మరుగుదొడ్లు పూర్తికాలేదని విద్యుత్ మీటర్ల తొలగింపు
దెందులూరు : మరుగుదొడ్లు పూర్తి కాని ఇళ్లకు విద్యుత్ మీటర్లు తొలగించిన వైనం దెందులూరులో చోటు చేసుకుంది. మరుగుదొడ్లు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సానిగూడెం గ్రామ కార్యదర్శి అవినాష్‌పై విరుచుకుపడ్డారు. అతనిని దుర్భాషలాడారు. మరుగుదొడ్లు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు. ఇళ్ల చుట్టూ మురుగు ఉంది. మీరు ఏం చేస్తున్నారంటూ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా బుధవారం సానిగూడెం దళితపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లకు డోర్లు పెట్టకుండా, ప్లాస్టింగ్ చేయకుండా, పైపులు కలపకుండా వివిద దశల్లో అసంపూర్తిగా ఉన్న వాటిని చూసి గ్రామ కార్యదర్శిని, లబ్ధిదారులను మందలించారు. ఇలా అయితే కుదరదంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని పిలిచి వెంటనే మరుగుదొడ్లు పూర్తి చేయని ఇళ్లకు విద్యుత్ సౌకర్యం తొలగించాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది గ్రామంలో మరుగుదొడ్లు పూర్తిస్థాయిలో నిర్మించని ఎనిమిది ఇళ్లకు విద్యుత్ మీటర్లను తొలగించారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించే కాంట్రాక్టర్‌ను వదలిపెట్టి లబ్ధిదారులు, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేయటం ఏమిటని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా చిన్నపిల్లలతో విద్యుత్ లేకుండా ఉన్నామని బాధితులు వాపోయారు.