తొందరపాటు నిర్ణయం కాదు | I was a bit taken aback by the suddenness of MS Dhoni's retirement ... | Sakshi
Sakshi News home page

తొందరపాటు నిర్ణయం కాదు

Published Wed, Dec 31 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM

తొందరపాటు నిర్ణయం కాదు

తొందరపాటు నిర్ణయం కాదు

* ధోని రిటైర్మెంట్‌పై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్
* కెప్టెన్ నిర్ణయంపై మాజీల ఆశ్చర్యం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని హఠాత్ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఆశ్యర్యపోతున్నా... బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం ఇది అతడు చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. ఏదైనా రెండు ఫార్మాట్లపైనే దృష్టి పెట్టేందుకు ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ధోని ఉన్నట్టు తెలిపారు.

‘అతడు చాలా ప్రాక్టికల్ వ్యక్తి. మెల్‌బోర్న్‌లో మ్యాచ్ ముగియగానే నాకు ఫోన్ చేసి టెస్టుల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. నేను వెంటనే ఏం జరిగింది? గాయపడ్డావా? అని అడిగాను. అతడు చాలా ప్రశాంతంగా... లేదు. అంతా మంచి కోసమే టెస్టులకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇదే చివరి నిర్ణయమా..? అని అడిగాను. ‘దానికి కొద్దిసేపు ఆగండి, జట్టు సభ్యులతో నా నిర్ణయం చెబుతాను. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించండి’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేశాడు.

నేను కూడా ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, బోర్డు అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌లకు చెప్పాను. వాస్తవానికి అతడి నిర్ణయంపై నేను కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ ఈ టెస్టుకు ముందు కూడా మేమీ విషయం గురించి మాట్లాడాం. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఆటగాళ్లతో రిటైర్మెంట్ గురించి చెప్పినప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడని ఓ క్రికెటర్ నాతో చెప్పాడు. ఇక మిగతా రెండు ఫార్మాట్లకు తనే కెప్టెన్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని పటేల్ వివరించాడు.
 
కెప్టెన్‌గా వైదొలుగుతాడని తెలిసినా మరో రెండేళ్లయినా ఆటగాడిగా కొనసాగుతాడనుకున్నాను. తన సారథ్యంలో జట్టు ఎదిగిన తీరు అమోఘం. అతడు నిర్వర్తించిన పాత్రను వర్ణించేందుకు మాటలు చాలవు.            -సునీల్ గవాస్కర్
 
ధోని నిర్ణయం ఆశ్చర్యకరమే. ఎందుకంటే మరో రెండు, మూడేళ్లు తను టెస్టులు ఆడతాడనుకున్నాను.
 -వెంగ్‌సర్కార్
 
ధోని నిర్ణయం అనూహ్యమైంది. సిరీస్ ముగిసేదాకా అతడు వేచి ఉండాల్సింది.      -వాడేకర్
 
ధోని వీడ్కోలు గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆ విషయంపై నేనేమీ వ్యాఖ్యానించను. నో కామెంట్.       - హర్భజన్
 
టెస్టుల్లో అద్భుత కెరీర్‌కు నా అభినందనలు. తర్వాతి లక్ష్యం ప్రపంచ కప్ విజయం కావాలి.     -సచిన్
 
ఎంత పరాక్రమంగా జట్టును నడిపావో, అదే తరహాలో నిష్ర్కమించావు.      -రైనా
 
సిరీస్ మధ్యలో ఇలా ప్రకటించి ధోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అది అతని ఇష్టం. హ్యాపీ రిటైర్మెంట్.       -బేడి
 
చేతలతోనే నిరూపించిన స్ఫూర్తిదాయక కెప్టెన్ ధోని.    - ద్రవిడ్
 
భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి ధోని ఎంతో చేశాడు. -బ్రాడ్
 
‘పూర్తి ఆధిపత్యంతో జట్టును నడిపించిన నాయకుడిగా ధోనిని గుర్తుంచుకుంటారు. అతడో మ్యాచ్ విన్నర్. కీపింగ్‌లో అద్భుతమైన సాంకేతికత చూపేవాడు. డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచేలా చూసేవాడు. భారత క్రికెట్ సంధికాలాన్ని విజయవంతంగా అధిగమించాడు.’
- ‘సాక్షి’తో వీవీఎస్ లక్ష్మణ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement