జన్‌ధన్ 'బ్యాంకు' డిపాజిట్లపై విచారణ: జైట్లీ
న్యూఢిల్లీ: జన్‌ధన్ బ్యాంకు ఖాతాల్లో కొన్ని బ్యాంకులే స్వయంగా ఖాతాదారుల తరఫున డిపాజిట్లు చేశాయని వచ్చిన ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం స్పందించారు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్యను తగ్గించేందుకు జన్‌ధన్ ఖాతాల్లో ఒక రూపాయి చొప్పున బ్యాంకులే డిపాజిట్ చేశాయని వచ్చిన ఆరోపణలపై సంబంధిత బ్యాంకులు విచారణ జరుపుతున్నాయన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సంబంధించిన కొన్ని బ్రాంచిలపై ఆరోపణలు వచ్చాయని.. దీనిపై ఆయా బ్యాంకులు విచారణ జరిపి నివేదిక అందిస్తాయని వెల్లడించారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మొత్తం 24 కోట్ల జన్‌ధన్ అకౌంట్లు ఉన్నాయని, వీటిల్లో మొత్తం 42,000 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యాయని తెలిపారు. ఈ ఖాతాల్లో ఎక్కువ శాతం బలహీన వర్గాలకు సంబంధించినవే అని వెల్లడించారు. ఒకవేళ ఒక్కో ఖాతాలో ఒక రూపాయి చొప్పున డిపాజిట్ చేసినా ఆ మొత్తం 42,000 కోట్లకు చేరదని జైట్లీ తెలిపారు.