International Shooting Federation
-
Shooting World Cup: 15 పతకాలతో ‘టాప్’
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజు కూడా హవా కొనసాగిస్తూ మరో రజతం సాధించిన భారత్ మొత్తం 15 పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య కొరియా ఖాతాలో 12 పతకాలే ఉన్నాయి. బుధవారం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో అనిశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, సమీర్లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో భారత జట్టు 15–17తో మార్టిన్, థామస్, మతేజ్లతో కూడిన చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. మొదట్లో మన షూటర్ల గురి కుదరడంతో ఒక దశలో 10–2తో పసిడి వేటలో పడినట్లు కనిపించింది. కానీ తదనంతరం లక్ష్యాలపై కచ్చితమైన షాట్లు పడకపోవడంతో 2 పాయింట్ల తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. -
భారత్ గురి కుదిరింది.. ప్రపంచకప్ షూటింగ్లో రెండో పతకం ఖాయం
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్‌లో భారత్ గురి కుదిరింది. మరో పతకం ఖాయమైంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ మెహులి ఘోష్– షాహు తుషార్ మనే జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఫైనల్లో ఓడినా... కనీసం రజతమైనా దక్కుతుంది. 60 షాట్ల క్వాలిఫయర్స్‌లో భారత జోడీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 30 జంటలు ఇందులో గురిపెట్టగా... మెహులి–తుషార్ ద్వయం 634.4 స్కోరుతో టాప్‌లేపింది. బుధవారం జరిగే ఫైనల్లో భారత్, హంగేరి జోడీలు పసిడి పతకం కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో శివ నర్వాల్–పాలక్ ద్వయం కాంస్య పతక పోరుకు అర్హత పొందింది. -
టీమ్ ఈవెంట్లో ఇషాకు స్వర్ణం
కైరో: అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రెండో పతకంతో మెరిసింది. మంగళవారం వ్యక్తిగత విభాగంలో రజతం సాధించిన ఇషా... గురువారం టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో జర్మనీ షూటర్లతో తలపడిన భారత బృందం 16 పాయింట్లు సాధిస్తే... సాండ్రా, అండ్రియా, కెరీనాలున్న జర్మనీ జట్టు కేవలం 6 పాయింట్లే స్కోరు చేసి రజతంతో సరిపెట్టుకుంది. అంతకుముందు తొలి క్వాలిఫయింగ్‌లో భారత జట్టు 856 పాయింట్లు, రెండో క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు స్కోరు చేసింది. జర్మనీ ఈ రెండు అర్హత పోటీల్లోనూ 851, 571 స్కోర్లతో వెనుకంజలోనే ఉంది. 16–8తో సింగపూర్‌పై నెగ్గిన చైనీస్ తైపీ జట్టుకు కాంస్యం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరీ, గౌరవ్ రాణా, బాలకృష్ణలతో కూడిన భారత జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. -
రష్యా షూటర్స్‌కు క్లియరెన్స్
లాసానే: వచ్చే నెలలో రియోలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రష్యన్ షూటర్స్‌కు క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు మంగళవారం అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్(ఐఎస్ఎస్ఎఫ్) .. రియోలో పాల్గొనే 18 మంది రష్యన్ షూటింగ్ బృందానికి ఆమోదం తెలిపింది. రియోలో పాల్గొనే రష్యా షూటర్ల వివరాలతో సంతృప్తి చెందినట్లు ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. 'మెక్ లారెన్ నివేదిక ప్రకారం వీరిలో ఎవరికీ డోపింగ్ కు పాల్పడిన రికార్డు లేదు. అందుచేత టెస్టుల్లో పాజిటివ్ వచ్చే సందర్భం కూడా ఉండదు. ఈ రష్యన్ అథ్లెట్లను క్షుణ్ణంగా పరీక్షించాం. వీరికి మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది' అని ఐఎస్ఎస్ఎఫ్ పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తాజా నిబంధనల ప్రకారం రియోలో పాల్గొనే రష్యా అథ్లెట్లు ముందుగా ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగా ఇప్పుడు రష్యా ఆటగాళ్లపై డోపింగ్ రికార్డును ఆయా ఒలింపిక్ సమాఖ్యలు పరీక్షించే పనిలో పడ్డాయి. ప్రస్తుతం రష్యాకు షూటింగ్ లో క్లియరెన్స్ లభించడంతో వారికి మోస్తరు ఉపశమనం లభించింది.