సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు ఏటేటా వృద్ధి చెందుతున్నాయి. దేశంలోని మొత్తం పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 17 శాతం నిధులు నగర రియల్టీ రంగం ఆకర్షించిందని వెస్టియాన్ గ్లోబల్ వర్క్‌ప్లేస్ సొల్యూషన్స్ నివేదిక తెలిపింది. 2017లో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. 2018 నాటికి 8288 కోట్లకు (1184 మిలియన్ డాలర్లు) పెరిగాయి. ఇక, 2015లో 120 మిలియన్ డాలర్లు, 2016లో 170 మిలియన్ డాలర్లు పీఈ ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి 2018లో 7.2 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 65 డీల్స్ జరిగాయి. 2017లో 7.8 బిలియన్ డాలర్ల నిధులొచ్చాయి. మొత్తం పీఈ నిధుల్లో 58 శాతం వాటాతో వాణిజ్య రియల్టీలోకి 4123 మిలియన్ డాలర్లు, 29 శాతం నిధులు నివాస విభాగంలోకి వచ్చాయి.
దక్షిణాది టాప్..
పీఈ నిధుల ఆకర్షణలో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. 47 శాతం వాటాతో 3403 మిలియన్ డాలర్లు దక్షిణాది రాష్ట్రాల్లోకి వచ్చాయి. పశ్చిమాది రాష్ట్రాల్లో 39 శాతం వాటాతో 2803 మిలియన్ డాలర్లు, ఉత్తరాది ప్రాంతాల్లో 905 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. నగరాల వారీగా పీఈ పెట్టుబడులు గమనిస్తే.. అత్యధికంగా ముంబై నగరానికి 34 శాతం వాటాతో 2456 మిలియన్ డాలర్ల నిధులొచ్చాయి. 23 శాతం వాటాతో బెంగళూరులోకి 1620 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. బెంగళూరులో సగటు పీఈ డీల్ విలువ 135 మిలియన్ డాలర్లుగా ఉండగా.. హైదరాబాద్‌లో 132 మిలియన్ డాలర్లుగా ఉంది. అత్యధికంగా ముంబైలో 19 పీఈ డీల్స్ జరిగాయి. బెంగళూరులో 12, హైదరాబాద్‌లో 8 డీల్స్ జరిగాయి.
తాజా తాజా పీఈ..
2019 జనవరి నుంచి మార్చి నాటికి దేశీయ రియల్టీ రంగంలోకి 320 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ వెంచర్, పిరామల్ ఫండ్, కొటక్ రియాలిటీ, జేఎం ఫైనాన్షియల్ బెంగళూరులోని ఆదర్శ్ డెవలపర్స్‌లో 182 మిలియ్‌న్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. కేకేఆర్ ఎంబసీ గ్రూప్‌లో 102 మిలియన్ డాలర్లు, కొటక్ రియాలిటీ కోల్‌కతాలోని శ్రీరామ్ ప్రాపర్టీస్‌లో 5.66 మిలియన్ డాలర్లు, ఐఎఫ్‌సీ ఎన్‌సీఆర్‌లోని సిగ్నేచర్ గ్లోబల్‌లో 30 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
హైదరాబాద్ ఫోనిక్స్ గ్రూప్‌లో..
2018లో హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ గ్రూప్ మూడు దఫాలుగా 751.50 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులను సమీకరించింది. అసెండస్, ఎక్స్‌యాండర్ సంస్థలు ఫోనిక్స్ కమర్షియల్ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాయి. ఇతర నగరాల్లో చూస్తే.. బెంగళూరులోని భారతీయ సిటీ డెవలపర్స్‌లో పిరామల్ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ 578.64 మిలియన్ డాలర్లు, ముంబైలోని ఇక్వినాక్స్ బిజినెస్ పార్క్‌లో బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, పిరామల్ ఫండ్, జీఐసీలు 1500 మిలియన్ డాలర్లు, చెన్నైలోని షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో మాప్లేట్రీ ఇన్వెస్ట్‌మెంట్స్, బ్లాక్‌స్టోన్‌లు 486 మిలియన్ డాలర్లు, ఎన్‌సీఆర్‌లోని డీఎల్‌ఎఫ్‌లో హెచ్‌ఐఎన్‌ఈఎస్ 126.80 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు పెట్టాయి.
రెరా, జీఎస్‌టీలే ఊతం
ఎఫ్‌డీఐ నిబంధనలను సరళీకరించడం, జీఎస్‌టీ అమలులో దేశంలోని అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ దృష్టి ఇండియా మీద పడింది. ప్రత్యేకించి రెరా, బినామీ ట్రాన్సాక్షన్ చట్టాలతో రియల్టీ రంగంలో పారదర్శకత నెలకొంది. దీంతో పీఈ, సంస్థాగత పెట్టుబడులు వృద్ధి చెందుతున్నాయి.
– శ్రీనివాస్ రావు, సీఈఓ– ఏపీఏసీ, వెస్టియాన్ గ్లోబల్ వర్క్‌ప్లేస్
Comments
Please login to add a commentAdd a comment