IPC Section 498a
-
భర్తల గోడు చెప్పుకునేందుకు ‘పురుష్ ఆయోగ్’..!
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలు, భార్యల చేతిలో ఇబ్బందులకు గురవుతున్న పురుషులకు కూడా తమ గోడు చెప్పుకునేందుకు ఓ కమిషన్ ఉండాలని బీజేపీ ఎంపీలు హరినారాయణ్ రాజ్‌బిహార్, అన్షుల్ వర్మ అన్నారు. చట్టాలను దుర్వినియోగం చేస్తూ భర్తలకు చుక్కలు చూపెడతున్న భార్యల నుంచి రక్షణ పొందేందుకు ‘పురుష్ ఆయోగ్’ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మగవారి బాధలు చెప్పుకునేందుకు సరైన వేదిక లేనందున ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. పురుష్ ఆయోగ్ ఏర్పాటుకు మద్దతు కూడగట్టేందుకు సెప్టెంబర్ 23న సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో కూడా లేవనెత్తామని పేర్కొన్నారు. డిమాండ్ ఓకే.. కానీ, అనవసరం.. ప్రతి ఒక్కరికి తమ డిమాండ్లను లేవనెత్తే హక్కు ఉంటుందని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్) శనివారం వెల్లడించిన నేపథ్యంలో.. పురుషులకు కూడా ఒక కమిషన్ ఉండాలని కోరుతున్నట్టు ఎంపీలు వివరించారు. అయితే, పురుషుల కోసం ఎలాంటి కమిషన్ ఏర్పాటు అవసరం లేదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ చెప్పడం విశేషం. సెక్షన్ 498ఎ సవరించాలి.. దాడులు, వరకట్న వేధింపుల నుంచి మహిళలకు ఐపీసీలోని సెక్షన్ 498ఎ రక్షణ కల్పిస్తోంది. అయితే, కొందరు మహిళలు ఈ సెక్షన్‌ను ఆసరాగా చేసుకుని వారి భర్తలు, అత్తింటివారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ వర్మ అన్నారు. తప్పుడు కేసుల మూలంగా 1998 నుంచి 2015 వరకు 27 లక్షల మంది అరెస్టయ్యారని తెలిపారు. 498-ఎను సవరిస్తే తప్పుడు కేసులు నమోదు కావని అన్నారు. కాగా, తప్పుడు ఫిర్యాదులతో మగవారిపై కేసుల నమోదు సంఖ్య పెరిగిందని గతేడాది కేంద్ర స్త్రీశిశు సంక్షేమశాఖ మేనకా గాంధీ పేర్కొనడం గమనార్హం. -
శశిథరూర్‌పై చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై చార్జిషీట్ నమోదైంది. తన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్యకు థరూర్ ప్రేరేపించారని అందులో ఆరోపించారు. ఈ మేరకు 3 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో శశిథరూర్‌ను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరముందని చార్జ్‌షీట్‌లో కోర్టుకు తెలిపారు. కేసులో థరూర్‌ను ఏకైక నిందితుడిగా పేర్కొంటూ.. అతనిపై చట్టపరంగా ముందుకెళ్లేందుకు తగిన ఆధారాలున్నాయన్నారు. తిరువనంతపురం ఎంపీగా కొనసాగుతున్న శశి థరూర్‌కు సమన్లు జారీచేయాలని కోర్టును పోలీసులు కోరారు. ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ముందు దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌పై మే 24న విచారణ జరగనుంది. జనవరి 17, 2014న ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్ గదిలో సునంద శవమై కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐపీసీ 498 ఏ(గృహ హింస), 306(ఆత్మహత్యకు పురికొల్పడం)సెక్షన్ల కింద శశిథరూర్‌పై కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ పోలీసుల చార్జిషీట్ అర్థరహితమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని శశిథరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. -
భర్తల ప్రాణాలు తీస్తున్న '498ఎ'
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నాడు వేమన మహాకవి. సంసారం కంటే సముద్రం ఈదడం సులువని కూడా చెప్పారు అనుభవజ్ఞులు. అందుకే పెళ్లంటే నూరెళ్ల మంట అంటూ హెచ్చరిస్తూవుంటారు. ప్రాణిగ్రహణం తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయని బ్రహ్మచారులను పెళ్లైన మగాళ్లు ఆట పట్టిస్తుంటారు. హాస్యం మాటెలావున్నా నిజంగానే పరిణయం మగాళ్ల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మన దేశంలో పెళ్లయిన మగాళ్ల ఆత్మహత్యలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. ప్రతి 9 నిమిషాలకు ఒక వివాహితుడు బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు జాతీయ నేర రికార్డు బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. వివాహిత మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఆత్మహత్యలకు చేసుకుంటున్నారని తెలిపింది. 2012లో వివాహిత పురుషులు 64వేల మంది ప్రాణాలు తీసుకోగా, 32 వేల మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళపై జరుగుతున్న గృహహింసను నిరోధించేందుకు ప్రభుత్వం తెచ్చిన ఐపీసీ సెక్షన్ 498ఎ మగాళ్ల పట్ల మృత్యుశాసనంగా మారుతోంది. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుండడంతో వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. భర్త కుటుంబంపై కక్ష సాధించేందుకు ఈ సెక్షన్‌ను కొంత మహిళలు దుర్వినియోగం చేస్తుండడం మగాళ్ల బలవన్మరణాలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మానసిక క్షోభ ఎదురైన పరిస్థితుల్లో కొందరు భర్తలు ప్రాణాలు తీసుకోవడానికి వెనుకాడడం లేదని విశ్లేషిస్తున్నారు. ఒక్క పశ్చిమబెంగాల్లోనే భర్తల ఆత్మహత్యలు గత రెండేళ్లలో 11 శాతం పెరిగాయి. బెంగాల్లో 498ఎ కింద 1.06 లక్షల కేసులు నమోదు కాగా, 80 వేల మంది భర్తలను అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లో ఇరుకున్నవారే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. అయితే 498ఎ దుర్వినియోగం నిలువరించడం కష్టమైన పని అని పోలీసులు అంటున్నారు. ఆలుమగల అనోన్య దాంపత్యమే దీనికి పరిష్కారమంటున్నారు. కాపురాలు ఏ కలతలు లేకుండా సాఫీగా సాగితే వివాహితుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.