
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌ను భారత్ అగ్రస్థానంతో ముగించింది. టోర్నీ ఆఖరి రోజు కూడా హవా కొనసాగిస్తూ మరో రజతం సాధించిన భారత్ మొత్తం 15 పతకాలతో నంబర్‌వన్‌గా నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య కొరియా ఖాతాలో 12 పతకాలే ఉన్నాయి.
బుధవారం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో అనిశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, సమీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో భారత జట్టు 15–17తో మార్టిన్, థామస్, మతేజ్‌లతో కూడిన చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది. మొదట్లో మన షూటర్ల గురి కుదరడంతో ఒక దశలో 10–2తో పసిడి వేటలో పడినట్లు కనిపించింది. కానీ తదనంతరం లక్ష్యాలపై కచ్చితమైన షాట్లు పడకపోవడంతో 2 పాయింట్ల తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.