investmentst
-
సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్‌యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్‌తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది. రెండవ స్థానంలో మహీంద్రా.. ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్‌యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్‌తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్‌యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్‌యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. -
పరిశ్రమలు వద్దనడమే రాజకీయమా?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీకి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అయినా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్ధతిగా వ్యవహరించిందని అనిపించేది. పెట్టుబడులు రావడం లేదని ఓవైపు ఆరోపిస్తూనే, వస్తున్నవాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారి ఉద్దేశం స్పష్టం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. కాకినాడ జిల్లా కోన వద్ద సుమారు 8,500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడా నికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో ‘డీపీఆర్’ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాథమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వక పోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిందంటూ మండిపడుతున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే– ఇదే టీడీపీ, టీడీపీ మీడియా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేవి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల రామకృష్ణుడు ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. మరో వైపు గుజరాత్‌కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతం కలుషితం అవుతుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అధికారంలో ఉంటే కాలుష్యం ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే దాన్ని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కానీ అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం! పరిశ్రమలు తీసుకురండి, కానీ కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా, వద్దను కుంటున్నారా? నిజంగానే కాలుష్యంపై అంత శ్రద్ధ ఉంటే, తిరుపతిలో అమర రాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యం గురించి ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంత చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహద పడతారా? ఆ మాటకు వస్తే, అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని నిర్మాణం చేపడతారా? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తున్నారే? తమ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా? గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంటగ్యాస్ కనెక్షన్లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావిం చింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్ర కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఫిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్‌లో ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధానిని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నా రని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తేవారు. అధికారం కోల్పో యిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఏపీలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డు కోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడే యత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ విద్యార్థులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వస్తే సుమారు యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పది వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ, ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశంకు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరి తెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా? ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంతో దుర్మార్గంగా కథనాలు ఇస్తోంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్య కారక పరిశ్రమలపై స్పష్టమైన విధానం ప్రకటించారు. కాలుష్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదనీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామనీ అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య ఒక కర్మాగారం కాలుష్యాన్ని జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ విష యాలు యనమల, చంద్రబాబు వంటివారికి తెలియవని కావు. కానీ తమను ఓడించిన ఏపీ ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది! పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది! ప్రభుత్వంపై విధ్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు నిజంగా విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి. తాజాగా ఏపీకి సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని టీడీపీ అడ్డుకోకుండా ఉంటే మంచిది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి. చంద్రబాబు, యనమల వంటివారినీ, దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న మీడియానూ ఎదుర్కుంటూ ధైర్యంగా ముందుకు సాగు తున్నారు. ఎన్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, ఏపీ భవి ష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణ పాఠం చెబుతారు. కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
8288 కోట్లు పీఈ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు ఏటేటా వృద్ధి చెందుతున్నాయి. దేశంలోని మొత్తం పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 17 శాతం నిధులు నగర రియల్టీ రంగం ఆకర్షించిందని వెస్టియాన్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ నివేదిక తెలిపింది. 2017లో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2018 నాటికి 8288 కోట్లకు (1184 మిలియన్ డాలర్లు) పెరిగాయి. ఇక, 2015లో 120 మిలియన్ డాలర్లు, 2016లో 170 మిలియన్ డాలర్లు పీఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి 2018లో 7.2 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 65 డీల్స్ జరిగాయి. 2017లో 7.8 బిలియన్ డాలర్ల నిధులొచ్చాయి. మొత్తం పీఈ నిధుల్లో 58 శాతం వాటాతో వాణిజ్య రియల్టీలోకి 4123 మిలియన్ డాలర్లు, 29 శాతం నిధులు నివాస విభాగంలోకి వచ్చాయి. దక్షిణాది టాప్.. పీఈ నిధుల ఆకర్షణలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. 47 శాతం వాటాతో 3403 మిలియన్ డాలర్లు దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చాయి. పశ్చిమాది రాష్ట్రాల్లో 39 శాతం వాటాతో 2803 మిలియన్ డాలర్లు, ఉత్తరాది ప్రాంతాల్లో 905 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నగరాల వారీగా పీఈ పెట్టుబడులు గమనిస్తే.. అత్యధికంగా ముంబై నగరానికి 34 శాతం వాటాతో 2456 మిలియన్ డాలర్ల నిధులొచ్చాయి. 23 శాతం వాటాతో బెంగళూరులోకి 1620 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. బెంగళూరులో సగటు పీఈ డీల్ విలువ 135 మిలియన్ డాలర్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో 132 మిలియన్ డాలర్లుగా ఉంది. అత్యధికంగా ముంబైలో 19 పీఈ డీల్స్ జరిగాయి. బెంగళూరులో 12, హైదరాబాద్‌లో 8 డీల్స్ జరిగాయి. తాజా తాజా పీఈ.. 2019 జనవరి నుంచి మార్చి నాటికి దేశీయ రియల్టీ రంగంలోకి 320 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ వెంచర్, పిరామల్ ఫండ్, కొటక్ రియాలిటీ, జేఎం ఫైనాన్షియల్ బెంగళూరులోని ఆదర్శ్ డెవలపర్స్‌లో 182 మిలియ్న్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. కేకేఆర్ ఎంబసీ గ్రూప్‌లో 102 మిలియన్ డాలర్లు, కొటక్ రియాలిటీ కోల్‌కతాలోని శ్రీరామ్ ప్రాపర్టీస్‌లో 5.66 మిలియన్ డాలర్లు, ఐఎఫ్‌సీ ఎన్సీఆర్లోని సిగ్నేచర్ గ్లోబల్‌లో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. హైదరాబాద్ ఫోనిక్స్ గ్రూప్‌లో.. 2018లో హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ గ్రూప్ మూడు దఫాలుగా 751.50 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులను సమీకరించింది. అసెండస్, ఎక్స్యాండర్ సంస్థలు ఫోనిక్స్ కమర్షియల్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాయి. ఇతర నగరాల్లో చూస్తే.. బెంగళూరులోని భారతీయ సిటీ డెవలపర్స్‌లో పిరామల్ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ 578.64 మిలియన్ డాలర్లు, ముంబైలోని ఇక్వినాక్స్ బిజినెస్ పార్క్‌లో బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, పిరామల్ ఫండ్, జీఐసీలు 1500 మిలియన్ డాలర్లు, చెన్నైలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో మాప్లేట్రీ ఇన్వెస్ట్మెంట్స్, బ్లాక్‌స్టోన్‌లు 486 మిలియన్ డాలర్లు, ఎన్సీఆర్లోని డీఎల్ఎఫ్లో హెచ్ఐఎన్ఈఎస్ 126.80 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు పెట్టాయి. రెరా, జీఎస్టీలే ఊతం ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించడం, జీఎస్టీ అమలులో దేశంలోని అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ దృష్టి ఇండియా మీద పడింది. ప్రత్యేకించి రెరా, బినామీ ట్రాన్సాక్షన్ చట్టాలతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొంది. దీంతో పీఈ, సంస్థాగత పెట్టుబడులు వృద్ధి చెందుతున్నాయి. – శ్రీనివాస్ రావు, సీఈఓ– ఏపీఏసీ, వెస్టియాన్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ -
రూ.23 వేల కోట్ల మలేసియా పెట్టుబడులు
అమరావతి: మలేసియాకు చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడే ఏడు అవగాహనా ఒప్పందాలకు ‘ఆసియాన్- ఇండియా బిజినెస్ లీడర్షిప్ సమ్మిట్’ పేరిట కౌలాలంపూర్‌లో జరిగిన వాణిజ్య సదస్సు వేదికగా నిలిచింది. రాష్ట్ర యువజన, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో ఏపీ నుంచి వెళ్లిన బృందం కౌలాలంపూర్ వాణిజ్య సదస్సులో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఎఎస్ఈఎన్)తో జరిపిన చర్చల దరిమిలా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియన్ కంపెనీలు ముందుకొచ్చాయి. తన సభ్య సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏపీలో ఆయిల్ పామ్ సంబంధిత బయోడీజిల్ ఉత్పత్తుల ప్రాజెక్టును ఏర్పాటుచేయడానికి మలేసియన్ బయోడీజిల్ అసోసియేషన్ (ఎంబీఏ) సంసిద్ధత తెలియజేసింది. రూ.6,713 కోట్ల పెట్టుబడులతో దాదాపు 5 వేల ఉద్యోగాల కల్పనకు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించే ఈ ప్రాజెక్టుపై ఏపీఈడీబీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. రూ.167.50 కోట్ల ప్రాథమిక పెట్టుబడులతో నవ్యాంధ్రలో పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టును స్థాపించేందుకు అంటా స్ట్రాటజిక్ సర్విసెస్ ఆసక్తి కనబరచింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రోటాస్కో బెర్హాద్, కోప్ మేంటాప్ బెర్హాద్ (మలేసియాలో పోలీస్ సహకార సంస్థ) అనే రెండు కంపెనీలు రూ.3,360కోట్ల అంచనాతో రాష్ట్రంలో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీఈడీబీతో కలిసి అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. అలాగే, రూ.6,720 కోట్ల వ్యయంతో హైగార్డ్ ఎస్డీఎన్ బీహెచ్డీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కనస్ట్రక్షన్ కంపెనీ ఏపీలో వాటర్, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీనిపై ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇదే సంస్థ ఏపీలో రూ.2,688 కోట్ల నుంచి రూ.3,360 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఇంటిగ్రేటెడ్ రిటైల్ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. దీనిపై ఈడీబీతో కలిసి ఎంవోయూపై సంతకాలు చేసింది. మరో ఒప్పందం ఫుడ్ , బేవరేజ్ రంగానికి సంబంధించినది. రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేర దశల వారీగా పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేసే పరిశ్రమను నెలకొల్పడానికి సుమ్విన్ సొల్యూషన్స్ మలేసియా ఎస్డీఎన్ బీహెచ్డీ సంస్థ ఆసక్తి కనబరచింది. దీనిపై ఉభయుల మధ్యా అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వెయ్యి కొత్త కొలువులు వస్తాయని అంచనావేస్తున్నారు. రూ.33.5 కోట్ల నుంచి రూ.67 కోట్ల వరకు పెట్టుబడులు సమకూర్చుతూ బయోటెక్నాలజీ, ఇతర రంగాలలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎన్టోగెనెక్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. దీనిపై ఈడీబీతో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ద్వారాలు తెరిచివున్నాయని, సహజ వనరులు, మానవ వనరులు, ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం వున్నాయని ఏపీ నుంచి వెళ్లిన బృందం మలేసియన్ పెట్టుబడిదారులకు విశదీకరించింది. రాష్ట్రానికి వచ్చి విరివిగా పెట్టుబడులు పెట్టాలని కోరింది. మలేసియా, ఏపీల మధ్య పరస్పర వాణిజ్య, వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఏపీ ఎకనామిక్ బోర్డు, పెమాండు, మలేసియా పీఎంవోల ప్రాతినిధ్యంతో పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ముస్తఫా మహమ్మద్ ఏపీ బృందానికి సూచించారు. దీనికోసం వెంటనే మలేసియాలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆయన ఈడీబీని కోరారు. నవ్యంధ్రప్రదేశ్ను అనతికాలంలోనే రెండంకెల వృద్ధి దిశగా నడిపించడం అనితరసాధ్యమని ముస్తఫా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసించారు. కొత్త రాష్ట్ర వికాసానికి మలేసియా ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా సహకారం వుంటుందని చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ కృష్ణకిశోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.