International Test Cricket
-
‘టాప్’ నిలబెట్టుకునేనా..?
నేటి నుంచి విండీస్‌తో దక్షిణాఫ్రికా మూడో టెస్టు * డ్రా చేసుకున్నా చాలు * ప్రస్తుతం 1-0 ఆధిక్యం కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు నేటి (శుక్రవారం) నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగబోతోంది. టాప్ ర్యాంకు దక్కించుకునేందుకు ఈ మ్యాచ్‌లో సఫారీలు నెగ్గకున్నా కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రకటించినప్పుడు డిసెంబర్లోనే రెండు టెస్టులను నెగ్గి సఫారీలు సిరీస్ గెలుచుకుంటారని అంతా భావించారు. అయితే రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో పాటు విండీస్ ఆటగాళ్లు కూడా అనూహ్యంగా పుంజుకోవడం వీరిని కలవరపరుస్తోంది. ఎందుకంటే ‘టెస్టు చాంపియన్’ గదను దక్కించుకోవాలంటే హషీమ్ ఆమ్లా సేన ఈ మ్యాచ్ కోల్పోకూడదు. అప్పుడే వారు 122 పాయింట్ల తో టాప్‌గా నిలుస్తారు. ఒకవేళ విండీస్ అద్భుతంగా రాణించి సిరీస్‌ను సమం చేస్తే ఆతిథ్య జట్టుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే వీరికి ఆస్ట్రేలియాతో ముప్పు పొంచి ఉంది. ఆ జట్టు ప్రస్తుతం భారత్‌పై 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టును గెలిస్తే 0.2 దశాంశమానం తేడాతో స్టీవ్ స్మిత్ సేనకు టాప్ ర్యాంకు దక్కుతుంది. ప్రొటీస్ రెండో ర్యాంకుకు చేరుకుంటుంది. ఆత్మవిశ్వాసంతో ప్రొటీస్ ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉండడంతో సఫారీ పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగబోతోంది. అన్నిరంగాల్లో పటిష్టంగానే కనిపిస్తున్నా కెప్టెన్ ఆమ్లా మరోసారి కీలకం కానున్నాడు. ఎల్గర్, అల్విరో పీటర్సన్, డు ప్లెసిస్, డివిలియర్స్ ఆకట్టుకుంటున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ కోలుకోలేదు. ఇక రెండో టెస్టులో ఇమ్రాన్ తాహిర్ పెద్దగా రాణించకపోవడంతో తన స్థానంలో సైమన్ హార్మర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేసర్లు స్టెయిన్, మోర్కెల్ దుమ్మురేపుతున్నారు. కసితో ఉన్న విండీస్ తొలి టెస్టులో దారుణ పరాజయం అనంతరం పోర్ట్ ఎలిజబెత్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బాగానే పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే లోయర్ మిడిలార్డర్ మాత్రం వారందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మోర్కెల్ ధాటికి కుప్పకూలింది. సీనియర్ బ్యాట్స్‌మన్ చందర్‌పాల్ సిరీస్‌లో ఇప్పటిదాకా రాణించకపోవడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళనపరుస్తోంది. ఇక బౌలర్లు రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు మాత్రమే పడగొట్టారు. టేలర్, హోల్డర్, గాబ్రియల్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే రీతిన రాణిస్తే సిరీస్ కోల్పోవాల్సిందే. -
తొందరపాటు నిర్ణయం కాదు
* ధోని రిటైర్మెంట్పై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ * కెప్టెన్ నిర్ణయంపై మాజీల ఆశ్చర్యం న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని హఠాత్ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఆశ్యర్యపోతున్నా... బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం ఇది అతడు చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. ఏదైనా రెండు ఫార్మాట్లపైనే దృష్టి పెట్టేందుకు ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ధోని ఉన్నట్టు తెలిపారు. ‘అతడు చాలా ప్రాక్టికల్ వ్యక్తి. మెల్బోర్న్లో మ్యాచ్ ముగియగానే నాకు ఫోన్ చేసి టెస్టుల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. నేను వెంటనే ఏం జరిగింది? గాయపడ్డావా? అని అడిగాను. అతడు చాలా ప్రశాంతంగా... లేదు. అంతా మంచి కోసమే టెస్టులకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇదే చివరి నిర్ణయమా..? అని అడిగాను. ‘దానికి కొద్దిసేపు ఆగండి, జట్టు సభ్యులతో నా నిర్ణయం చెబుతాను. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించండి’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేశాడు. నేను కూడా ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, బోర్డు అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌లకు చెప్పాను. వాస్తవానికి అతడి నిర్ణయంపై నేను కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ ఈ టెస్టుకు ముందు కూడా మేమీ విషయం గురించి మాట్లాడాం. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఆటగాళ్లతో రిటైర్మెంట్ గురించి చెప్పినప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడని ఓ క్రికెటర్ నాతో చెప్పాడు. ఇక మిగతా రెండు ఫార్మాట్లకు తనే కెప్టెన్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని పటేల్ వివరించాడు. కెప్టెన్‌గా వైదొలుగుతాడని తెలిసినా మరో రెండేళ్లయినా ఆటగాడిగా కొనసాగుతాడనుకున్నాను. తన సారథ్యంలో జట్టు ఎదిగిన తీరు అమోఘం. అతడు నిర్వర్తించిన పాత్రను వర్ణించేందుకు మాటలు చాలవు. -సునీల్ గవాస్కర్ ధోని నిర్ణయం ఆశ్చర్యకరమే. ఎందుకంటే మరో రెండు, మూడేళ్లు తను టెస్టులు ఆడతాడనుకున్నాను. -వెంగ్‌సర్కార్ ధోని నిర్ణయం అనూహ్యమైంది. సిరీస్ ముగిసేదాకా అతడు వేచి ఉండాల్సింది. -వాడేకర్ ధోని వీడ్కోలు గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆ విషయంపై నేనేమీ వ్యాఖ్యానించను. నో కామెంట్. - హర్భజన్ టెస్టుల్లో అద్భుత కెరీర్‌కు నా అభినందనలు. తర్వాతి లక్ష్యం ప్రపంచ కప్ విజయం కావాలి. -సచిన్ ఎంత పరాక్రమంగా జట్టును నడిపావో, అదే తరహాలో నిష్ర్కమించావు. -రైనా సిరీస్ మధ్యలో ఇలా ప్రకటించి ధోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అది అతని ఇష్టం. హ్యాపీ రిటైర్మెంట్. -బేడి చేతలతోనే నిరూపించిన స్ఫూర్తిదాయక కెప్టెన్ ధోని. - ద్రవిడ్ భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి ధోని ఎంతో చేశాడు. -బ్రాడ్ ‘పూర్తి ఆధిపత్యంతో జట్టును నడిపించిన నాయకుడిగా ధోనిని గుర్తుంచుకుంటారు. అతడో మ్యాచ్ విన్నర్. కీపింగ్‌లో అద్భుతమైన సాంకేతికత చూపేవాడు. డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచేలా చూసేవాడు. భారత క్రికెట్ సంధికాలాన్ని విజయవంతంగా అధిగమించాడు.’ - ‘సాక్షి’తో వీవీఎస్ లక్ష్మణ్