‘టాప్’ నిలబెట్టుకునేనా..?
నేటి నుంచి విండీస్‌తో దక్షిణాఫ్రికా మూడో టెస్టు
* డ్రా చేసుకున్నా చాలు
* ప్రస్తుతం 1-0 ఆధిక్యం
కేప్‌టౌన్: అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకునేందుకు నేటి (శుక్రవారం) నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు బరిలోకి దిగబోతోంది. టాప్ ర్యాంకు దక్కించుకునేందుకు ఈ మ్యాచ్‌లో సఫారీలు నెగ్గకున్నా కనీసం డ్రా అయినా చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ మూడు టెస్టుల సిరీస్ ప్రకటించినప్పుడు డిసెంబర్‌లోనే రెండు టెస్టులను నెగ్గి సఫారీలు సిరీస్ గెలుచుకుంటారని అంతా భావించారు. అయితే రెండో టెస్టుకు వర్షం అడ్డంకిగా మారడంతో పాటు విండీస్ ఆటగాళ్లు కూడా అనూహ్యంగా పుంజుకోవడం వీరిని కలవరపరుస్తోంది.
ఎందుకంటే ‘టెస్టు చాంపియన్’ గదను దక్కించుకోవాలంటే హషీమ్ ఆమ్లా సేన ఈ మ్యాచ్ కోల్పోకూడదు. అప్పుడే వారు 122 పాయింట్ల తో టాప్‌గా నిలుస్తారు. ఒకవేళ విండీస్ అద్భుతంగా రాణించి సిరీస్‌ను సమం చేస్తే ఆతిథ్య జట్టుకు చిక్కులు తప్పవు. ఎందుకంటే వీరికి ఆస్ట్రేలియాతో ముప్పు పొంచి ఉంది. ఆ జట్టు ప్రస్తుతం భారత్‌పై 2-0తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన సిడ్నీ టెస్టును గెలిస్తే 0.2 దశాంశమానం తేడాతో స్టీవ్ స్మిత్ సేనకు టాప్ ర్యాంకు దక్కుతుంది. ప్రొటీస్ రెండో ర్యాంకుకు చేరుకుంటుంది.
ఆత్మవిశ్వాసంతో ప్రొటీస్
ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉండడంతో సఫారీ పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగబోతోంది. అన్నిరంగాల్లో పటిష్టంగానే కనిపిస్తున్నా కెప్టెన్ ఆమ్లా మరోసారి కీలకం కానున్నాడు. ఎల్గర్, అల్విరో పీటర్సన్, డు ప్లెసిస్, డివిలియర్స్ ఆకట్టుకుంటున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ కోలుకోలేదు. ఇక రెండో టెస్టులో ఇమ్రాన్ తాహిర్ పెద్దగా రాణించకపోవడంతో తన స్థానంలో సైమన్ హార్మర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేసర్లు స్టెయిన్, మోర్కెల్ దుమ్మురేపుతున్నారు.
కసితో ఉన్న విండీస్
తొలి టెస్టులో దారుణ పరాజయం అనంతరం పోర్ట్ ఎలిజబెత్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బాగానే పుంజుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్రాత్‌వైట్, శామ్యూల్స్ సెంచరీలతో అదరగొట్టారు. అయితే లోయర్ మిడిలార్డర్ మాత్రం వారందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. మోర్కెల్ ధాటికి కుప్పకూలింది.
సీనియర్ బ్యాట్స్‌మన్ చందర్‌పాల్ సిరీస్‌లో ఇప్పటిదాకా రాణించకపోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనపరుస్తోంది. ఇక బౌలర్లు రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు మాత్రమే పడగొట్టారు. టేలర్, హోల్డర్, గాబ్రియల్ పరిస్థితులను అంచనా వేయడంలో విఫలమయ్యారు. ఈ మ్యాచ్‌లోనూ ఇదే రీతిన రాణిస్తే సిరీస్ కోల్పోవాల్సిందే.