iPhone 6S Plus
-
ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఇక ఇక్కడిదే కొనుకోవచ్చు!
ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగ్గజం ఆపిల్ భారత్‌లో తయారు చేస్తున్న ఏకైక ఫోన్ ఐఫోన్ ఎస్ఈ. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈతో పాటు మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఆపిల్ భారత్‌లో తయారు చేయబోతోంది. అదే ఐఫోన్ 6ఎస్ ప్లస్. ఆపిల్ మరో రెండు వారాల్లో ఐఫోన్ 6ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను బెంగళూరులో తయారుచేయడం ప్రారంభించబోతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పటికే దీని ట్రయల్ ప్రొడక్షన్‌ను ప్రారంభించినట్టు తెలిపాయి. దీంతో ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధరను ఆపిల్ 5 శాతం నుంచి 7 శాతం మేర తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో అత్యంత పాపులర్ అయిన ఐఫోన్లలో ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఒకటి. ఈ ఫోన్ ట్రయల్ ప్రొడక్షన్‌ను బెంగళూరులోని విస్ట్రోన్‌లో ఆపిల్ ప్రారంభించేసింది. పూర్తిగా తయారీ ప్రారంభించిన అనంతరం వెంటనే ఈ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గుదలను కంపెనీ చేపట్టదని, స్థానిక సామర్థ్యం పెంచిన తర్వాతనే ధరల తగ్గుదలను చేపడుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. భారత్ మార్కెట్‌కు అవసరమైన డిమాండ్‌ను వెంటనే విస్ట్రోన్ చేరుకోలేకపోవడమే దీనికి కారణమన్నారు. చైనా నుంచి ఈ ఫోన్ దిగుమతులు కొనసాగుతాయని తెలిపారు. కాగ, గతేడాది మే నుంచి ఐఫోన్ ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆపిల్ భారత్‌లో రూపొందిస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం అత్యంత తక్కువగా రూ.18,799కే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌కు ఇప్పడికీ మంచి స్పందనే వస్తోంది. పలుసార్లు ధరలు తగ్గించిన అనంతరం ప్రస్తుతం ఈ ధరల్లో అందుబాటులో ఉంచింది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ తయారీని కూడా భారత్‌లో ప్రారంభించిన అనంతరం, వెంటనే ధర తగ్గుదల చేపడుతుందని తెలుస్తోంది. ఐఫోన్ 6ఎస్ ప్లస్ ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో రూ.37,999కు లభ్యమవుతోంది. ఆపిల్ ప్రస్తుతం ఫ్లెక్స్, ఫాక్స్‌కాన్, విస్ట్రోన్ వంటి తయారీ కంపెనీలతో చర్చలు జరుపుతోందని, దీంతో తన స్థానిక సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటుందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ఛార్జర్లు, అడాప్టర్లు, ప్యాకింగ్ బాక్స్‌ల తయారీని కూడా భారత్‌లోనే ఆపిల్ చేపట్టబోతుందని తెలుస్తోంది. -
ఆ ఐఫోన్లు చవగ్గా..!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సెకండ్ హ్యాండ్ ఆపిల్ ఫోన్ల విక్రయాలకు మరోసారి తెరలేపింది. రీఫర్బిష్డ్ ఫోన్లను తమ అధికారిక వెబ్ సైట్ లో విక్రయానికి ఉంచినట్టు అధికారికంగా ప్రకటించింది. కొత్త మోడల్స్‌తో పోలిస్తే 15 శాతం డిస్కౌంట్ ధరల్లో వీటిని ఆన్లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు ఆపిల్ ప్రకటించింది. అన్‌లాక్ చేసిన, పునరుద్ధరించిన 6ఎస్, 6 ఎస్‌ప్లస్ లాంటి ఐఫోన్లను ఈ తగ్గింపు ధరల్లో ఫోన్ లవర్స్‌కు అందుబాటులో ఉంచింది. టెక్నాలజీ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం గోల్డ్ కలర్ 64జీబీ 6ఎస్, 6ఎస్ ప్లస్ ఐఫోన్‌ను సుమారు రూ.39వేలకు ($589 డాలర్లు) , సిల్వర్ కలర్ 16GB 6ఎస్ ప్లస్ ఐఫోన్ రూ.35 వేలకు ($ 529) అందుబాటులో ఉంది. కొత్త బ్యాటరీ , కొత్త ఔటర్ షెల్ అమర్చి ఈ పునరుద్ధరించిన ఆపిల్ ఫోన్లకు ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.కాగా ఆపిల్ గతంలో సెకండ్ హ్యాండ్ మ్యాక్‌లు, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటి ఇతర ఆపిల్ ఉత్పత్తులను అమ్మకానికి పెట్టడం తెలిసిందే. ఇలా 2007 లో చివరిసారిగా తన ఉత్పత్తులను విక్రయించింది. -
భారత్‌లోకి ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్
న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ కొత్త బ్రాండ్లు వస్తున్నాయి. వచ్చే నెల 16 నుంచి ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ అందుబాటులోకి రానున్నాయి. యాపిల్ కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. భారత్‌లోకి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ తొందరగా రావడం ఇదే తొలిసారి. ప్రపంచ మార్కెట్లో ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ విడుదలయిన నెల రోజులకే భారత్ మార్కెట్లోకి రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. తొలి మూడు రోజుల్లోనే కోటి 30 లక్షల ఫోన్లను అమ్మినట్టు యాపిల్ ప్రకటించింది. గతేడాది ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాల రికార్డు (కోటి యూనిట్లు)ను బ్రేక్ చేసినట్టు వెల్లడించింది. భారత్‌లో ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్‌లు ధరల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఐఫోన్ 6 ఎస్ కనీస ధర 60 వేల రూపాయలు, ఐఫోన్ 6 ఎస్ ప్లస్ ప్రారంభ ధర 68 వేల రూపాయల నుంచి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్లలో కొత్త త్రీడి టచ్ డిస్ప్లే టెక్నాలజీ, 2 జీబీ రామ్‌తో ఏ 9 ప్రొసెసర్, ios ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి.