Investment banking
-
2008 సంక్షోభం- 2020లో పాఠాలు
పన్నెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను కుదిపేసిన ఆర్థిక సంక్షోభం నుంచి పలు పాఠాలను నేర్చుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2008-09లో సబ్‌ప్రైమ్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇటీవల ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు నెలల క్రితం ప్రపంచ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. అయితే ఫెడరల్ రిజర్వ్, ఈసీబీ, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితర కేంద్ర బ్యాంకుల బారీ సహాయక ప్యాకేజీల కారణంగా లిక్విడిటీ వెల్లువెత్తి మార్కెట్లు వేగవంతంగా బౌన్స్‌బ్యాక్‌ను సాధించాయి. దేశీయంగానూ కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు సెంటిమెంటుకు బలాన్నిస్తోంది. ఈక్విటీలలో పెట్టుబడులు అంటే అధిక రిటర్నులు, అత్యంత రిస్కుతో కూడుకున్న వ్యహహారమన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశంలో చిన్న ఇన్వెస్టర్లు గతం నుంచి పలు విషయాలను అభ్యసించి అమలు చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎడిల్వీజ్ వెల్త్‌మేనేజ్‌మెంట్ నిపుణులు రాహుల్ జైన్ తదితర విశ్లేషకులు ఇంకా ఏమంటున్నారంటే.. దీర్ఘకాలానికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలు దీర్ఘకాలిక దృష్టితో తీసుకోవలసి ఉంటుంది. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఇండెక్స్ ఆధారిత రిటర్నులను ఆశించినప్పటికీ ఆటుపోట్లను తట్టుకుని అధిక కాలం కొనసాగితే భారీ లాభాలకు అవకాశముంటుంది. నిజానికి ఏవేని కారణాలతో మార్కెట్లు పతనమయ్యే సందర్భాలలో ఇన్వెస్టర్లను నిరాశావాదం ఆవహిస్తుంది. ఇది అనాలోచిత నిర్ణయాలకు కారణమవుతుంది. 2008లో తొలుత మార్కెట్లు పతనమయ్యాయి. తదుపరి 2009లో వెనువెంటనే భారీ ర్యాలీ చేశాయి. సంక్షోభ సమయాల్లో పెట్టుబడి అవసరంలేకపోతే.. దీర్ఘకాలం కొనసాగడం మేలు. మిగులు సొమ్ముంటే.. మరిన్ని పెట్టుబడులు చేపట్డం దీర్ఘకాలంలో ప్రయోజనాన్నికలిగిస్తుంది. నాణ్యత ప్రధానం స్టాక్స్‌లో పెట్టుబడులకు ప్రధానంగా నాణ్యమైన కంపెనీలను ఎంచుకోవడం కీలకంగా నిలుస్తుంది. పటిష్ట ఫండమెంటల్స్, బలమైన యాజమాన్యం, బిజినెస్‌లకున్న అవకాశాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. బ్యాలన్స్‌షీట్, క్యాష్‌ఫ్లో వంటి అంశాలు కంపెనీ ఫండమెంటల్స్‌ను వెల్లడిస్తాయి. సంక్షోభ సమయాల్లోనూ నిలదొక్కుకోగల వ్యూహాలు, ప్రోడక్టులకున్న డిమాండ్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి. డైవర్సిఫికేషన్ నిజానికి 2008 జూన్‌లో ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పటికీ సెప్టెంబర్‌కల్లా ప్రభావం మరింత కనిపించడం ప్రారంభమైంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమన్ బ్రదర్స్ దివాళా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ మార్కెట్లకు షాకిచ్చింది. అప్పట్లో ఫైనాన్షియల్ రంగ కౌంటర్లకే అధిక శాతం కేటాయింపులు చేపట్టిన ఇన్వెస్టర్లకు షాక్ తగిలింది. సాధారణంగా భవిష్యత్‌లో అవకాశాలను అందిపుచ్చుకోగల, ఆయా విభాగాల్లో మంచి మార్కెట్ వాటా కలిగిన రంగాలు, కంపెనీలను ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుత పరిస్థితుల్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, వినియోగం, హెల్త్‌కేర్ వంటి రంగాలు ఇన్వెస్టర్లకు కొంతమేర రక్షణాత్మక రంగాలుగా భావించవచ్చు. పరిస్థితులు వేరు దశాబ్ద కాలం క్రితం ఫైనాన్షియల్ అంశాలు సంక్షోభానికి కారణం కారణంగా ప్రస్తుతం కరోనా వైరస్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆర్థికపరంగానూ సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్త లాక్‌డవున్‌ల కారణంగా ఆర్థిక వ్యవస్థలు నీరసిస్తున్నాయి. అయితే ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల మద్దతుతో వచ్చే ఏడాదికల్లా ప్రపంచ జీడీపీ పుంజుకునే వీలుంది. అదీకాకుండా కోవిడ్-19కు వ్యాక్సిన్ వెలువడితే.. మార్కెట్లు మరింత వేగమందుకోవచ్చు. -
