గోల్డ్‌..క్రూడ్‌..రయ్‌ రయ్‌! | International Investment Banking Giant Plans To Increase Rates On Gold | Sakshi
Sakshi News home page

గోల్డ్‌..క్రూడ్‌..రయ్‌ రయ్‌!

Published Wed, Dec 11 2019 12:16 AM | Last Updated on Wed, Dec 11 2019 4:40 AM

International Investment Banking Giant Plans To Increase Rates On Gold - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రెండు కమోడిటీలు బంగారం, క్రూడ్‌ రెండూ 2020లో అప్‌ట్రెండ్‌లోనే ఉంటాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం... గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజాగా ఒక నివేదికలో అంచనా వేసింది. ఈ సంస్థ ఇంకా ఏమని చెబుతోందంటే... ‘‘అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 2020లో సగటున 1,600 డాలర్లుగా ఉంటుంది. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు పసిడిని ఎంచుకునే అవకాశాలున్నాయి.

2019లో ఇప్పటివరకూ పసిడి 14 శాతం పెరిగింది. ఒకే ఏడాది ఈ స్థాయిలో పసిడి ధర బలపడ్డం 2010 తరువాత ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్‌లో గడిచిన 52 వారాల్లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 1,248 డాలర్ల కనిష్ట స్థాయిని చూసింది. అమెరికా– చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఉత్తరకొరియా, ఇరాన్‌ వంటి దేశాలకు సంబంధించి భౌగోళిక ఉద్రిక్తతలు వంటివి బంగారం ధరను ఒకదశలో 1,566 డాలర్లకూ చేర్చాయి.

తర్వాత దాదాపు 100 డాలర్ల కరెక్షన్‌కు గురై... ప్రస్తుతం 1,470– 80 డాలర్ల శ్రేణిలో ట్రేడవుతోంది. అమెరికా– చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు, అమెరికా కార్మిక మార్కెట్‌ పటిష్టత ఈ కరెక్షన్‌కు ప్రధాన కారణాలు. ప్రస్తుతం ఈ ఆశారేఖల వల్ల పసిడి సమీప కాలంలో తగ్గితే తగ్గవచ్చు. దీర్ఘకాలంలో చూస్తే, ప్రపంచ వృద్ధి అంతంతమాత్రమే. ఉపాధి కల్పన రేటు కూడా బలహీనంగానే ఉంటుంది.

దాంతో దీర్ఘకాలంలో పసిడి పరుగుకే అవకాశాలెక్కువ. ప్రధాన అభివృద్ధి చెందిన దేశాల్లో కుటుంబాల పొదుపులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి వంటి రక్షణాత్మక అసెట్స్‌లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్‌ బ్యాంకులన్నీ కలిసి దాదాపు 750 టన్నుల పసిడిని కొనుగోలు చేయడం కూడా చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం.

ఉత్పత్తి కోతతో క్రూడ్‌ భగభగలు... 
2020లో క్రూడ్‌ ధరల అంచనాలను కూడా పెంచుతున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచీ... ఉత్పత్తిలో కోత పెట్టాలని పెట్రోలియం ఎగమతి దేశాల సంఘం (ఒపెక్‌), దాని మిత్ర దేశాలు ఒక అంగీకారానికి రావడం దీనికి ప్రధాన కారణం. దీనివల్ల చమురు నిల్వలు కొంత తగ్గే అవకాశం ఉంది.

ఇది తొలి ఆరు నెలల్లో క్రూడ్‌ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. 2020లో బ్రెంట్‌ ధర బేరల్‌కు సగటున 60 డాలర్లు ఉంటుందన్న తొలి అంచనాలను 63కు పెంచుతున్నాం. నైమెక్స్‌ లైట్‌ స్వీట్‌ ధరను కూడా 55.3 డాలర్ల నుంచి 58.5 డాలర్లకు పెంచుతున్నాం’’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ తెలిపింది.

2020 మధ్య నుంచి చల్లారవచ్చు: మోర్గాన్‌ స్టాన్లీ 
ఇదిలావుంటే... వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నుంచి ఉత్పత్తిలో కోత పెట్టాలన్న ఒపెక్, దాని మిత్రపక్షాల నిర్ణయం స్వల్పకాలికంగానే క్రూడ్‌ ధర పెరుగుదలకు దారితీయవచ్చని మరో దిగ్గజ సంస్థ– మోర్గాన్‌ స్టాన్లీ అభిప్రాయపడింది.

2020 మధ్యస్థం నుంచీ ధరలు తిరిగి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. బ్రెంట్‌ క్రూడ్‌ 2020 మధ్య నుంచీ 60 డాలర్లుగానే కొనసాగే వీలుందని, దీనికి అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితే కారణమని అభిప్రాయపడింది. మొదటి త్రైమాసికం అంచనా మాత్రం 62.50 డాలర్లుగా పేర్కొంది.

మరి రూపాయి పరిస్థితి? 
అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పెరిగితే, అది డాలర్‌ మారకంలో రూపాయి విలువకు ప్రతికూలాంశమేనని నిపుణుల అభిప్రాయం. గత ఏడాది అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది.

తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో 12 పైసలు బలపడి నెల గరిష్టం 70.92కు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement