ఎటెళ్లాలో..చెప్పేస్తుంది..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఏర్పాటవుతున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) ఉల్లంఘనుల్లో క్రమశిక్షణ పెంచడం, స్వైర‘విహారం’ చేసే నేరగాళ్లకు చెక్ చెప్పడంతో పాటు వాహనచోదకులు గమ్యం చేరుకునే సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగానే మొబైల్ వీఎంఎస్ బోర్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ట్రాఫిక్ కమిషనరేట్ ఎదురుగా ఉన్న పోలీసు కంట్రోల్ రూమ్ (పీసీఆర్) జంక్షన్లో ప్రయోగాత్మకంగా దీనిని ఏర్పాటు చేశారు. పనితీరు అధ్యయనం, మార్పు చేర్పుల తర్వాత దాదాపు 10 సమీకరించుకోవాలని భావిస్తున్నారు. ఐటీఎంఎస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ నిర్వహణ, పరిశీలన మొత్తం కమిషనరేట్ కేంద్రంగా పని చేసే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచే జరుగుతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తున్న ఐటీఎంఎస్ మరో రెండు నెలల్లో పని చేయడం ప్రారంభించనుంది. సిటీలో అనేక సందర్భాల్లో హఠాత్తుగా భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. దీనికి ప్రధాన కారణం ఓ వాహనం ప్రయాణిస్తున్న మార్గంలో ముందు ట్రాఫిక్ జామ్ లేదా అడ్డంకి ఏర్పడిందనే విషయం ముందుగా తెలియకపోవడమే.
ప్రస్తుతం నగరంలోని కొన్ని జంక్షన్లతో సహా మొత్తం 17 ప్రాంతాల్లో వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులుగా (వీఎంఎస్) పిలిచే డిజిటల్ బోర్డులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో కేవలం రహదారి భద్రత నిబంధనలు, కొన్ని స్లోగన్స్, అధికారిక సూచనలు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నాయి. ఐటీఎంఎస్ ద్వారా ప్రతి జంక్షన్‌లోనూ ఏర్పాటయ్యే వీఎంఎస్‌లు ట్రాఫిక్ స్థితిగతులపై నిరంతర సందేశాలు ఇవ్వనున్నారు. ఓ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనచోదకుడికి ముందు రానున్న చౌరస్తా, రహదారిలో ట్రాఫిక్ స్థితిగతులను ఎప్పటికప్పుడు వీఎంఎస్‌ల్లో ప్రదర్శితమవుతాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కకుండా ఉండేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలూ వీటిద్వారా ప్రదర్శితమవుతాయి. అయితే ఈ బోర్డులు 17 ప్రాంతాల్లోనూ స్థిరంగా ఉంటాయి. అయితే సిటీలో నిత్యం ఏదో ఒక భారీ ఉత్సవం, ఊరేగింపు, సభ, సమావేశం, ర్యాలీలు సర్వసాధారణం. గణేష్ ఉత్సవాలు తదితరాలు జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు అనేక చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా హఠాత్తుగా తలెత్తే ధర్నాలు, నిరసనల నేపథ్యంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.
ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ట్రాఫిక్ పోలీసులే ఆయా చౌరస్తాలో, రహదారులపైనో ఉండి వాహనాలను దారి మళ్లిస్తుంటారు. అలా కాకుండా ఆయా ప్రాంతాలకు తరలించి, సూచనలు ప్రదర్శించడానికి అనువుగా మొబైల్ వీఎంఎస్ బోర్డులు సమీకరించుకుంటున్నారు. చక్రాలతో ఉండి, బ్యాటరీ ఆధారంగా పని చేసే ఈ బోర్డులను అవసరమైన చోటికి తీసుకువెళ్లవచ్చు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తీసుకువచ్చి భద్రపరిచే ఆస్కారం ఉంది. ప్రయోగాత్మకంగా ఓ బోర్డును రెండు రోజులుగా పీసీఆర్ చౌరస్తాలో ఉంచి అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో పాటు అనేక వాహనాలు నిత్యం నగర రహదారులపై బ్రేక్‌డౌన్ అవుతుంటాయి. కీలక, ఇరుకైన ప్రాంతాల్లో జరిగే ఈ బ్రేక్‌డౌన్స్, విషయం సంబంధిత అధికారులకు చేరడంలో జాప్యం కారణంగా ఒక్కోసారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఇలా రహదారులపై సాంకేతిక లోపాలతో ఆగిపోయే వాహనాల గుర్తింపునకు ఐటీఎంఎస్‌లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఇది బ్రేక్‌డౌన్ వాహనాలను తక్షణం గుర్తించడంతో పాటు ఏ మార్గాల్లో ట్రాఫిక్ని నియంత్రించాలి, ఎక్కడ ఆపేయాలి అనేది విశ్లేషిస్తుంది. ఆ సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసు క్రేన్ సిబ్బందికీ సమాచారం ఇస్తుంది. అ లాంటి పరిస్థితుల్లో మొబైల్ వీఎంఎస్ బోర్డుల్ని ఆ ప్రాంతానికి తరలించి మళ్ళింపులు, ప్రత్యామ్నా య మార్గాలను వీటి ద్వారా వివరిస్తుంటారు.