చెన్నై చెడుగుడు
కోల్‌కతా నైట్‌రైడర్స్... ఈ సీజన్లో రెండు మ్యాచ్‌ల్లో 18 బంతుల్లోనే 53 పరుగులతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన జట్టు. అలాంటి జట్టుతో చెన్నై చెడుగుడు ఆడుకుంది. 20 ఓవర్లు ఆడినా... 108 పరుగులకు మించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది.ఒక్కముక్కలో చెప్పాలంటే ఈ రోజు ‘పసుపు సేన’ది. కాబట్టే చెపాక్‌లో ‘సూపర్’ కింగ్స్ అజేయంగా నిలిచింది.
చెన్నై: సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్ ఎదురేలేకుండా సాగిపోతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఒకే ఒక్కడు ఆండ్రీ రసెల్ (44 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సూపర్‌కింగ్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి గెలిచింది. డుప్లెసిస్ (45 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు) రాణించాడు.
0, 6, 11, 0...
కోల్‌కతా టాపార్డర్ స్కోరిది! ఆట మొదలైందో లేదో... ఇంకా సీట్లలోకి ప్రేక్షకులు పూర్తిగా కూర్చోకముందే నైట్‌రైడర్స్ పతనం ఫటాఫట్‌గా మొదలైంది. చెన్నై పేసర్ దీపక్ చహర్ నిప్పులు చెరిగాడు. ఓవర్‌కు ఒక వికెట్ చొప్పున లిన్ (0), నితీశ్ రాణా (0), రాబిన్ ఉతప్ప (11)లను పెవిలియన్ చేర్చాడు. ఇది చాలదన్నట్లు హర్భజన్ స్పిన్ మాయలో నరైన్ (6) పడ్డాడు. అంతే 24 పరుగులకే 4 టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఔట్. తర్వాత తాహిర్ కూడా ఓ చెయ్యి వేశాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 19; 3 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (9)లను పెవిలియన్ పంపించాడు.
ఆదుకున్న రసెల్
బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన చెపాక్ పిచ్‌పై టెయిలెండర్లు పీయూష్ చావ్లా (8), కుల్దీప్ (0), ప్రసిధ్ కృష్ణ (0) మాత్రం ఏం చేస్తారు. 79 పరుగులకే 9 వికెట్లను కోల్పోయి వంద కంటే ముందే ఆలౌటయ్యేందుకు కోల్‌కతా సిద్ధమైంది. కానీ ఒక్కడు పోరాటం చేశాడు. పిచ్ పూర్తిగా బౌలర్ల వశమైన తరుణంలో రసెల్ నిలబడ్డాడు. కానీ మిస్సైల్ షాట్లు మాత్రం అంత ఈజీగా రాలేదు. బంతిని బలంగా బాదే క్రమంలో అతను కొద్దిసేపు కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినా మొండిగా కడదాకా బ్యాట్‌ను ఝళిపించాడు. జట్టు స్కోరును వందకు చేర్చాడు. తను 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. హర్భజన్, తాహిర్ చెరో 2 వికెట్లు తీశారు.
రాణించిన డుప్లెసిస్...
సూపర్‌కింగ్స్ సునాయాస లక్ష్యఛేదన వాట్సన్ బౌండరీతో మొదలైంది. కానీ పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆతిథ్య జట్టుకు కష్టాలు తప్పలేదు. 2 ఫోర్లు, సిక్సర్‌తో ఊపుమీదున్న వాట్సన్ (9 బంతుల్లో 17), క్రీజులో నిలబడేందుకు సాహసించిన రైనా (13 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్)లు నరైన్ ఉచ్చులో పడ్డారు. దీంతో 35 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. అందుకేనేమో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పిచ్‌ను గౌరవించారు. ఆచితూచి ఆడుతూ తమ ఆటను మెల్లిగా కొనసాగించారు. డుప్లెసిస్, రాయుడు (31 బంతుల్లో 21; 2 ఫోర్లు) ఒకట్రెండు పరుగులతో, వీలుచిక్కినపుడు బౌండరీతో స్కోరు బోర్డును నడిపించారు. అంతేగానీ అనవసర మెరుపులకు ఆస్కారమివ్వలేదు. ఇద్దరు మూడో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 81 వద్ద రాయుడు షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. తర్వాత కేదార్ జాదవ్ (8 నాటౌట్)తో కలిసి డుప్లెసిస్ మిగతా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. నరైన్‌కు 2 వికెట్లు దక్కాయి.