హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్ సెంటర్
దక్షిణ కొరియా ఐవైఎఫ్తో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర యువత, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ యూత్ ఎంపవర్మెంట్ సెంటర్ (ఐవైఈసీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ మంత్రి టి.పద్మారావు వెల్లడించారు. దక్షిణ కొరియా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూత్ ఫెలోషిప్ (ఐవైఎఫ్) గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అంగీకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈసందర్భంగా మంత్రి పద్మారావు మీడియాతో మాట్లాడారు. ఐవైఎఫ్ రెండో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుందన్నారు.
హకీంపేటలోని క్రీడాప్రాధికార సంస్థకు చెందిన ఐదెకరాల స్థలంలో రూ.100 కోట్ల పెట్టుబడులతో రాబోయే మూడేళ్లలో ఐవైఎఫ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి చె ప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి, క్రీడాప్రాధికార సంస్థ ఎండీ దినకర్‌బాబు, ఐవైఎఫ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కిమ్ తదితరులు పాల్గొన్నారు.