్థితుల్లో సాధారణ వరితో పోల్చితే ఈ వరి వంగడం రెట్టింపు దిగుబడి ఇస్తోందని తెలిపారు. అదే తీవ్రమైన కరువు పరిస్థితుల్లో సాధారణ వరి దిగుబడి బాగా తగ్గిపోగా.. ఈ వంగడం దిగుబడి మాత్రం దానికంటే 3.6 రెట్లు ఎక్కువగా వచ్చిందని వెల్లడించారు. ‘‘డీఆర్‌ఓ1 జన్యువు 60కిపైగా వరి వంగడాల్లో ఉంది. అయితే ఇవన్నీ వేళ్లను లోతుగా చొప్పించగలిగే వంగడాలు కాదు. వేళ్లను లోతుగా చొప్పించలేని మేలు రకం వరితో డీఆర్‌ఓ1 జన్యువు ఉన్న వరి వంగడాన్ని సంకరం చేసి సరికొత్త వంగడాన్ని రూపొందించాం’’ అని ఆయన వివరించారు.
భారత్‌కు ఉపయోగకరం..
అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) అంచనాల ప్రకారం విశ్వవిపణిలో బియ్యం ధరలను అదుపులో ఉంచాలంటే ఏటా 80 లక్షల నుంచి కోటి టన్నులను అదనంగా పండించాల్సి ఉంటుంది. దీనిని బట్టి.. కరువును సమర్థంగా ఎదుర్కొనేలా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఆవశ్యకత ఎంత ఉందనేది వేరే చెప్పనక్కర్లేదు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరువువస్తే వరి దిగుబడి 40 శాతం వరకు పడిపోతూ ఉంటుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పలేని స్థితి నెలకొంది. అందువల్ల భారత్‌కు ఇటువంటి వంగడాలు ఎంతో ఉపయోగకరమని ‘ఇరి’ ప్రతినిధి సోఫీ క్లేటన్ పేర్కొన్నారు.
-సాక్షి స్పెషల్ డెస్క్