గోల్డ్..క్రూడ్..రయ్ రయ్!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రెండు కమోడిటీలు బంగారం, క్రూడ్ రెండూ 2020లో అప్‌ట్రెండ్‌లోనే ఉంటాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం... గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా ఒక నివేదికలో అంచనా వేసింది. ఈ సంస్థ ఇంకా ఏమని చెబుతోందంటే... ‘‘అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్ (నైమెక్స్)లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 2020లో సగటున 1,600 డాలర్లుగా ఉంటుంది. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఎంచుకునే అవకాశాలున్నాయి. 2019లో ఇప్పటివరకూ పసిడి 14 శాతం పెరిగింది. ఒకే ఏడాది ఈ స్థాయిలో పసిడి ధర బలపడ్డం 2010 తరువాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో గడిచిన 52 వారాల్లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి బంగారం ధరను ఒకదశలో 1,566 డాలర్లకూ చేర్చాయి. తర్వాత దాదాపు 100 డాలర్ల కరెక్షన్కు గురై... ప్రస్తుతం 1,470– 80 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. అమెరికా– చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు, అమెరికా కార్మిక మార్కెట్ పటిష్టత ఈ కరెక్షన్కు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ఈ ఆశారేఖల వల్ల పసిడి సమీప కాలంలో తగ్గితే తగ్గవచ్చు. దీర్ఘకాలంలో చూస్తే, ప్రపంచ వృద్ధి అంతంతమాత్రమే. ఉపాధి కల్పన రేటు కూడా బలహీనంగానే ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో పసిడి పరుగుకే అవకాశాలెక్కువ. ప్రధాన అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబాల పొదుపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి వంటి రక్షణాత్మక అసెట్స్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులన్నీ కలిసి దాదాపు 750 టన్నుల పసిడిని కొనుగోలు చేయడం కూడా చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం. ఉత్పత్తి కోతతో క్రూడ్ భగభగలు... 2020లో క్రూడ్ ధరల అంచనాలను కూడా పెంచుతున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచీ... ఉత్పత్తిలో కోత పెట్టాలని పెట్రోలియం ఎగమతి దేశాల సంఘం (ఒపెక్), దాని మిత్ర దేశాలు ఒక అంగీకారానికి రావడం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చమురు నిల్వలు కొంత తగ్గే అవకాశం ఉంది. ఇది తొలి ఆరు నెలల్లో క్రూడ్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. 2020లో బ్రెంట్ ధర బేరల్‌కు సగటున 60 డాలర్లు ఉంటుందన్న తొలి అంచనాలను 63కు పెంచుతున్నాం. నైమెక్స్ లైట్ స్వీట్ ధరను కూడా 55.3 డాలర్ల నుంచి 58.5 డాలర్లకు పెంచుతున్నాం’’ అని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. 2020 మధ్య నుంచి చల్లారవచ్చు: మోర్గాన్ స్టాన్లీ ఇదిలావుంటే... వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి ఉత్పత్తిలో కోత పెట్టాలన్న ఒపెక్, దాని మిత్రపక్షాల నిర్ణయం స్వల్పకాలికంగానే క్రూడ్ ధర పెరుగుదలకు దారితీయవచ్చని మరో దిగ్గజ సంస్థ– మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. 2020 మధ్యస్థం నుంచీ ధరలు తిరిగి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ 2020 మధ్య నుంచీ 60 డాలర్లుగానే కొనసాగే వీలుందని, దీనికి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితే కారణమని అభిప్రాయపడింది. మొదటి త్రైమాసికం అంచనా మాత్రం 62.50 డాలర్లుగా పేర్కొంది. మరి రూపాయి పరిస్థితి? అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పెరిగితే, అది డాలర్ మారకంలో రూపాయి విలువకు ప్రతికూలాంశమేనని నిపుణుల అభిప్రాయం. గత ఏడాది అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 12 పైసలు బలపడి నెల గరిష్టం 70.92కు చేరింది. -
భారత్ నుంచి వైదొలగనున్న ఆర్బీఎస్
లండన్: వరుసగా ఏడో సంవత్సరం నష్టాలు నమోదు చేసిన నేపథ్యంలో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్(ఆర్బీఎస్) తమ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణపై మరింత దృష్టి పెట్టింది. భారత్ సహా 24 దేశాల్లో కార్యకలాపాలను నిలిపివేయాలని యోచిస్తోంది. భారత్‌లో కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాలను విక్రయించాలని బ్యాంక్ భావిస్తున్నట్లు సమాచారం. 2007లో డచ్ బ్యాంక్ ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ కొనుగోలుతో సదరు బ్యాంక్ భారత కార్యకలాపాలు కూడా ఆర్‌బీఎస్‌కు దక్కాయి. అయితే, ఆ తర్వాత ఏడాది అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ ప్రభావం ఆర్బీఎస్పై కూడా పడింది. దీంతో అప్పటినుంచి క్రమక్రమంగా భారత్ సహా ఇతర దేశాల్లో కార్యకలాపాలను బ్యాంక్ తగ్గించుకుంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్‌లోని 8 శాఖల్లో ఆర్‌బీఎస్‌కి 800 మంది, ఇతరత్రా బ్యాంక్ ఆఫీస్ కార్యకలాపాల్లో 10,000పైగా ఉద్యోగులు ఉన్నారు.