రూ.23 వేల కోట్ల మలేసియా పెట్టుబడులు | Andhra Pradesh government inks pact with Malaysia's | Sakshi
Sakshi News home page

రూ.23 వేల కోట్ల మలేసియా పెట్టుబడులు

Published Thu, Jul 21 2016 7:41 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

Andhra Pradesh government inks pact with Malaysia's

అమరావతి: మలేసియాకు చెందిన పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు దోహదపడే ఏడు అవగాహనా ఒప్పందాలకు ‘ఆసియాన్- ఇండియా బిజినెస్ లీడర్‌షిప్ సమ్మిట్’ పేరిట కౌలాలంపూర్లో జరిగిన వాణిజ్య సదస్సు వేదికగా నిలిచింది. రాష్ట్ర యువజన, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో ఏపీ నుంచి వెళ్లిన బృందం కౌలాలంపూర్ వాణిజ్య సదస్సులో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఎఎస్ఈఎన్)తో జరిపిన చర్చల దరిమిలా నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు మలేసియన్ కంపెనీలు ముందుకొచ్చాయి.

తన సభ్య సంస్థల ఉమ్మడి భాగస్వామ్యంతో ఏపీలో ఆయిల్ పామ్ సంబంధిత బయోడీజిల్ ఉత్పత్తుల ప్రాజెక్టును ఏర్పాటుచేయడానికి మలేసియన్ బయోడీజిల్ అసోసియేషన్ (ఎంబీఏ) సంసిద్ధత తెలియజేసింది.  రూ.6,713 కోట్ల పెట్టుబడులతో దాదాపు 5 వేల ఉద్యోగాల కల్పనకు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించే ఈ ప్రాజెక్టుపై ఏపీఈడీబీతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

రూ.167.50 కోట్ల ప్రాథమిక పెట్టుబడులతో నవ్యాంధ్రలో పునరుత్పాదక ఇంథన ప్రాజెక్టును స్థాపించేందుకు  అంటా స్ట్రాటజిక్ సర్విసెస్ ఆసక్తి కనబరచింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డుతో అవగాహన ఒప్పందం చేసుకుంది.
ప్రోటాస్కో బెర్హాద్, కోప్ మేంటాప్ బెర్హాద్ (మలేసియాలో పోలీస్ సహకార సంస్థ) అనే రెండు కంపెనీలు రూ.3,360కోట్ల అంచనాతో రాష్ట్రంలో నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఏపీఈడీబీతో కలిసి అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.
అలాగే, రూ.6,720 కోట్ల వ్యయంతో హైగార్డ్ ఎస్డీఎన్ బీహెచ్‌డీ, చైనా ఫస్ట్ మెటలర్జికల్ కనస్ట్రక్షన్ కంపెనీ ఏపీలో వాటర్, సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దీనిపై ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నారు.

ఇదే సంస్థ ఏపీలో రూ.2,688 కోట్ల నుంచి రూ.3,360 కోట్ల పెట్టుబడులు పెడుతూ ఇంటిగ్రేటెడ్ రిటైల్ హౌసింగ్ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి సంకల్పించింది. దీనిపై ఈడీబీతో కలిసి ఎంవోయూపై సంతకాలు చేసింది. మరో ఒప్పందం ఫుడ్ , బేవరేజ్ రంగానికి సంబంధించినది. రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేర దశల వారీగా పెట్టుబడులు పెట్టేందుకు దోహదం చేసే పరిశ్రమను నెలకొల్పడానికి సుమ్‌విన్ సొల్యూషన్స్ మలేసియా ఎస్డీఎన్  బీహెచ్‌డీ సంస్థ ఆసక్తి కనబరచింది. దీనిపై ఉభయుల మధ్యా అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వెయ్యి కొత్త  కొలువులు వస్తాయని అంచనావేస్తున్నారు.

రూ.33.5 కోట్ల నుంచి రూ.67 కోట్ల వరకు పెట్టుబడులు సమకూర్చుతూ బయోటెక్నాలజీ, ఇతర రంగాలలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎన్టోగెనెక్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. దీనిపై ఈడీబీతో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ద్వారాలు తెరిచివున్నాయని, సహజ వనరులు, మానవ వనరులు, ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ప్రోత్సాహం వున్నాయని ఏపీ నుంచి వెళ్లిన బృందం మలేసియన్ పెట్టుబడిదారులకు విశదీకరించింది.

రాష్ట్రానికి వచ్చి విరివిగా పెట్టుబడులు పెట్టాలని కోరింది. మలేసియా, ఏపీల మధ్య  పరస్పర వాణిజ్య, వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఏపీ ఎకనామిక్ బోర్డు, పెమాండు, మలేసియా పీఎంవోల ప్రాతినిధ్యంతో  పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ముస్తఫా మహమ్మద్ ఏపీ బృందానికి సూచించారు. దీనికోసం వెంటనే మలేసియాలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆయన ఈడీబీని కోరారు.

నవ్యంధ్రప్రదేశ్‌ను అనతికాలంలోనే రెండంకెల వృద్ధి దిశగా నడిపించడం అనితరసాధ్యమని ముస్తఫా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశంసించారు. కొత్త రాష్ట్ర వికాసానికి మలేసియా ప్రభుత్వం నుంచి అన్నివిధాలుగా సహకారం వుంటుందని చెప్పారు. ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ కృష్ణకిశోర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement