ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఏపీకి వస్తున్న పరిశ్రమలను అడ్డుకునే పనిలో పడిందా? ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రానికి రాసిన ఒక లేఖను చూస్తే ఈ విషయం అవగతం అవుతుంది. ఇది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా అయినా బల్క్ డ్రగ్ పార్కును స్వాగతించి ఉంటే ఆ పార్టీ పద్ధతిగా వ్యవహరించిందని అనిపించేది. పెట్టుబడులు రావడం లేదని ఓవైపు ఆరోపిస్తూనే, వస్తున్నవాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వారి ఉద్దేశం స్పష్టం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది.
కాకినాడ జిల్లా కోన వద్ద సుమారు 8,500 ఎకరాల విస్తీర్ణంలో బల్క్ డ్రగ్ పార్క్ చేపట్టడా నికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పార్కు కోసం తెలంగాణ, తమిళనాడుతో సహా పదిహేడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. కేంద్రం అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకుని హిమచల్ ప్రదేశ్, గుజరాత్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది. తొంభై రోజులలో ‘డీపీఆర్’ పంపితే సుమారు వెయ్యి కోట్ల మేర నిధులు కేటాయించి ప్రాథమిక సదుపాయాలు కల్పించడానికి సహకరించనుంది. ఇది అంతా సంతోషించవలసిన విషయం. ఆంధ్రప్రదేశ్‌కు పరిశ్రమలు రావడానికి ఉన్న అవరోధాలను అధిగమించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. ఈ బల్క్ డ్రగ్ పార్కు తెలంగాణకు ఇవ్వక పోవడం అన్యాయమని ఆ రాష్ట్ర మీడియా విమర్శిస్తోంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిందంటూ మండిపడుతున్నారు. కానీ తెలుగుదేశం మాత్రం ఈ పార్కును ఏపీకి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నది. ఒకవేళ కేంద్రం తెలంగాణకు ఈ పార్కును ఇచ్చి ఉంటే– ఇదే టీడీపీ, టీడీపీ మీడియా గగ్గోలు పెట్టేవి. పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోతున్నాయని ప్రచారం చేసేవి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుమతితోనే ఈ లేఖ రాశానని యనమల రామకృష్ణుడు ప్రకటించినట్లు కూడా సమాచారం వచ్చింది. తన పేరుతో ఇలాంటి లేఖ రాస్తే పార్టీకి నష్టం వస్తుందని సందేహించి యనమలతో చంద్రబాబు రాయించారని అనుకోవచ్చు. మరో వైపు గుజరాత్‌కు బల్క్ డ్రగ్ పార్కు ఇవ్వడాన్ని అక్కడి ప్రతిపక్షాలు స్వాగతించాయి. టీడీపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో, ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో ఇలాంటి పరిశ్రమలు పురుడు పోసుకుంటే తమకు పుట్టగతులు ఉండవని టీడీపీ భయపడుతోంది. యనమల రామకృష్ణుడు ఈ ప్రాజెక్టు ఇవ్వవద్దని ఏకంగా కేంద్ర రసాయనాల శాఖ అధికారులకు లేఖ రాశారు. దానికి కారణం బల్క్ డ్రగ్ పార్కు వల్ల ఆ ప్రాంతం కలుషితం అవుతుందని అంటున్నారు. మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో తుని ప్రాంతంలో కొన్ని కాలుష్య కారక పరిశ్రమలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం ఆ పరిశ్రమలకు ఎలా మద్దతు ఇచ్చింది? అంటే తమ పార్టీ అధికారంలో ఉంటే కాలుష్యం ఉన్నా ఫర్వాలేదని చెబుతున్నారా? ఎక్కడైనా కాలుష్యం అధికంగా ఉంటే దాన్ని అదుపు చేయాలని కోరడం తప్పు కాదు. కానీ అసలు పరిశ్రమే వద్దనడం ఎంత మూర్ఖత్వం! పరిశ్రమలు తీసుకురండి, కానీ కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోండి అని చెప్పవలసిన నేతలు ఇలా దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారంటే వారు టీడీపీకి భవిష్యత్తు ఉండాలని అనుకుంటున్నారా, వద్దను కుంటున్నారా?
నిజంగానే కాలుష్యంపై అంత శ్రద్ధ ఉంటే, తిరుపతిలో అమర రాజా బ్యాటరీస్ సంస్థ నుంచి వస్తున్న కాలుష్యం గురించి ప్రభుత్వం నోటీసు ఇస్తే టీడీపీ ఎంత యాగీ చేసింది? వీరికి అంత చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడు స్వయంగా కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ భవంతిలో నివసిస్తూ కృష్ణా నది కాలుష్యానికి దోహద పడతారా? ఆ మాటకు వస్తే, అసలు మూడు పంటలు పండే పచ్చటి వేల ఎకరాల భూమిని సేకరించి రాజధాని నిర్మాణం చేపడతారా? ఇప్పటికీ అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతూ గొడవ చేస్తున్నారే? తమ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం పర్యావరణం పాడైపోయినా ఫర్వాలేదా?
గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్పాలి. 1999 ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు కేంద్రం మంజూరు చేసిన వంటగ్యాస్ కనెక్షన్లను తన రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ భావిం చింది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రోశయ్య, పర్వతనేని ఉపేంద్ర కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ సంగతి తెలిసిన వెంటనే టీడీపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే ఫిర్యాదు చేస్తారా అని జనంలో ప్రచారం చేశారు. అదే కాదు, పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని గత టరమ్‌లో ఎవరైనా కేంద్రానికి ఫిర్యాదు చేస్తే, ఇదే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారని విమర్శించేవారు. అమరావతి రాజధానిని అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నా రని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తే, తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తేవారు. అధికారం కోల్పో యిన తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ పల్లవి మార్చేసింది. ఎక్కడైనా ఏపీలో ఏదైనా మంచి పని జరిగితే దానిని ఎలా అడ్డు కోవాలన్న ఆలోచన చేస్తోంది. చివరికి పేదల ఇళ్ల స్థలాల విషయాన్ని కూడా కోర్టుకు తీసుకు వెళ్లి అడ్డుపడే యత్నం చేశారు. ఆంగ్ల మీడియం ప్రవేశ పెడుతుంటే తెలుగు నాశనం అవుతోందని గగ్గోలు పెడుతూ విద్యార్థులకు కీడు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఇప్పుడు ఏకంగా భారీ పరిశ్రమలు రావడానికి అవకాశం ఉన్న బల్క్ డ్రగ్ పార్కునే అడ్డుకునే యత్నం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు వస్తే సుమారు యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. పది వేల నుంచి ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అనేక అనుబంధ, ఉప పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడం తెలుగుదేశంకు ఇష్టం లేదని అనుకోవాలి. అందుకే ఇలా అడ్డగోలుగా వ్యతిరేక ప్రచారానికి బరి తెగించారు. అయితే పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినా అందులో చంద్రబాబు ఈ అంశం గురించి మాట్లాడలేదంటేనే తేలు కుట్టిన దొంగ మాదిరి భయపడ్డారని అనుకోవచ్చా?
ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుంటే టీడీపీ మీడియా ఎంతో దుర్మార్గంగా కథనాలు ఇస్తోంది. నిజానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక, కాలుష్య కారక పరిశ్రమలపై స్పష్టమైన విధానం ప్రకటించారు. కాలుష్యాన్ని అనుమతించే ప్రసక్తే లేదనీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వాటిని ప్రారంభిస్తామనీ అన్నారు. అదే ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ మధ్య ఒక కర్మాగారం కాలుష్యాన్ని జీరో స్థాయికి తెచ్చిన తర్వాతే దాని ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ విష యాలు యనమల, చంద్రబాబు వంటివారికి తెలియవని కావు. కానీ తమను ఓడించిన ఏపీ ప్రజల పట్ల కక్షతోనో, ద్వేషంతోనో ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. ఒక వేళ ఏపీ ప్రభుత్వం తమకు ఈ పార్కు వద్దని చెబితే ఇదే టీడీపీ ఎంత దుష్ప్రచారం చేసేది! పెట్టుబడులు రావడం లేదని ఎలా ఆరోపణలు చేసేది!
ప్రభుత్వంపై విధ్వంసం అంటూ ఆరోపణలు గుప్పించే తెలుగు దేశం పార్టీ చేస్తున్న ఇలాంటి పనులు నిజంగా విధ్వంసం కిందకు వస్తాయని గమనించాలి. తాజాగా ఏపీకి సుమారు లక్షా పాతిక వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పరిశ్రమలు రావడానికి అడుగులు పడుతున్నాయి. వాటిని టీడీపీ అడ్డుకోకుండా ఉంటే మంచిది. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి ప్రతిపక్షం, వారికి మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియాను ఎదుర్కోవడం మరో ఎత్తు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి. చంద్రబాబు, యనమల వంటివారినీ, దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్న మీడియానూ ఎదుర్కుంటూ ధైర్యంగా ముందుకు సాగు తున్నారు. ఎన్నికలలో ఏమవుతుందన్నది పక్కనబెడితే, ఏపీ భవి ష్యత్తుకు ఉపయోగపడే ఇలాంటి పరిశ్రమలను అడ్డుకోకుండా టీడీపీకి జ్ఞానోదయం కలుగుతుందని ఆశిద్దాం. లేకుంటే ప్రజలే వారికి గుణ పాఠం చెబుతారు.
కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment